
తెలంగాణలో విమానయాన కనెక్టివిటీని పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి..
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని ప్రత్యేకంగా కలిశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ‘కొత్తగూడెం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్’ నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టాలని వారు కేంద్రమంత్రికి అధికారికంగా విజ్ఞప్తి చేశారు.
కొత్తగూడెం వద్ద గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం గతంలో రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలపై సివిల్ ఏవియేషన్ శాఖ ఇప్పటికే ఒక ‘ఫీజిబులిటీ సర్వే’ నిర్వహించింది. త్వరితగతిన సర్వే చేయించినందుకు రామ్మోహన్ నాయుడికి ఈ సందర్భంగా తుమ్మల కృతజ్ఞతలు తెలిపారు. అయితే, ఆ టెక్నికల్ సర్వేలో మొదట అనుకున్న స్థలం విమానాశ్రయ నిర్మాణానికి అనువుగా లేదని తేలడంతో.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరో ప్రత్యామ్నాయ స్థలాన్ని ప్రతిపాదించినట్లు తుమ్మల చెప్పారు.
కొత్తగా ప్రతిపాదించిన స్థలంలో త్వరగా టెక్నికల్ అండ్ సేఫ్టీ ఫీజిబులిటీ సర్వే నిర్వహించాలని, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ త్వరగా పట్టాలెక్కేలా కేంద్రం చొరవ చూపాలని మంత్రులు కోరారు. దీనిపై కేంద్రమంత్రి కూడా సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎయిర్పోర్ట్ ఎందుకు అవసరమనే దానికి మంత్రులు బలమైన కారణాన్ని కేంద్రానికి వివరించారు. ఇక్కడ ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం, ‘దక్షిణ అయోధ్య’గా ప్రసిద్ధి చెందిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయానికి దేశ, విదేశాల నుంచి ప్రతిరోజూ భక్తులు వస్తుంటారని గుర్తుచేశారు. ఎయిర్పోర్ట్ వస్తే ఇటు భక్తులకు కనెక్టివిటీ పెరగడంతో పాటు, ఇండస్ట్రియల్గా కూడా ఈ ఏరియా బాగా డెవలప్ అవుతుందని స్పష్టం చేశారు.