తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో కీలక మార్పు చోటు చేసుకోబోతోంది. రాష్ట్ర తదుపరి ప్రధాన కార్యదర్శిగా (CS) సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్‌జాజు నియమితులయ్యే ఛాన్సుంది.
ప్రస్తుతం తెలంగాణ సీఎస్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రామకృష్ణారావు ఈ నెలాఖరుతో పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో కొత్త సీఎస్ ఎంపికపై కసరత్తు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. రేసులో ఉన్న జయేశ్‌రంజన్‌తో పాటు సంజయ్‌జాజు పేర్లను పరిశీలించి చివరకు జాజు వైపే మొగ్గు చూపినట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్ర సర్వీసులో ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న సంజయ్ జాజును తిరిగి తెలంగాణ రాష్ట్రానికి పంపుతూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మీసేవ, సౌకర్యం ఐటీ విప్లవాల రూపశిల్పి1992 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సంజయ్ జాజుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత సమర్థుడైన అధికారిగా మంచి గుర్తింపు ఉంది. విజయవాడ సబ్‌కలెక్టర్‌గా, పశ్చిమగోదావరి కలెక్టర్‌గా, హైదరాబాద్ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌గా, కమిషనర్‌గా, అలాగే పౌరసరఫరాల సంస్థ కమిషనర్‌గా సేవలు అందించారు. ముఖ్యంగా నేడు కోట్లాది మంది ప్రజలు ఉపయోగిస్తున్న ఐటీ ఆధారిత ప్రభుత్వ పౌర సేవలు మీసేవ, మున్సిపల్ సేవల్లో పారదర్శకత తెచ్చిన సౌకర్యం ప్రాజెక్టులకు ఈయనే ఆధ్యుడు. సాంకేతికత ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజల వద్దకే చేర్చవచ్చని నిరూపించిన డిజిటల్ విప్లవకారుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. 2014 అక్టోబర్‌లో కేంద్ర డెప్యుటేషన్‌పై వెళ్లిన సంజయ్ జాజు, గడిచిన 12 ఏళ్లలో భారత ప్రభుత్వంలోని అత్యంత కీలకమైన, వ్యూహాత్మకమైన శాఖలలో ఉన్నతాధికారిగా దేశానికి అసాధారణ సేవలందించారు. ఇటీవలి కాలంలో ఆయన కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి హోదాలో అత్యంత కీలకమైన విభాగాన్ని నడిపించారు. దేశంలో మీడియా, డిజిటల్ కంటెంట్, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల నియంత్రణ, ప్రభుత్వ సమాచార వ్యవస్థల డిజిటలైజేషన్‌ను సమర్థవంతంగా పర్యవేక్షించారు. బ్రాడ్‌కాస్టింగ్ రంగంలో సంస్కరణలు తేవడంతో పాటు అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవాల్లో భారతీయ సినిమా ప్రాతినిధ్యాన్ని పెంచే వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.2018 నుండి 2022 వరకు రక్షణ మంత్రిత్వ శాఖలో రక్షణ ఉత్పాదక శాఖ అడిషనల్ సెక్రటరీ చేసిప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మక విధానమైన ఆత్మనిర్భర్ భారత్‌ను రక్షణ రంగంలో బలంగా అమలు చేశారు. భారతదేశం సొంతంగా ఆయుధాలు, యుద్ధ విమానాలు తయారు చేసుకునేలా రక్షణ రంగ స్టార్టప్‌లను ప్రోత్సహించారు. రక్షణ రంగంలో సరికొత్త ఆవిష్కరణల కోసం 'iDEX' (Innovations for Defence Excellence) ప్రాజెక్ట్‌ను స్వయంగా పర్యవేక్షించి, సైన్యానికి అత్యాధునిక దేశీయ సాంకేతికత అందేలా చూశారు. డిఫెన్స్ కారిడార్ల ఏర్పాటు, రక్షణ ఎగుమతులను రికార్డు స్థాయికి చేర్చడంలో తెరవెనుక వ్యూహకర్తగా నిలిచారు.కేంద్రంలో 2014 నుంచి 2018 వరకు NHIDCLకు డైరెక్టర్‌గా వ్యవహరించారు. దేశ సరిహద్దు ప్రాంతాలైన ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవులు, హిమాలయ సరిహద్దుల్లో వ్యూహాత్మక జాతీయ రహదారులు, కఠినమైన టన్నెల్స్ నిర్మాణానికి నిధుల సమీకరణ చేపట్టారు. క్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల్లో మౌలిక వసతుల ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి సరికొత్త పద్ధతులను ప్రవేశపెట్టారు. ఇలా అటు ఉమ్మడి రాష్ట్రంలో క్షేత్రస్థాయి పాలన, ఇటు కేంద్రంలో డిజిటల్ గవర్నెన్స్, రక్షణ రంగ ఆధునీకరణ, వ్యూహాత్మక మౌలిక వసతుల కల్పనలో తిరుగులేని ముద్ర వేసిన సంజయ్ జాజు రాకతో తెలంగాణ పరిపాలనా విభాగం మరింత బలోపేతం కానుందని విశ్లేషకులు భావిస్తున్నారు.