
ఒక్కో ఉద్యోగికి రూ.60 లక్షల నుంచి 2 కోట్ల బీమా తాత్కాలిక ఉద్యోగులకు కూడా అమలు 25న సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో 14 బ్యాంకులతో ఒప్పందం జులై మొదటి వారంలో హెల్త్‌కార్డుల పంపిణీకి సభ ఈనాడు, హైదరాబాద్:...
ఒక్కో ఉద్యోగికి రూ.60 లక్షల నుంచి 2 కోట్ల బీమా తాత్కాలిక ఉద్యోగులకు కూడా అమలు 25న సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో 14 బ్యాంకులతో ఒప్పందం జులై మొదటి వారంలో హెల్త్‌కార్డుల పంపిణీకి సభ
ఈనాడు, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమాద జీవిత బీమా పథకాన్ని గురువారం సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. రవీంద్రభారతిలో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే సమావేశంలో సీఎం, మంత్రులు, ఉద్యోగుల సమక్షంలో మొత్తం 14 బ్యాంకులు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకోనున్నాయి. అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేసే శాశ్వత ఉద్యోగులకే ప్రమాద బీమాను వర్తింపజేయాలని తొలుత భావించారు. కానీ కాంట్రాక్టు, పొరుగుసేవల వంటి తాత్కాలిక ఉద్యోగులకు కూడా అమలుచేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. బ్యాంకు ఖాతాలో ప్రభుత్వ వేతనం జమయ్యే ఉద్యోగులందరికీ ఇది వర్తిస్తుంది. దాదాపు పది లక్షల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేలా ఈ పథకాన్ని ప్రభుత్వం రూపొందించింది. ఉద్యోగి.. ప్రీమియం కింద ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. వేతన ఖాతాలున్న బ్యాంకుల ద్వారా ఈ పథకం అమలుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
ఏదైనా ప్రమాదంలో ఉద్యోగి మరణిస్తే వేతన ఖాతా ఉన్న బ్యాంకులో నామినీకి రూ.60 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకూ బీమా పరిహారం లభిస్తుంది. పరిహారం ఎంత ఇవ్వాలనే అంశంపై ఒక్కో బ్యాంకు పరిమితి ఒక్కో రకంగా ఉంది. కొన్ని బ్యాంకులు రూ.60 లక్షల నుంచి రూ.కోటి ఇస్తామని తెలిపాయి. అత్యధిక వేతన ఖాతాలున్న బ్యాంకులు రూ.కోటి ఇవ్వడానికి అంగీకరించినట్లు సమాచారం. విమానంలో ప్రయాణించే సమయంలో ప్రమాదం జరిగి ఉద్యోగి మరణిస్తే గరిష్ఠంగా రూ.2 కోట్ల పరిహారం అందుతుందని బ్యాంకులు తెలిపాయి. రాష్ట్రంలో సింగరేణి ఉద్యోగులకు.. బ్యాంకులు కొద్దికాలం క్రితం ఈ పథకాన్ని ప్రారంభించాయి. సింగరేణిలో ఇప్పటివరకు దాదాపు 45 మంది ఉద్యోగులు ప్రమాదాల్లో మరణించగా వారి కుటుంబాలకు రూ.కోటి చొప్పున బీమా పరిహారాన్ని బ్యాంకులు అందజేశాయి.
ఆ తరవాత దేశవ్యాప్తంగా కోల్ ఇండియా వంటి ప్రభుత్వ రంగ సంస్థలూ దీని అమలుకు శ్రీకారం చుట్టాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తొలుత తెలంగాణలోనే అమలుకు శ్రీకారం చుడుతున్నట్లు అధికార వర్గాలు చెపుతున్నాయి. హఠాత్తుగా ఏదైనా ప్రమాదం జరిగి ఉద్యోగి మరణిస్తే ఆ కుటుంబానికి తీవ్ర దుఃఖం కలుగుతుందని, అది పూడ్చలేనిదని.. ఈ పథకం వల్ల బాధిత కుటుంబానికి కొంత ఆర్థిక భద్రత ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. సాధారణ మరణానికి కూడా పరిహారం ఇచ్చే అంశంపై ఇంకా బ్యాంకులు స్పష్టత ఇవ్వలేదు. రవీంద్రభారతిలో జరిగే ఈ కార్యక్రమానికి పెద్దసంఖ్యలో ఉద్యోగులు తరలిరావాలని తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్జీవో) మంగళవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చింది. ప్రతి ఉద్యోగి గుర్తింపుకార్డు ధరించి రావాలని సూచించింది.
ప్రభుత్వ ఉద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న హెల్త్‌కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని వీలైనంత త్వరగా నిర్వహించాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వీలైతే జులై మొదటివారంలో ఎల్.బి. స్టేడియంలో 50 వేల మంది ఉద్యోగుల సమక్షంలో బహిరంగ సభ ఏర్పాటుచేసి ఈ కార్డుల పంపిణీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శ్రీకారం చుడతారని తెలుస్తోంది. దీనిపై అధికారిక నిర్ణయం వెలువడాల్సి ఉంది. వేతన సవరణ సంఘం(పీఆర్సీ) అంశంపైనా ప్రభుత్వం దృష్టిపెడుతున్నట్లు తెలుస్తోంది. వేతన సవరణ వల్ల ఎంత భారం పడుతుందనే అంశంపై ఆర్థికశాఖ లెక్కలు తయారుచేస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.