
Rating: 2.75 --సూర్య ప్రకాష్ జోశ్యుల కలర్ బుక్ జీవితం ఎప్పుడూ ఒకేలా సాగదు. ఒక్కోసారి అది మనల్ని కోలుకోలేని దెబ్బ తీస్తుంది. లక్కీ (William Catlett)అనే ఒక సాదాసీదా తండ్రి జీవితంలోనూ అదే జరిగింది.
తను ప్రాణంగా ప్రేమించిన భార్య టామీ హఠాత్తుగా చనిపోవడంతో అతని ప్రపంచం ఒక్కసారిగా చీకటైపోయింది. ఆ బాధ ఒకవైపు అయితే, మరోవైపు అతని భుజాలపై ఒక పెద్ద బాధ్యత పడింది. అతని 11 ఏళ్ల కొడుకు మాసన్ (Jeremiah Alexander Daniels)డౌన్ సిండ్రోమ్ (Down syndrome) ఉన్న అబ్బాయి. భార్య ఉన్నంత కాలం కొడుకు బాధ్యతలను తనే చూసుకునేది. కానీ ఇప్పుడు లక్కీ ఒంటరివాడయ్యాడు. అటు భార్యను కోల్పోయిన దుఃఖాన్ని గుండెల్లో దాచుకుంటూ, ఇటు ఒంటరి తండ్రిగా కొడుకును ఎలా పెంచాలో తెలియక లోలోపల మదనపడుతుంటాడు. మాసన్కు అమ్మ లేని లోటు తెలియకుండా, వాడి జీవితాన్ని సాధారణంగా ఉంచడానికి లక్కీ అహర్నిశలూ శ్రమిస్తుంటాడు. ఈ క్రమంలో తన భార్యకు ఇచ్చిన మాట ప్రకారం, మాసన్‌ను అట్లాంటా నగరంలో జరిగే అతని మొదటి బేస్‌బాల్ మ్యాచ్‌కి తీసుకువెళ్లాలని బయిలుదేరతాడు. కానీ, ఆ ప్రయాణంలో వారి కారు పాడైపోతుంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా విఫలమవుతాయి. ఒకటి తర్వాత ఒకటి చిన్న చిన్న సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. కలర్ బుక్ఆ సాధారణంగా చూసే వారికి అవి పెద్ద విషయాలు కాకపోవచ్చు. కానీ భార్యను కోల్పోయిన బాధలో ఉన్న ఆ తండ్రికి, ప్రత్యేక అవసరాలు ఉన్న కొడుకు కి సాదాసీదా రోజువారీ సమస్యలే హిమాలయ పర్వతాలంత పెద్దవిగా అనిపిస్తాయి. దారి మధ్యలో బస్సులు ఎక్కాల్సి వస్తుంది. అపరిచితుల సహాయం తీసుకోవాల్సి వస్తుంది. ప్రతి అడుగులోనూ లక్కీ మనసులో ఒకే ప్రశ్న తిరుగుతూనే ఉంటుంది — "నేను లేకపోతే మేసన్ ఎలా బతుకుతాడు? ఈ ప్రపంచాన్ని అతను ఒంటరిగా ఎదుర్కోగలడా?" కానీ ఈ ప్రయాణంలో మేసన్ తన తండ్రికే ఎన్నో పాఠాలు నేర్పిస్తాడు. అతని అమాయకత్వం, ధైర్యం, పట్టుదల లక్కీని ఆశ్చర్యపరుస్తాయి. కొడుకును ఎప్పుడూ కాపాడాలని చూసే తండ్రి, కొన్నిసార్లు అతడిని తన కాళ్లపై నిలబడనివ్వాల్సిందేనని అర్థం చేసుకోవడం మొదలుపెడతాడు. అట్లాంటా నగర వీధుల మధ్య సాగిన ఈ ప్రయాణం చివరకు ఒక బేస్‌బాల్ మ్యాచ్‌కి చేరుకోవడం గురించి కాదు. భార్యను కోల్పోయిన తర్వాత ఇద్దరూ మళ్లీ జీవితాన్ని ఎలా ఎదుర్కొన్నారు? ఒకరికి ఒకరు ఎలా బలమయ్యారు? అనే విషయాల గురించి. అవేమిటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. విశ్లేషణ బ్లాక్ అండ్ వైట్ లో తెరకెక్కిన "కలర్ బుక్" పెద్ద కథ కాదు... పెద్ద నిజం చెప్పే సినిమా. జీవితంలో ప్రతి రోజు ఎదురయ్యే చిన్న చిన్న క్షణాల్లో దాగి ఉండే ప్రేమ, బాధ, ఆశ, బంధాలను హృదయానికి హత్తుకునేలా చెప్పే కథ. ఒక తండ్రి తన కొడుకును కోల్పోకుండా కాపాడుకోవాలనుకుంటాడు. అలాగే ఒక కొడుకు తన తండ్రికి మళ్లీ జీవితం మీద నమ్మకం కలిగించే ప్రయత్నం చేసే భావోద్వేగ ప్రయాణం. ఇది కేవలం ఒక ట్రిప్ కథ కాదు... కోల్పోయిన రంగులను మళ్లీ జీవితంలో వెతుక్కునే ఇద్దరి కథ. రెగ్యులర్ గా సినిమాలు ఎక్కువగా "ఏం జరిగింది?" అనే ప్రశ్న చుట్టూ తిరుగుతుంటాయి. ఈ కలర్ బుక్ మాత్రం "మనుషులు ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నారు?" అనే ప్రశ్నకు సమాధానం వెతికేలా స్క్రీన్ ప్లే తో డిజైన్ చేసారు. ఇదే ఈ సినిమా స్క్రిప్ట్‌లోని అతిపెద్ద బలం. డేవిడ్ ఫార్చూన్ రాసిన కథను కమర్షియల్ యాంగిల్ నుంచి చూస్తే ఇందులో పెద్ద విలన్ లేడు. ప్రాణాపాయం లేదు. ప్రపంచాన్ని కాపాడే మిషన్ లేదు. ఒక తండ్రి తన కొడుకును బేస్‌బాల్ మ్యాచ్‌కు తీసుకెళ్లాలనుకుంటాడు. అంతే. కానీ మంచి స్క్రిప్టు అంటే చిన్న సంఘటనల్లో పెద్ద ఎమోషన్స్ ని పట్టుకోవడం. కలర్ బుక్ అదే చేస్తుంది. ఈ స్క్రిప్ట్‌లో అసలు కాన్ఫ్లిక్ట్ ఎక్కడుంది? సాధారణంగా కథల్లో కాన్ఫ్లిక్ట్ బయట ఉంటుంది. ఇక్కడ మాత్రం కాన్ఫ్లిక్ట్ మొత్తం లక్కీ మనసులో ఉంటుంది. భార్య చనిపోయింది. ఇప్పుడు తన కొడుకును ఒంటరిగా పెంచాలి. అతడికి ఏమైనా అయితే? తాను లేకపోతే మేసన్ పరిస్థితి ఏమిటి? ఈ భయాలన్నీ లక్కీని వెంటాడుతుంటాయి. అందుకే సినిమాలో కారు చెడిపోవడం, బస్సు మిస్ అవడం, దారి తప్పిపోవడం వంటి సంఘటనలు కథను ముందుకు నడిపించే ప్లాట్ పాయింట్లు కాదు. అవి లక్కీ మానసిక స్థితిని పరీక్షించే ఎమోషనల్ టెస్టులు. ప్రతి అడ్డంకి అతడిలోని భయాన్ని బయటపెడుతుంది. ఏంటీ ఈ సినిమా స్పెషల్ చాలా సినిమాలు డౌన్ సిండ్రోమ్ ఉన్న పాత్రలను ప్రేక్షకుల సానుభూతి కోసం వాడుకుంటాయి. కానీ కలర్ బుక్ అలా చేయదు. మేసన్ ను "పాపం పిల్లాడు" గా ఎక్కడా చూపించదు. వాడు అల్లరి చేస్తాడు. మొండిగా ఉంటాడు. తప్పులు చేస్తాడు. తండ్రి మాట వినడు. అంటే ఒక సాధారణ పిల్లాడి లాగే ఉంటాడు. ఇక్కడే మనకు నచ్చేస్తుంది. మనం వాడిపై జాలి పడము. మెల్లిగా ప్రేమిస్తాము. అలాగే ఈ కథలో తండ్రి-కొడుకుల రిలేషన్ ను బాగా ఎస్టాబ్లిష్ చేసారు. లక్కీ తన కొడుకును కాపాడాలని అనుకుంటాడు. మేసన్ మాత్రం ప్రపంచాన్ని అనుభవించాలని కోరుకుంటాడు. ఈ రెండు కోరికల మధ్యే మొత్తం సినిమా నడుస్తుంది. అది కూడా పెద్ద పెద్ద డైలాగులతో కాదు. చిన్న చిన్న సంఘటనల ద్వారా. ఒక తండ్రి "వాడికి ప్రమాదం జరగకూడదు" అనుకుంటే, ఒక కొడుకు "నన్ను నేను చూసుకోగలను" అని చెప్పాలనుకుంటాడు. ఈ భావోద్వేగ సంఘర్షణ చాలా సహజంగా అనిపిస్తుంది. ఎక్కడా సినిమా మన కన్నీళ్లు బలవంతంగా లాగడానికి ప్రయత్నించదు. బ్లాక్ అండ్ వైట్ ఎందుకు? 'కలర్ బుక్' అనే పేరున్న సినిమా బ్లాక్ అండ్ వైట్‌లో ఉండటం మొదట విచిత్రంగా అనిపించవచ్చు. కానీ సినిమా పూర్తయ్యాక దాని అర్థం తెలుస్తుంది. లక్కీ జీవితంలో రంగులు పోయాయి. భార్య మరణంతో అతడి ప్రపంచం నలుపు-తెలుపుగా మారిపోయింది. కానీ ప్రయాణం ముగిసే సరికి ప్రేక్షకుడు గ్రహించే విషయం ఏమిటంటే... రంగులు బయట ప్రపంచంలో ఉండవు. మనుషుల మధ్య ఉండే బంధాల్లో ఉంటాయి అని. ఇలాంటి సినిమాలు ఎందుకు అవసరం? ఇప్పటి సినిమా మార్కెట్లో భారీ బడ్జెట్లు, యాక్షన్ సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్, పాన్ ఇండియా హంగామా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అవి కూడా అవసరమే. కానీ మనిషి జీవితంలోని అసలు భావోద్వేగాలను గుర్తు చేసే సినిమాలు కూడా అంతే అవసరం. ఎందుకంటే మనలో చాలా మంది లక్కీల్లాగే ఉంటాము. బాధను బయటపెట్టకుండా లోపలే మోస్తుంటాం. చాలా కుటుంబాలు మేసన్లాంటి పిల్లలను పెంచుతున్నాయి. చాలా తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు గురించి భయపడుతుంటారు. అలాంటి అనుభవాలను తెరపై నిజాయితీగా చూపించినప్పుడు ప్రేక్షకుడికి ఒక భావన కలుగుతుంది. ఫైనల్ థాట్ ఇలాంటి సినిమాలు కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఇవ్వవు. జీవితంపై అవగాహన పెంచుతాయి. డౌన్ సిండ్రోమ్ వంటి పరిస్థితుల గురించి అపోహలను తగ్గిస్తాయి. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలను జాలితో కాకుండా గౌరవంతో, ప్రేమతో చూడాలని నేర్పిస్తాయి.మగవాళ్ళు కూడా బాధపడతారని, ఏడుస్తారని, భావోద్వేగంతో నలిగిపోతారని గుర్తు చేస్తాయి. ముఖ్యంగా మానసిక ఆరోగ్యం, కుటుంబ బంధాలు, తల్లిదండ్రుల బాధ్యతల గురించి చర్చ మొదలుపెడతాయి. ఏదైమైనా జీవితంలో ముందుకు సాగడం అంటే బాధను మర్చిపోవడం కాదు... దానితో కలిసి నడవడం అని చెప్పే ఈ సినిమా ఖచ్చితంగా చూడదగినది. ఎక్కడుంది నెట్ ప్లిక్స్ లో ఉంది.