పుణేకు చెందిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్‌ను హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో తవ్వేకొద్దీ విస్తుపోయే విషయాలు వెలుగుచూస్తున్నాయి.
ప్రియుడితో కలిసి కేతన్‌ను లోయలోకి తోసేసిన కాబోయే భార్య సియా గోయల్ .. తనను ఫోటోలు తీస్తూ ప్రమాదవశాత్తూ కాలుజారి కిందపడిపోయాడని కట్టుకథ అల్లిన విషయం తెలిసిందే. జూన్ 20న ఆమె పుట్టినరోజు కావడంతో ఘనంగా నిర్వహించాలని కేతన్, సియా కుటుంబాలు ప్లాన్ చేశాయి. కాబోయే కోడలి జన్మదినం కోసం కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్.. ప్రముఖ పర్యటక ప్రదేశం మహాబలేశ్వర్‌లోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో ఏకంగా 70 రూమ్‌లు బుక్ చేసినట్టు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, కేతన్, సియా కుటుంబాలు జూన్ 20న మహాబలేశ్వర్‌లో నిందితురాలి పుట్టినరోజును కలిసి జరుపుకోవడానికి ప్రణాళిక వేసుకున్నారు. అయితే, ఆ వేడుకలను రద్దు చేసుకుని, దానికి బదులుగా పుణే సమీపంలోని లోహగడ్ కోటకు వెళ్దామని కేతన్‌ను సియా ఒప్పించినట్లు సమాచారం. కేతన్‌తో సియాకు ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగింది. వచ్చే నవంబర్‌లో అంగరంగ వైభవంగా వివాహం జరగాల్సి ఉంది. కానీ జూన్ 18న సియాతో కలిసి లోహగడ్ కోటలో ట్రెక్కింగ్ చేస్తుండగా కేతన్ లోయలో పడి మరణించాడు. సియా వాంగ్మూలం ఆధారంగా ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా భావించినప్పటికీ, సియా, ఆమె ప్రియుడు చేతన్ చౌధరి (22) లోయలోకి తోసేశారని దర్యాప్తులో వెల్లడైంది.నవంబరు 2025 నుంచి రిలేషన్షిప్సొంతంగా బేకరీ నిర్వహించే సియాకు.. డ్రై ఫ్రూట్ వ్యాపారం చేసే చేతన్ చౌధరి మొదటిసారి గతేడాది నవంబరులో ఓ బిజినెస్ మీటింగ్‌లో కలిశారు. ఈ పరిచయం ఇద్దరి మధ్య సాన్నిహిత్యానికి దారితీసింది. ఇదే సమయంలో ఆమె కుటుంబసభ్యులు పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టి కేతన్ అగర్వాల్‌తో సంబంధం ఖాయం చేశారు. దీంతో తమ బంధానికి అడ్డుగా వస్తాడని భావించిన సియా, చేతన్‌లు.. కేతన్‌ను చంపాలని నిర్ణయించుకుని, కుట్రలు చేశారు. నాలుగు ప్రయత్నాలు తర్వాత చివరకు జూన్ 18న వారి ప్లాన్ వర్కౌట్ అయ్యింది. ముందుగా ప్లాన్ చేసిన ప్రయత్నం విఫలమైతే, వారిద్దరూ 'ప్లాన్ సి'ని కూడా సిద్ధం చేసుకున్నారని విచారణలో వెల్లడైంది.హంతకుల్ని గుర్తించారిలా?పోలీసుల కథనం ప్రకారం.. హత్య జరిగిన రోజున లోహగఢ్ కోట వద్ద మండుటెండలో హుడీ ధరించిన ఒక వ్యక్తిని చూపిస్తున్న అనుమానాస్పద సీసీటీవీ ఫుటేజ్ కీలకమైన ఆధారంగా నిలిచింది. ఆ సీసీటీవీ ఫుటేజ్‌లో కేతన్, సియా కలిసి నడుస్తూ కనిపించారు. సియా ప్రియుడు సుమారు 20-30 అడుగుల దగ్గర నుంచి వారిని అనుసరిస్తూ కనిపించాడు. షార్ట్, హుడీ వేసుకున్న అతడు.. క్యాప్‌తో ముఖాన్ని కప్పి.. హెడ్సెట్ కూడా పెట్టుకున్నాడు. మరో సీసీటీవీ ఫుటేజ్‌లో సియా అకస్మాత్తుగా హుడీ ధరించిన వ్యక్తి వైపు వెనక్కి తిరిగి చూడగా, అతను వెంటనే కూర్చుండిపోయాడు. ఆ సమయంలో ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటే.. అంత వేడిలోనూ అతడు హుడీ వేసుకోవడంతో పోలీసుల అనుమానం మరింత బలపడింది. కేతన్ మరణం తర్వాత సియా ప్రవర్తనలో ఎలాంటి విచారం కనిపించకపోవడం కూడా వారి అనుమానానికి మరో కారణం.