
పేదరికం... దేశమంతా దృష్టిపెట్టే ప్రాధాన్యతాంశం. పెద్దరికం... ఇప్పుడు కేరళ ప్రభుత్వం ముందున్న ప్రధానాంశం. నిరంతర వలసలతో యువజనం తగ్గిపోయి..
వృద్ధాప్యం వైపు వేగంగా అడుగులు వేస్తున్న కేరళలో పెద్దల సంరక్షణ కీలక విషయంగా మారింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన యూడీఎఫ్ ప్రభుత్వం వయో వృద్ధులకు పెద్దపీట వేసే పనిలో పడింది. వారి సమస్యలను పరిష్కరించి, కొత్త జవసత్వాలివ్వాలని యోచిస్తోంది. దీని కోసం ఓ ప్రత్యేక శాఖనే ఏర్పాటు చేసింది.
దశాబ్దాల క్రితమే కేరళ నుంచి వలసలు మొదలయ్యాయి. దేశ, విదేశాల్లో సేవల నుంచి వ్యాపారాలు, పారిశ్రామిక రంగం దాకా వారు విస్తరించారు. వారు సంపాదించి పంపిన డబ్బుతో కేరళలో చాలా కుటుంబాలు స్థిరపడ్డాయి. ఇళ్లు కట్టుకున్నారు. విద్యకు నిధులు సమకూరాయి. ఎన్నో పేద కుటుంబాలు మధ్యతరగతి, ఉన్నత శ్రేణిలోకి వచ్చేశాయి. అయితే ఆ విజయగాథ వెనక ఓ చీకటి వాస్తవం విస్తరించింది. దేశంలో అత్యంత వేగంగా వృద్ధాప్యంవైపు వెళుతున్న సమాజాల్లో ఒకటిగా కేరళ మారింది. ఈ రాష్ట్ర గ్రామీణ ప్రాంతాల్లో ఒక నిశ్శబ్ద సామాజిక సంక్షోభం ఆవిష్కృతమవుతోంది. ఎక్కడో విదేశాల్లో ఉన్న పిల్లలు ఇంటికి డబ్బు పంపుతున్నా చాలామంది వృద్ధ తల్లిదండ్రులు ఒంటరితనం, నిర్లక్ష్యం, భావోద్వేగపరమైన విస్మరణను అనుభవిస్తున్నారు. దీంతో కేరళలో కొత్తగా ఎన్నికైన యూడీఎఫ్ ప్రభుత్వం వృద్ధుల హక్కులు, సంక్షేమాన్ని పరిరక్షించేందుకు దేశంలోనే తొలిసారిగా వయోవృద్ధుల శాఖను ఏర్పాటుచేసింది. వృద్ధ జనాభా సంక్షోభ స్థాయికి చేరిన జపాన్ తరహాలో ఇక్కడ కూడా ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయాలని భావిస్తోంది. ఈ శాఖ వారి సంక్షేమాన్ని చూడడంతో పాటు వారి నైపుణ్యాలను ఉపయోగించుకునే కార్యక్రమాలకు శ్రీకారంచుడుతోంది. దీంతో పాటు వయోవృద్ధుల న్యాయ కమిషన్నూ ప్రకటించింది.
జపాన్ తరహా సంరక్షణ వ్యవస్థలను కేరళ ప్రవేశ పెట్టడానికి కారణం రెండు సమాజాలూ ఎదుర్కొంటున్న సామాజిక సారూప్యతలే. జపాన్ ప్రభుత్వం అక్కడ పెద్ద వయసు వారికోసం ఏం చేస్తోందంటే...
పెద్ద వయసు వచ్చాక కుటుంబాలపై భారం లేకుండా 40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ బీమా తప్పనిసరి.
వృద్ధుల వైద్య సంరక్షణ, నర్సింగ్, రోజువారీ సహాయాల కోసం ప్రత్యేక సామాజిక వ్యవస్థలు. మున్సిపాలిటీలు,
స్థానిక సంస్థల ఆధ్వర్యంలో డేకేర్ సెంటర్లు, ప్రత్యేక వైద్యశాలలు, సహాయ కేంద్రాల నిర్వహణ.
వృద్ధులు చేయగలిగే ఉద్యోగాల రూపకల్పన.. వారికోసం స్కిల్ సెంటర్ల నిర్వహణ.
వయసు పెరుగుతున్న వారిని శక్తిమంతంగా ఉంచేందుకు దేశవ్యాప్తంగా ప్రత్యేక ఆరోగ్య వ్యవస్థ అమలవుతోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.