
అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూ ఫలకాన్ని ఆవిష్కరించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, యూఎస్ రాయబారి సెర్గియో గోర్, యూఎస్ కాన్సుల్...
అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి
డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూ ఫలకాన్ని ఆవిష్కరించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, యూఎస్ రాయబారి సెర్గియో గోర్, యూఎస్ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్
ఈనాడు, హైదరాబాద్: ‘‘తెలంగాణ-అమెరికా భాగస్వామ్యం కేవలం సాఫ్ట్వేర్ రంగానికే పరిమితం కాలేదు. అది దాటి ‘కో క్రియేషన్’ దశలోకి అడుగు పెట్టింది. లైఫ్‌సైన్సెస్, టీకాల తయారీ, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో బంధం మరింత బలపడింది. రాబోయే రోజుల్లో ఏఐ, క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఉన్నత విద్య, పరిశోధన రంగాల్లో ఈ భాగస్వామ్యం కొత్త పుంతలు తొక్కబోతోంది’’ అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
‘‘హైదరాబాద్ ఐటీ రంగానికి మీరు డెవలప్మెంట్ సెంటర్ ఇస్తే... మేము మీకు ప్రపంచాన్ని నడిపించే గ్లోబల్ సీఈఓలను అందిస్తాం’’ అని తెలిపారు. అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లో మంగళవారం రాత్రి విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ పక్కన ఉన్న రోడ్డుకు ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’గా నామకరణం చేస్తూ రూపొందించిన ప్రత్యేక ఫలకాన్ని అమెరికా రాయబారి సెర్గియో గోర్‌తో కలిసి ఉపముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘‘హైదరాబాద్, అమెరికాల మధ్య ఉన్నది కేవలం రెండు ప్రభుత్వాల మధ్య ఉన్న దౌత్య సంబంధం కాదు. ఇది ప్రజలు, కుటుంబాల మధ్య ఏర్పడిన అనుబంధం. ఈరోజు అమెరికా అనేది మ్యాప్‌లో చూసే ఒక దేశం కాదు. అక్కడ చదువుకుంటున్న మన పిల్లలు, ఉద్యోగాలు చేస్తున్న బంధువులు, స్టార్టప్‌లు పెడుతున్న యువత రూపంలో... అమెరికా ప్రతి తెలుగు ఇంట్లో భాగమైంది. అక్కడ వేగంగా విస్తరిస్తున్న భాషగా తెలుగు నిలవడం గర్వకారణం. ‘తెలంగాణ రైజింగ్ సమిట్ 2025’లో మన సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించినట్లుగా... అమెరికాతో ఉన్న ప్రత్యేక బంధానికి గుర్తుగా ఇక్కడి యూఎస్ కాన్సులేట్ సమీపంలోని ప్రధాన రహదారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలని నిర్ణయించాం. దక్కన్ సంస్కృతి ఉట్టిపడేలా నిర్మించిన యూఎస్ కాన్సులేట్ కొత్త భవనం సాంస్కృతిక దౌత్యానికి ప్రతీకగా నిలుస్తోంది’’ అని భట్టి పేర్కొన్నారు.
అమెరికా ఫస్ట్ అంటే.. ఒంటరిగా ఎదగడం కాదు: సెర్గియో గోర్
రామోజీ గ్రూప్ సంస్థల సీఎండీ సీహెచ్ కిరణ్, రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరిలతో ముచ్చటిస్తున్న యూఎస్ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్
అమెరికా రాయబారి సెర్గియో గోర్ మాట్లాడుతూ... ‘‘భారత్-అమెరికాల వ్యూహాత్మక భాగస్వామ్యంలో హైదరాబాద్ కాన్సులేట్ పరిధిలోని ప్రాంతాలు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. హైటెక్ సిటీ నుంచి ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల వరకు ఈ ప్రాంతం సాధిస్తున్న ప్రగతి మన ద్వైపాక్షిక సంబంధాల వేగాన్ని నిర్వచిస్తోంది. ‘అమెరికా ఫస్ట్’ అంటే.. అమెరికా ఒంటరిగా ఎదగడం కాదని మేము నిరూపిస్తున్నాం. యూఎస్ కాన్సులేట్ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ అవెన్యూగా పేరు పెట్టి గౌరవించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు’’ అని తెలిపారు.
వేడుకలకు అధ్యక్షత వహించిన యూఎస్ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లోని ఏరోస్పేస్, డిఫెన్స్, ఏఐ, బయోఫార్మా రంగాలు ప్రపంచ భవిష్యత్తును మారుస్తున్నాయి. ఈ వృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లే క్రమంలో.. ఇక్కడి ప్రతిభ స్వేచ్ఛగా అమెరికాకు చేరేలా కాన్సులేట్ కృషి చేస్తుంది’’ అని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, రామోజీ గ్రూప్ సంస్థల సీఎండీ సీహెచ్ కిరణ్, రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి, విశ్రాంత ఐఏఎస్ జయప్రకాశ్ నారాయణ, విశ్రాంత చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కమ్‌టాక్స్ కృష్ణకిశోర్ జాస్తి తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.