హిందూ దేవాలయాల అభివృద్ధి, పునర్నిర్మాణం కోసం టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవాణి ట్రస్టు నిధులను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని ఆరు ఆలయాల అభివృద్ధి కోసం శ్రీవాణి ట్రస్టు నిధులను కేటాయించేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆరు దేవాలయాల అభివృద్ధి కోసం రూ.9.55 కోట్ల శ్రీవాణి ట్రస్టు నిధుల కేటాయింపునకు ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ ఆరు ఆలయాల్లో మూడు ఏపీకి సంబంధించినవి కాగా.. మరో మూడు ఆలయాలు తెలంగాణలో కొలువై ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ జనసేన నేత, హీరో తనీష్ అల్లాడి ఏపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీటీడికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆరు ఆలయాల కోసం శ్రీవాణి ట్రస్టు నుంచి మంజూరైన రూ.9.55 కోట్ల నిధులలో తెలంగాణలోని మూడు ఆలయాలకే రూ.6.19 కోట్లు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం ఉమ్మడి ఆధ్యాత్మిక వారసత్వ పరిరక్షణ, అభివృద్ధి పట్ల ఉన్న నిబద్ధతను తెలియజేస్తోందన్నారు తనీష్. మన ఉమ్మడి ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రాంతీయ సరిహద్దులకు అతీతంగా పరిరక్షించాలనే నిబద్ధతను ప్రతిబింబిస్తోందని అభిప్రాయపడ్డారు. ఇలాంటి కార్యక్రమాలు తెలుగు ప్రజల మధ్య బంధాలను బలపరిచి, మన దేవాలయాల పరిరక్షణకు, పునరుద్ధరణకు దోహదపడతాయంటూ ట్వీట్ చేశారు. ఆ మూడు ఆలయాలు ఇవే.. శ్రీవాణి ట్రస్టు నిధులు కేటాయించిన ఆరు దేవాలయాల విషయానికి వస్తే.. సిద్ధిపేట జిల్లా దొమ్మాటలోని శ్రీమహాకాళేశ్వర ఆలయానికి అత్యధికంగా రూ.4.60 కోట్లు కేటాయించారు. సంగారెడ్డి జిల్లా కించన్పల్లి లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయానికి రూ.1.09 కోట్లు, సికింద్రాబాద్ శ్రీగిరి ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి ఆలయానికి రూ.50 లక్షలు కేటాయించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ధర్మవరం సిద్ధయ్యగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రూ.50.85 లక్షలు, అనకాపల్లి జిల్లా మునగపాక శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి రూ.1.5 కోట్లు. కర్నూలు జిల్లా హుస్సేనాపురంలోని సుంకులమ్మ, మారెమ్మ ఆలయానికి రూ.1.10 కోట్లు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.మరోవైపు శ్రీవాణి ట్రస్టు నిధుల సాయంతో హిందూ దేవాలయాల పునర్నిర్మాణం, అభివృద్ధి పనులు చేపడుతుంటారు. అలాగే హిందూ ధర్మ ప్రచారం, వివిధ కార్యక్రమాల కోసం ఈ నిధులను వినియోగిస్తుంటారు. ఈ నిధులతోనే 5 వేల భజన మందిరాల నిర్మాణానికి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం సంకల్పించింది.