
చాలాకాలం క్రితం.. అంటే మన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పుట్టడానికి కొద్ది రోజుల ముందు జరిగిన కథ ఇది. అప్పట్లో యెమెన్ దేశాన్ని ‘అబ్రహ’ అనే ఒక క్రూరమైన రాజు పాలిస్తుండేవాడు.
Jun 25 2026 8:07 AM | Updated on Jun 25 2026 8:07 AM
చాలాకాలం క్రితం.. అంటే మన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పుట్టడానికి కొద్ది రోజుల ముందు జరిగిన కథ ఇది. అప్పట్లో యెమెన్ దేశాన్ని ‘అబ్రహ’ అనే ఒక క్రూరమైన రాజు పాలిస్తుండేవాడు. మక్కా నగరంలోని పవిత్ర ‘కాబా’ మందిరానికి ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు రావడం, అక్కడప్రార్థనలు చేయడం అబ్రహకు అస్సలు నచ్చలేదు. ప్రజలందరూ తన దేశానికే రావాలనుకున్నాడు.
అనుకున్నదే తడవుగా, కోట్లు ఖర్చు పెట్టి తన రాజధానిలో ఒక పెద్ద, అందమైన చర్చిని కట్టించాడు. ‘ఇకపై ఎవరూ మక్కాకు వెళ్లకూడదు, అందరూ నా దగ్గరికే రావాలి‘ అని హుకుం జారీ చేశాడు. ఈ విషయం తెలిసి అరబ్బులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కోపంలో ఒక అరబ్ వ్యక్తి, రాత్రికి రాత్రే అబ్రహ కట్టించిన చర్చిలోకి దూరి, అపవిత్రం చేశాడు. దీంతో అబ్రహకు ఎక్కడలేని కోపం వచ్చింది. ‘నా చర్చిని అవమానిస్తారా? ఆ మక్కాలో ఉన్న కాబా మందిరాన్ని పునాదులతో సహా కూల్చేస్తా!’ అంటూ కరడుగట్టిన సైన్యంతో మక్కా వైపు బయలుదేరాడు.
గజరాజుల సైన్యం.. వణికిపోయిన మక్కా! అబ్రహ సైన్యం మామూలు సైన్యం కాదు. శత్రువులను తొక్కి పారేయడానికి కొండల లాంటి భారీ ఏనుగులను ఆ సైన్యంలో చేర్చాడు. దారిలో అడ్డువచ్చిన చిన్న చిన్న తెగలను చీల్చిచెండాడుతూ అబ్రహ సైన్యం మక్కా సరిహద్దుల్లోకి చేరుకుంది. అక్కడ అమాయక ప్రజల ఆస్తులను, ఒంటెలను దోచుకుంది. అలా దోచబడిన వాటిలో మక్కా నాయకుడు, ప్రవక్త ముహమ్మద్ గారి తాతగారైన ‘అబ్దుల్ ముత్తలిబ్’కు చెందిన 200 ఒంటెలు కూడా ఉన్నాయి. యుద్ధం వద్దనుకుంటే కాబాను కూల్చడానికి అడ్డుపడొద్దని అబ్రహ సందేశం పంపాడు. దాంతో చర్చల కోసం అబ్దుల్ ముత్తలిబ్ నేరుగా అబ్రహ డేరాకు వెళ్లారు. ఆయన గంభీరమైన రూపాన్ని చూసి అబ్రహ ముచ్చటపడ్డాడు. ‘ఏం కావాలి?’ అని అడిగాడు.
‘నీ సైన్యం నా 200 ఒంటెలను పట్టుకెళ్లింది, వాటిని నాకు ఇచ్చేయ్’ అన్నారు అబ్దుల్ ముత్తలిబ్ ప్రశాంతంగా. అబ్రహ ఆశ్చర్యపోయాడు, నవ్వుతూ అవహేళన చేశాడు. ‘మిమ్మల్ని చూసి గొప్పవాడనుకున్నా! నేను మీ పవిత్రమైన కాబా మందిరాన్ని కూల్చేయడానికి వస్తుంటే, దాని గురించి అడగకుండా మీ ఒంటెల గురించి అడుగుతున్నారేంటి?’ అన్నాడు.
దానికి అబ్దుల్ ముత్తలిబ్ ఇచ్చిన సమాధానం చరిత్రలో నిలిచిపోయింది. ఆయన ఎంతో ధీమాగా.. ‘ఆ ఒంటెలకు యజమానిని నేను, అందుకే నా ఒంటెలను అడిగాను. కానీ, ఆ కాబా మందిరానికి ఒక యజమాని (అల్లాహ్) ఉన్నాడు. దానిని ఎలా కాపాడుకోవాలో ఆయనకు బాగా తెలుసు!’ అని చెప్పారు. తిరిగి వచ్చిన అబ్దుల్ ముత్తలిబ్, ప్రజలందరినీ కాబా ఖాళీ చేసి,ప్రాణాలు కాపాడుకోవడానికి చుట్టుపక్కల ఉన్న కొండలపైకి వెళ్ళిపోవాలని ఆదేశించారు.
మోకాళ్లూనిన ఏనుగు.. ఆకాశంలో అద్భుతం! మరుసటి రోజు ఉదయం.. అబ్రహ సైన్యం కాబా వైపు అడుగులు వేయడంప్రారంభించింది. ‘మహమూద్’ అనే ఒక పెద్ద ఏనుగు ఆ సైన్యానికి నాయకత్వం వహిస్తోంది. కానీ, సరిగ్గా కాబా వైపు నడవమనేసరికి ఆ ఏనుగు ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా మోకాళ్లూని కూర్చుండిపోయింది! దానిని ఎంత కొట్టినా, పొడిచినా కదలలేదు. అదే విచిత్రంగా యెమెన్ వైపో, లేదా వేరే దిశల వైపో తిప్పితే మాత్రం పరిగెత్తింది. అబ్రహ సైన్యానికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. సరిగ్గా అదే సమయంలో ఆకాశం ఒక్కసారిగా చీకటిగా మారిపోయింది. సముద్రం వైపు నుండి వేలాది పక్షుల సమూహాలు మక్కా వైపు రాసాగాయి. వాటిని అరబ్బీలో ‘అబాబీల్’ అంటారు. ఆ చిన్న చిన్న పక్షుల నోట్లో ఒక రాయి, రెండు కాళ్లలో రెండు రాళ్లు ఉన్నాయి. అవి మామూలు రాళ్లు కావు.. కాల్చిన మట్టి రాళ్లు (సిజ్జీల్).
తిన్న గడ్డిపరకల్లా.. సర్వనాశనం! ఆ పక్షుల సైన్యం అబ్రహ సైన్యంపైకి రాగానే, తమ కాళ్లలో, నోట్లో ఉన్న రాళ్లను పైనుంచి తుపాకీ గుళ్లలా వర్షింపజేశాయి. ఆ చిన్న రాళ్లు ఏనుగుల మీద, సైనికుల మీద పడగానే.. శరీరాన్ని చీల్చుకుంటూ అవతలికి వెళ్ళిపోయాయి. రాజు అబ్రహతో సహా సైన్యమంతా కకావికలమైపోయింది.
పవిత్ర ఖురాన్ లోని ‘సూరహ్ అల్–ఫీల్’ (105:5) లో దేవుడు చెప్పినట్లుగా.. ఆ భారీ సైన్యం అంతా ‘పశువులు నమిలి పారేసిన గడ్డిపరకల్లా, పొట్టులా’ మారిపోయింది. అహంకారంతో వచ్చిన అబ్రహ ఘోర పరాజయాన్ని మూటగట్టుకునిప్రాణాలతో పారిపోతూ దారిలోనే అంతమయ్యాడు. కాబా మందిరం సురక్షితంగా నిలిచింది! – ముహమ్మద్ ముజాహిద్
సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
పులివెందులలో రెండో రోజు వైఎస్ జగన్ పర్యటన (ఫొటోలు)
ముద్దుల కూతురితో బిగ్బాస్ శివజ్యోతి (ఫొటోలు)
సమంతతో రాహుల్ రవీంద్రన్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
రోజా పువ్వుతో మ్యాడ్ బ్యూటీ పోజులు.. ఫోటోలు
మానవత్వం చాటుకున్న వైఎస్ జగన్.. కాన్వాయ్ అపి మరీ...
సిగ్గులేదా పవన్ కళ్యాణ్... నువ్వింతలా దిగజారిపోతావ్ అని జన్మలో అనుకోలేదు
CI నాగరాజు పాత్రదారుడు మాత్రమే... సూత్రదారులు ఎవరంటే...? పొన్నవోలు కీలక వ్యాఖ్యలు