
సాధారణంగా కార్పొరేట్ ప్రపంచంలో మానవత్వానికి చోటు ఉండదు అనుకుంటాం. కానీ కరుణామయులైన వ్యాపారవేత్తలూ కొందరుంటారు. అలాంటి పారిశ్రామికవేత్త ఒకరు తన కంపెనీని అమ్మేసి ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులను...
Jun 22 2026 1:46 PM | Updated on Jun 22 2026 2:01 PM
సాధారణంగా కార్పొరేట్ ప్రపంచంలో మానవత్వానికి చోటు ఉండదు అనుకుంటాం. కానీ కరుణామయులైన వ్యాపారవేత్తలూ కొందరుంటారు. అలాంటి పారిశ్రామికవేత్త ఒకరు తన కంపెనీని అమ్మేసి ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులను కోటీశ్వరులను చేశారు. ఎవరాయన.. ఎక్కడ.. ఆ కంపెనీ ఏంటి.. చూద్దాం ఈ కథనంలో..
అమెరికాలోని లూసియానా రాష్ట్రానికి చెందిన కుటుంబ యాజమాన్య సంస్థ ఫైబర్‌బాండ్ (Fibrebond) తీసుకున్న ఒక నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. విద్యుత్ పరికరాలు, డేటా సెంటర్ మౌలిక సదుపాయాల కోసం ప్రత్యేక నిర్మాణాలను తయారు చేసే ఈ సంస్థను పవర్ మేనేజ్మెంట్ దిగ్గజం ఈటన్ (Eaton) 1.7 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.16,045 కోట్లు) కొనుగోలు చేసింది. అయితే ఈ ఒప్పందంలో అత్యంత విశేషమైన అంశం ఏమిటంటే.. సంస్థ మాజీ యజమాని గ్రాహం వాకర్ ఉద్యోగుల కోసం 240 మిలియన్ డాలర్లు (సుమారు రూ.2,265 కోట్లు) కేటాయించాలనే షరతును పెట్టడం.
ఈ నిర్ణయంతో సంస్థలో పనిచేస్తున్న 540 మంది పూర్తి కాల ఉద్యోగులు ఈ మొత్తాన్ని పంచుకోనున్నారు. అంటే సగటున ఒక్కో ఉద్యోగికి 4.43 లక్షల డాలర్లు (సుమారు రూ.4.18 కోట్లు ) లభించనున్నాయి. కంపెనీలో వాటాలు లేకపోయినా, సంస్థ ఎదుగుదలలో ఉద్యోగుల పాత్రను గుర్తించి ఈ బహుమతిని ఇవ్వాలని వాకర్ నిర్ణయించారు.
బోనస్ చెల్లింపులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయితే పూర్తి మొత్తాన్ని పొందాలంటే ఉద్యోగులు ఐదేళ్లపాటు సంస్థలో కొనసాగాల్సి ఉంటుంది. 65 ఏళ్లు దాటిన ఉద్యోగులకు మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ ప్రకటన వెలువడినప్పుడు చాలా మంది ఉద్యోగులు తొలుత నమ్మలేకపోయారని, కొందరు ఇది సరదా ప్రకటనేమోనని భావించారని అమెరికా మీడియా పేర్కొంది.
1982లో క్లాడ్ వాకర్ స్థాపించిన ఫైబర్‌బాండ్ ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంది. 1998లో ఫ్యాక్టరీ అగ్నిప్రమాదం, డాట్‌కామ్ సంక్షోభం, ఆర్థిక మందగమనం కారణంగా ఒక దశలో ఉద్యోగుల సంఖ్య 900 నుంచి 320కు పడిపోయింది. అయినప్పటికీ సంస్థ ఉద్యోగులను కాపాడుకునేందుకు యాజమాన్యం కృషి చేసింది.
తరువాత డేటా సెంటర్ రంగంలో సుమారు 150 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడం సంస్థకు టర్నింగ్ పాయింట్‌గా మారింది. కోవిడ్ అనంతరం క్లౌడ్ సేవలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా సెంటర్లకు భారీ డిమాండ్ ఏర్పడటంతో ఫైబర్‌బాండ్ వ్యాపారం వేగంగా విస్తరించింది. కేవలం ఐదేళ్లలో కంపెనీ అమ్మకాలు దాదాపు 400 శాతం పెరిగాయి.
ఈ భారీ బోనస్‌తో అనేక మంది ఉద్యోగుల జీవితాలు మారిపోయాయి. కొందరు గృహ రుణాలను పూర్తిగా తీర్చగా, మరికొందరు చిన్న వ్యాపారాలు ప్రారంభించారు. 1995లో గంటకు కేవలం 5.35 డాలర్ల వేతనంతో కంపెనీలో చేరిన ఉద్యోగిని లెసియా కీ తన ఇంటి రుణాన్ని క్లియర్ చేసి దుస్తుల దుకాణం ప్రారంభించింది. మరో ఉద్యోగి హాంగ్ బ్లాక్వెల్ పదవీ విరమణ చేసి తన కుటుంబ అవసరాలకు ఈ మొత్తాన్ని వినియోగించింది.
కంపెనీ విక్రయం ద్వారా వాకర్ కుటుంబానికి 1 బిలియన్ డాలర్లకు పైగా లభించినప్పటికీ, ఆ సంపదలో కొంత భాగాన్ని ఉద్యోగులతో పంచుకోవడం కార్పొరేట్ ప్రపంచంలో అరుదైన ఉదాహరణగా నిలిచింది. ఉద్యోగులను కేవలం సిబ్బందిగా కాకుండా సంస్థ విజయానికి భాగస్వాములుగా భావించిన ఈ నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.
‘హను మాన్ 3డీ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
సౌత్ సినిమా నయా సెన్సేషన్.. మమితా బైజు బర్త్‌డే స్పెషల్( ఫొటోలు)
'సలార్' కాటేరమ్మ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉందో తెలుసా? (ఫొటోలు)
రవీంద్రభారతిలో అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన (ఫొటోలు)
హైదరాబాద్ : గ్రాండ్ గా ఆరంభమైన TG 20 లీగ్...తమన్ స్పెషల్ షో అదుర్స్ (ఫొటోలు)
11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. బుడ్డోడి దెబ్బకు యువీ, ఏబీ డివిలియర్స్ రికార్డులు బద్దలు
వాహనాలు తనిఖీ చేస్తుండగా DTOపైకి దూసుకెళ్లిన లారీ
శవం మీద పేలాలు వేరుకునే వాడివి.. నీది ఒక బ్రతుకేనా...
ప్రకాశ్ రాజ్ కు షాక్.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ