విరాట్ కోహ్లీ .. ప్రపంచ క్రికెట్లో పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నో రికార్డులు అతడి సొంతం. ఛేజ్ మాస్టర్‌గా పేరుపొందిన విరాట్ కోహ్లీ.. భారత్‌కు ఎన్నో అపురూప విజయాలు అందించాడు.
ప్రపంచ క్రికెట్లో రికార్డులు బద్దలు కొట్టాడు. అయితే ప్రస్తుతం కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగింపు దశకు వచ్చింది. ఇప్పటికే టీ20, టెస్టులకు గుడ్ బై చెప్పేశాడు కోహ్లీ. కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్ 2027 కోహ్లీ కెరీర్లో చివరి ఈవెంట్ అయ్యే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి.అయితే ఇటీవల కొన్ని వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. టెస్ట్ క్రికెట్‌కే ప్రత్యేక గుర్తింపు తెచ్చిన కింగ్.. రిటైర్మెంట్ వెనక్కి తీసుకుని మళ్లీ రీఎంట్రీ ఇస్తాడనే వార్తలు వస్తున్నాయి. అభిమానులు కూడా ఈ వార్తలు నిజం కావాలని కోరుకుంటున్నారు. అతడిలో ఇంకా క్రికెట్ ఉందని.. టెస్ట్ క్రికెట్‌కు అతడి అవసరం ఉందని పేర్కొంటున్నారు. అయితే ఇదే విషయంపై ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న కోహ్లీకి ప్రశ్న ఎదురైంది. దీనికి అతడు తనదైన శైలిలో సమాధానమిచ్చాడు.ఇటీవల కోహ్లీ స్పోర్ట్స్ బ్రాడ్ వన్8 లాంచ్ ఈవెంట్లో పాల్గొన్నాడు. ఈ బ్రాండ్‌లో ఓ షూ ధర రూ. 9,230గా ఉంది. టెస్ట్ క్రికెట్లో కోహ్లీ సాధించిన పరుగులు సైతం 9,230 కావడం గమనార్హం. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ హోస్ట్.. కోహ్లీని ఉద్దేశించి ఓ ప్రశ్న అడిగాడు. "విరాట్ మీరు ఇంకొన్ని రన్స్ చేసి.. ఆ షూ లాభాలు పెంచొచ్చు కదా?" అని అడిగాడు. దీనికి కోహ్లీ "నేను తక్కువ ధరకే అమ్మేయడానికి ఇష్టపడతా. మీరు ఏదైతే అడుగుతున్నారో దానితో.. (టెస్ట్ క్రికెట్‌ను ఉద్దేశిస్తూ.. ) నా పని అయిపోయింది. థాంక్యూ" అని విరాట్ కోహ్లీ సమాధానమిచ్చాడు.కోహ్లీ సమాధానంతో అతడు మళ్లీ టెస్ట్ క్రికెట్లో ఆడబోడనే విషయం స్పష్టమైంది. కోహ్లీ.. త్వరలో ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో బరిలోకి దిగే అవకాశం ఉంది.