
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
West Bengal Budget 2026: పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఎన్నికైన సువేందు ప్రభుత్వం ఆ రాష్ట్ర యువత, వయోవ్రుద్ధులు, జర్నలిస్టుల కోసం అనేక ప్రకటనలు చేసింది. ఆ రాష్ట్ర అసెంబ్లీలో తొలిబడ్జెట్ ను ప్రవేశపెడుతూ.. ఆర్థిక మంత్రి స్వపన్ దాస్ గుప్తాలు ప్రధాన ప్రజా సంక్షేమ పథకాలను ప్రకటించారు. ఈ కొత్త బడ్జెట్లో రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించేందుకు భరోసా పథకాన్ని ప్రారంభించారు. ఈస్కీమ్ కింద నెలకు రూ. 3000 వరకు భత్యం అందిస్తారు. సమాజంలో మరో ముఖ్యమైన వర్గాన్ని ద్రుష్టిలో ఉంచుకుని రిటైర్డ్ జర్నలిస్టులకు నెలకు రూ. 5,000 పెన్షన్ అందించే చారిత్రాత్మక ప్రకటన కూడా చేసింది ప్రభుత్వం. ఈ చర్యతో రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాలు ప్రత్యక్షంగా ఆర్థిక భద్రతను అందిస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రభుత్వ పథకాల నిబంధనలు, షరతులు, అలాగే బడ్జెట్లోని ఇతర ముఖ్యమైన విషయాలు చూద్దాం.
భరోసా పథకం అంటే ఏమిటి? రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన భరోసా యోజన పథకం ప్రాథమిక లక్ష్యం..ఉన్నత చదువులు పూర్తి చేసి ఉద్యోగం కోసం వెతుకుతున్న నిరుద్యోగులకు ఆర్థిక సహాయం అందించడం. ఈ స్కీమ్ నిబంధనలను స్పష్టం చేస్తూ.. కుటుంబ వార్షిక ఆదాయం 1లక్ష కంటే తక్కువగా ఉన్న నిరుద్యోగ పట్టభద్రులకు ప్రభుత్వం నెలకు రూ. 3000 ఆర్థిక సహాయం అందిస్తుందని ఆర్థిక మంత్రి తెలిపారు. అంతేకాదు ఇతర వర్గాల్లోని అర్హులైన నిరుద్యోగ యువతకు కూడా నెలకు రూ. 2, 000 నిరుద్యోగ భృతి లభిస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మరే ఇతర సామాజిక సంక్షేమ లేదా ఆర్థిక సహాయ పథకాన్ని పొందని యువత మాత్రమే ఈ స్కీముకు అర్హులని ప్రభుత్వం స్పష్టం చేసింది.
జర్నలిస్టులకు కూడా పెన్షన్: ఈ బడ్జెట్లో యువతతో పాటు, ప్రజాస్వామ్యానికి 4వ స్తంభమైన మీడియా రంగంలో పనిచేస్తున్న వారి కోసం కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్లో రిటైర్డ్ అయిన జర్నలిస్టులందరికీ నెలకు రూ. 5,000 పింఛను అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జర్నలిస్టులతో పాటు, వివిధ రాజకీయ కారణాల వల్ల జైలు పాలైన వారిని కూడా ప్రభుత్వం గౌరవించింది. రాజకీయ ఖైదీలు లేదా కార్యకర్తలకు ప్రభుత్వం నెలకు రూ. 10,000 పింఛను అందిస్తుంది. సామాజిక భద్రత పరిధిని విస్తరిస్తూ, వృద్ధాప్య పింఛను, వితంతు పింఛను, వైకల్య పింఛను మొత్తాన్ని నెలకు రూ. 500 పెంచడానికి ఆర్థిక మంత్రి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు.
ఈ బడ్జెట్ ద్వారా పశ్చిమ బెంగాల్ ప్రజలు ఆరోగ్యం, విద్య రంగాలలో కూడా అనేక ముఖ్యమైన వరాలను అందుకున్నారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం ఆయుష్మాన్ భారత్ ను పూర్తిస్థాయిలో అమలు చేయడానికి ప్రభుత్వం భారీగా రూ. 3,100 కోట్లు కేటాయించింది. ఈ చర్య రాష్ట్రంలోని సుమారు 7 కోట్ల మంది పౌరులకు ఉచితంగా, మెరుగైన వైద్య సంరక్షణను అందిస్తుంది. ఝార్‌గ్రామ్‌లోని గిరిజన విశ్వవిద్యాలయం, 2 కొత్త కేంద్రీయ విద్యాలయాలతో పాటు, కాంతి, కాలియాచక్, ఫల్తాలలో మహిళా విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ, ప్రభుత్వ-సహాయక కళాశాలల్లో చదువుతూ, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఒకేసారి రూ. 25,000 గ్రాంటును అందించడానికి ముఖ్యమైన ప్రతిపాదన చేసింది.
ఇక పిల్లల పోషణను మెరుగుపరచడానికి ప్రభుత్వం పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో కూడా భారీ మార్పులు చేసింది. మధ్యాహ్న భోజనం కోసం ఒక్కో విద్యార్థికి కేటాయించే మొత్తాన్ని రూ. 10కి పెంచింది. పాఠశాలల్లో ఈ భోజనాల తయారీ, సురక్షిత పంపిణీని ఇస్కాన్ సహకారంతో నిర్వహిస్తారు. పిల్లలకు పరిశుభ్రమైన, పోషకమైన ఆహారం అందేలా చూస్తారు. అంతేకాదు రాష్ట్రంలో మౌలిక సదుపాయాలను పెంపొందించేందుకు, కోల్‌కతా విమానాశ్రయంపై ఒత్తిడిని తగ్గించడానికి కళ్యాణిలో 1,000 ఎకరాల భూమిలో ఒక కొత్త, అద్భుతమైన విమానాశ్రయాన్ని నిర్మిస్తారు. అలాగే పురూలియా, మాల్దాలో కూడా కొత్త విమానాశ్రయాలను అభివృద్ధి చేయనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.