
చంద్రబాబు ఈబీసీ కోటాలో 5% రిజర్వేషన్ కాపులకు ఇచ్చారు జగన్ గద్దెనెక్కగానే వాటిని రద్దు చేశారు చంద్రబాబు, పవన్ కలిసుంటే తమకు అధికారం రాదనే ఈ కుల రాజకీయాలు మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజం వైకాపా...
చంద్రబాబు ఈబీసీ కోటాలో 5% రిజర్వేషన్ కాపులకు ఇచ్చారు జగన్ గద్దెనెక్కగానే వాటిని రద్దు చేశారు చంద్రబాబు, పవన్ కలిసుంటే తమకు అధికారం రాదనే ఈ కుల రాజకీయాలు మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజం వైకాపా హయాంలో కాపు యువతపై దాష్టీకాలు మండిపడ్డ మంత్రి కందుల దుర్గేష్
చంద్రబాబు, పవన్‌కల్యాణ్ రామలక్ష్మణుల్లా కలిసి ఉన్నంత కాలం తమకు అధికారం రాదనే భయంతో జగన్ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు.
ఈనాడు, అమరావతి: ‘కాపులకు ద్రోహం చేసింది, చేస్తున్నదీ జగన్మోహన్రెడ్డే. కేంద్రం ఈడబ్ల్యూఎస్ కింద 10% రిజర్వేషన్లు ఇస్తే గత తెదేపా ప్రభుత్వంలో చంద్రబాబు ఎవరికీ ఇబ్బంది లేనివిధంగా అందులో 5% కాపులకు కేటాయించారు. జగన్ సీఎం అయ్యాక వాటిని రద్దు చేశారు. వైకాపాలో కాపు నాయకులు అప్పుడు ఎందుకు ఆయన్ను ఎందుకు నిలదీయలేదు. ఏ చెంపదెబ్బలు తినాల్సి వస్తుందని భయపడ్డారు?’ అని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిలదీశారు. సచివాలయంలో రాజ్యసభ సభ్యుడు సానా సతీష్‌తో కలిసి మంత్రి మంగళవారం విలేకర్లతో మాట్లాడారు.
‘నేరస్థులను తయారు చేసే కర్మాగారం వైకాపా.. నేతలను తయారు చేసే పార్టీ తెదేపా. అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్ వంటి వైకాపా కాపు నేతల్ని రెచ్చగొట్టి, వారితో తప్పులు చేయించి నేరస్థులుగా మార్చి, జైలుకు పంపి జీవితాంతం తన చుట్టూ తిరిగేలా జగన్ ఎజెండా అమలు చేస్తున్నారు. ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ ఉచ్చులో పడితే అక్కడ పని చేయాల్సిందే.
వైకాపా ప్రభుత్వంలో కాపులకు చెందిన సంక్షేమ పథకాలు రద్దు చేసిన చరిత్ర వైకాపా అధినేత జగన్‌రెడ్డిదని పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ ధ్వజమెత్తారు. 2019-24 మధ్య కాపు కార్పొరేషన్‌కు ఎన్ని నిధులు కేటాయించారో.. ఎంతమంది కాపు యువతకు విదేశీవిద్య కింద సాయం చేశారో చెప్పాలని సవాలు విసిరారు. కాపులకు ఈడబ్ల్యూఎస్ పథకం వర్తింపజేయబోమని నాడు సామర్లకోట పర్యటనలో జగన్ అంటే వైకాపాలో ఉన్న కాపు నాయకులు కనీసం నోరుమెదపలేదని దుయ్యబట్టారు. ఇప్పుడు కుల విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడానికే వారంతా బయటకొచ్చి నాటకాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘జగన్ ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నించినందుకు ఎందరో కాపు యువకుల్ని బలితీసుకున్నారు. గిద్దలూరు మండలం సింగంపల్లికి చెందిన కాపు యువకుడు బండ్ల వెంగయ్యనాయుడు తన గ్రామానికి రోడ్డు వేయాలని అడిగిన పాపానికి అప్పటి వైకాపా ఎమ్మెల్యే, ఆయన అనుచరులు అతణ్ని తీవ్రంగా వేధించారు. తట్టుకోలేక వెంగయ్య ఆత్మహత్య చేసుకున్నారు. అప్పడు వైకాపాలో ఉన్న కాపు నాయకులంతా ఏమైపోయారు’ అని నిలదీశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.