
రికార్డులన్నింటినీ భద్రపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి సాక్షి, అమరావతి: కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్‌డెత్ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం...
Jun 23 2026 6:02 AM | Updated on Jun 23 2026 6:02 AM
రికార్డులన్నింటినీ భద్రపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి
సాక్షి, అమరావతి: కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్‌డెత్ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. సాయికృష్ణ లాకప్‌డెత్‌కు సంబంధించిన రికార్డులన్నింటినీ భద్రపరిచేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ ప్రొపర్టీ అండ్ ఎని్వరాన్మెంటల్ రైట్స్ సంయుక్త కార్యదర్శి దాడిశెట్టి వీరబాబు సోమవారం ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
‘సాయికృష్ణ కేసు దర్యాప్తులో ప్రభుత్వ అధికారులు, పోలీసులు చూపుతున్న ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ఈ కేసులో పారదర్శక, నిష్పక్షపాత, స్వతంత్ర దర్యాప్తు జరపకపోవడమన్నది రాజ్యాంగంలోని సమానత్వ హక్కు, జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులను హరించడమే అవుతుంది. పోలీసుల చర్యలను ఏకపక్షం, చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలి. ఈ కేసులో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరి పాత్రపై ముఖ్యంగా అధికారులు, రాజకీయ పెద్దలు పాత్రపై పక్షపాతానికి తావు లేకుండా, స్వతంత్రంగా విచారణ జరిపేలా సీబీఐని ఆదేశించాలి. స్థానిక పోలీసులు ఈ కేసును సరిగ్గా దర్యాప్తు చేయడం లేదు. కాబట్టి నిష్పక్షపాత దర్యాప్తుతో పాటు వాస్తవాలు వెలుగులోకి రావడానికి కేసును సీబీఐకి అప్పగించడమే సరైన మార్గం.
సాయికృష్ణ కేసుకు సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంటరీ, ఎల్రక్టానిక్, డిజిటల్, ఫోరెన్సిక్, శాస్త్రీయ ఆధారాలను వెంటనే భద్రపరచేలా ఆదేశాలు ఇవ్వాలి. సీసీటీవీ ఫుటేజీ, జనరల్ డైరీ ఎంట్రీలు, స్టేషన్ హౌస్ రికార్డులు, కాల్ డేటా రికార్డులు, మొబైల్ ఫోన్ డేటా, లొకేషన్ డేటా, హాస్పిటల్ రికార్డులు, పోస్ట్‌మార్టం రికార్డులు, ఫోరెన్సిక్ సామాగ్రి, పోలీసు వాహనాల రాకపోకల రికార్డులను భద్రపరిచేలా ఆదేశాలు ఇవ్వాలి. ఈ ఘటనతో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ సంబంధం ఉన్న ఏ పోలీస్ అధికారిని కూడా దర్యాప్తులో పాలుపంచుకోకుండా, దర్యాప్తును పర్యవేక్షించకుండా ఆదేశాలు జారీ చేయాలి.
ఈ వ్యాజ్యం తేలేంత వరకు, కేసును అధికారికంగా సీబీఐకి బదిలీ చేసే ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులు సాక్ష్యాలను నాశనం చేయకుండా ఉండేందుకు తక్షణ రక్షణ ఆదేశాలు ఇవ్వాలి’ అని పిటిషనర్ న్యాయస్థానాన్ని కోరారు. స్వయంగా పోలీస్ అధికారులపైనే ఆరోపణలు వచ్చినప్పుడు, స్థానిక పోలీసులు జరిపే విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందనే నమ్మకం లేనప్పుడు దర్యాప్తును సీబీఐకి బదలాయించాలని కోరవచ్చునని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో చెప్పిన విషయాన్ని పిటిషనర్ పిల్లో ప్రస్తావించారు.
‘సాయికృష్ణ లాకప్‌డెత్‌కు సంబంధించి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో కేవలం ఒక్క అధికారిపైనే చర్యలు చేపట్టారు. వాస్తవానికి ప్రజలు, మీడియా సమాచారం ప్రకారం ఈ ఘోరంలో పలువురు పోలీస్ సిబ్బందితో పాటు ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారుల ప్రమేయం కూడా ఉందని స్పష్టమవుతోంది. స్వయంగా రాష్ట్ర పోలీస్ శాఖకు చెందిన అధికారులపైనే తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పుడు.. రాష్ట్ర పోలీసులే ఈ దర్యాప్తును కొనసాగించడం అసమంజసం’’ అని వీరబాబు తన పిటిషన్లో పేర్కొన్నారు.
కొట్టి చంపేశారు... ‘సాయికృష్ణను విజయవాడ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మే 9వ తేదీన ఓ నాన్‌బెయిలబుల్ వారెంట్ అమలుకు సంబంధించి మార్కాపురంలో అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో ప్రవేశపెట్టకుండా అతడిని మొదట కృష్ణలంక, టాస్‌్కఫోర్స్ పోలీస్ స్టేషన్లలో రెండు రోజులు ఉంచారు. ఆ తర్వాత విజయవాడ బెంజ్ రోడ్‌లోని ఒక ప్రైవేట్ హోటల్‌కు తరలించి, మే 23 వరకు తీవ్రంగా హింసించారు. విజయవాడ టాస్క్‌ఫోర్స్ పోలీసులతో కలిపి దాదాపు 12 మంది పోలీసులు ఈ హత్య ప్రణాళికలో పాల్గొన్నారు. దీనికి సంబంధించి విశ్వసనీయ సమాచారం మాకుంది.
కృష్ణలంక, టాస్‌్కఫోర్స్ పోలీసుల దాడి కారణంగా సాయికృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అతడిని మొదట విజయవాడలోని ప్రజా వైద్యశాలకు తీసుకెళ్లగా, పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడ వైద్యులు చికిత్స చేయడానికి నిరాకరించారు. ఆ తర్వాత మణిపాల్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ఒక రోజు చికిత్స అందించారు. అయినా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో మళ్లీ హోటల్ గదికే తీసుకెళ్లి, ఒక డాక్టర్‌తో ప్రథమ చికిత్స చేయించారు. చివరికి సాయికృష్ణ గాయాలు తట్టుకోలేక మరణించాడు. సాయికృష్ణ మరణించిన తర్వాత, కృష్ణలంక పోలీసులు శవాన్ని మాయం చేయడానికి ప్లాన్ చేశారు.
ప్రజలను నమ్మించడానికి, ఆ మృతదేహాన్ని విజయవాడ బస్టాండ్‌లోని ప్లాట్ నంబర్ 43 వద్ద పడేశారు. అది గుర్తుతెలియని శవంగా భ్రమింపజేసి, మున్సిపల్ అధికారుల సహాయంతో తప్పుడు పంచనామా రికార్డులు సృష్టించారు. స్మశానవాటిక సిబ్బందిని లొంగతీసుకుని, మే 24న మున్సిపల్ కార్పొరేషన్ శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేసేశారు. కొడుకు జాడ కోసం తల్లి తీవ్రంగా ప్రయత్నించి, చివరికి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు విచారణ సమయంలో పోలీసులు తాము అసలు సాయికృష్ణను అరెస్టు చేయలేదని అబద్ధం చెబుతూ, మే 29 వరకు సమయం కోరారు.
కానీ ఈ లోపే, విచారణ పేరుతో పోలీసులు అతన్ని కొట్టి చంపేశారనే నిజం బయటపడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల మేరకు, రాష్ట్ర ప్రభుత్వం కేసు నమోదు చేయడంతో ప్రస్తుతం సాయికృష్ణ తల్లి సంతృప్తి చెందారు. ఈ విషయాన్ని ఇకపై పెద్దది చేయవద్దని ఆమెను ప్రభుత్వ పెద్దలు బహిరంగంగా కోరుతున్నారు. అయితే, ఒక బాధ్యతగల పౌరుడిగా వాస్తవాలు వెలుగులోకి రావాలన్న ఉద్దేశంతో సాయికృష్ణ లాకప్‌డెత్ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతున్నా. అందులో భాగంగానే ఈ పిల్ దాఖలు చేస్తున్నా.’ అని వీరబాబు తన పిటిషన్లో పేర్కొన్నారు.
అనసూయ బీచ్ వెకేషన్.. ఎంజాయ్ చేస్తూ (ఫొటోలు)
మా ఇంటి బంగారంలా మెరిసిపోతున్న యాంకర్ శ్రీముఖి.. ఫోటోలు
చీరకట్టులో సరికొత్తగా గ్లామర్ చూపిస్తూ.. (ఫొటోలు)
సిల్వర్ శారీలో ధగ ధగ మెరిసిపోతున్న భూమి పెడ్నేకర్
‘హను మాన్ 3డీ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
దారుణం.. మంచినీళ్లు ఇవ్వలేదని తల్లిపై కొడుకు దాడి
చిన్నారి డ్రీమ్ ను నిజం చేసిన బన్నీ.. స్వయంగా వీడియో కాల్ చేసి..!
మెట్రో రైల్ ఎక్కిన కోతి.. చుట్టాలింటికి పోతున్నదేమో
ఎంపీకి, CI నాగరాజు మధ్య భారీ డీల్? బయటకి వస్తున్న సంచలన నిజాలు