Pune Ketan Agarwal Murder : పూణేకు చెందిన 26 ఏళ్ల యువ వ్యాపారవేత్త, రియల్ ఎస్టేట్ డైరెక్టర్ కేతన్ అగర్వాల్ లోహ్‌గఢ్ కోటపై 400 అడుగుల లోయలో పడి అనుమానాస్పదంగా మరణించిన కేసు..
ఇప్పుడు ఒక అత్యంత క్రూరమైన పక్కా ప్లాన్డ్ మర్డర్‌గా తేలింది. ప్రమాదవశాత్తూ జరిగిన మరణంగా భావించిన ఈ ఘటన వెనుక కాబోయే భార్య సియా గోయల్, ఆమె సీక్రెట్ ప్రియుడు చేతన్ చౌదరి ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే కేతన్ తండ్రి దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ద్వారా ఈ కేసులో హృదయవిదారకమైన, ఒళ్లు గగుర్పొడిచే షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లికి ముందే తన కాబోయే భార్య ప్రవర్తనపై కేతన్ తన కుటుంబానికి పదే పదే ప్రమాద సంకేతాలను పంపినా.. బంధువుల ద్వారా వచ్చిన సంబంధం కావడంతో కుటుంబ సభ్యులు లైట్ తీసుకున్నారని.. అదే అతడి ప్రాణాలు పోవడానికి కారణమైందని తేలింది. ఆ పూర్తి వివరాలు మీకోసం. ఆమె గురించి పూర్తిగా తెలుసుకున్నారా..?ఎఫ్ఐఆర్ వివరాల ప్రకారం.. 2026 ఫిబ్రవరిలో కేతన్ అగర్వాల్, సియా గోయల్‌కు ఘనంగా నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది చివర్లో వీరిద్దరికీ వివాహం జరగాల్సి ఉంది. అయితే నిశ్చితార్థం జరిగిన కొన్ని నెలల నుంచే కేతన్ తీవ్రమైన మానసిక ఆందోళనకు గురయ్యాడు. సియా ఫోన్ ఎప్పుడూ బిజీగా రావడం, ఆమె తరచూ తన మాటల్లో చేతన్ చౌదరి అనే వ్యక్తి పేరును ప్రస్తావిస్తూ ఉండటంతో కేతన్కు అనుమానం వచ్చింది. "ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ను మీరు సరిగ్గా వెరిఫై చేశారా?" అని కేతన్ తన కుటుంబ సభ్యులను పదే పదే అడిగాడు. కానీ తెలిసిన బంధువుల ద్వారా కుదిరిన సంబంధం కావడంతో కుటుంబం అతనికి నచ్చజెప్పి శాంతింపజేసింది.లోహ్‌గఢ్ కోటకే ఎందుకు..? కేతన్కు ఇష్టం లేకపోయినా.. లోహ్‌గఢ్ కోటకు వెళ్దామంటూ సియా పదే పదే పట్టుబట్టడం అతనిలో మరింత ఆందోళన పెంచింది. కేవలం కొన్ని వారాల వ్యవధిలోనే మే 31వ తేదీ జూన్ 14 తేదీల్లో ఆ దంపతులు రెండుసార్లు లోహ్‌గఢ్ కోటను సందర్శించారు. అయినప్పటికీ.. జూన్ 18వ తేదీన తన బర్త్‌డే వేడుకల నెపంతో మూడోసారి కూడా అదే కోటకు వెళ్దామంటూ సియా తీవ్రమైన ఒత్తిడి తెచ్చింది. జూన్ 18వ తేదీన కేతన్ కివాలే బ్రిడ్జ్ వద్ద సియాను కలిసి.. అక్కడ నుంచి ఆమెతో పాటు లోహ్‌గఢ్ కోటకు బయలుదేరాడు. ఆ తర్వాత కొద్ది గంటలకే కేతన్ కోటపై నుంచి లోయలో పడిపోయాడనే ఘోరవార్త అతని కుటుంబానికి అందింది.చివరి అంత్యక్రియల తర్వాత వీడిన మిస్టరీ..!కేతన్ అంత్యక్రియలు ముగిసిన తర్వాత అతని కుటుంబ సభ్యులు ఆ ప్రమాదం జరిగిన లోహ్‌గఢ్ కోట ప్రాంతాన్ని తిరిగి సందర్శించారు. ఆ స్థలాన్ని నిశితంగా పరిశీలించిన తర్వాత.. అది ఒక వ్యక్తి అంత ఈజీగా కాలు జారి పడిపోయే అవకాశం లేని ప్రమాదకరమైన పాయింట్ అని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి సియా గోయల్, చేతన్ చౌదరిల కాల్ డేటా రికార్డులను, లొకేషన్లను తవ్వితీసి వారిద్దరినీ విచారించడంతో అసలు గుట్టు రట్టయింది. చేతన్‌తో ఉన్న అక్రమ సంబంధానికి కేతన్ అడ్డంగా ఉన్నాడని.. అందుకే అతనిని వదిలించుకోవడానికి సియా ఈ ప్లాన్ వేసినట్లు తేలింది. ఘటన జరిగిన సమయంలో కోటపై ఒక ముసుగు ధరించిన వ్యక్తి తిరిగినట్లు సీసీటీవీ విజువల్స్ కూడా లభించాయి. తామే కేతన్‌ను కొండపై నుంచి కిందకు నెట్టేసినట్లు నిందితులు ఇద్దరూ పోలీసుల ముందు అంగీకరించారు. దీంతో పోలీసులు వారిపై హత్య, క్రిమినల్ కాన్స్పిరసీ కేసులు నమోదు చేసి జైలుకు తరలించారు.