ఇంటర్నెట్‌డెస్క్: పశ్చిమాసియాలో శాశ్వత శాంతిస్థాపన ప్రయత్నాల్లో భాగంగా అమెరికా, ఇరాన్ ప్రతినిధులు ఆదివారం స్విట్జర్లాండ్‌లో భేటీ అయ్యారు (US-Iran talks).
ఆ కీలక సమావేశంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ (JD Vance)కు అవమానం జరిగినట్టుగా కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాన్స్ ఎదురుచూస్తుండగానే ఇరాన్ విదేశాంగమంత్రి వాకౌట్ చేయడం.. ఖతార్ ప్రధాని పట్టించుకోకపోవడం వంటివి ఆ వీడియోల్లో కన్పించాయి.
చర్చలు ప్రారంభం కావడానికి ముందు ఇరాన్ (Iran) ప్రతినిధులతో కరచాలనం, ఫొటో సెషన్ నిర్వహించాలని యూఎస్ ప్రతినిధులు ప్లాన్ చేసినట్లు ఐఆర్జీసీ అనుబంధ వార్తాసంస్థ ‘తస్నిమ్’ పేర్కొంది. అయితే ఇజ్రాయెల్‌పై దాడులు చేయకుండా హెజ్బొల్లాను ఇరాన్ నిలువరించాలని.. లేదంటే ఆ దేశంపై మళ్లీ భీకర దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడాన్ని టెహ్రాన్ ప్రతినిధులు సీరియస్‌గా తీసుకున్నారు. అమెరికా ప్రతినిధులతో ఫొటో సెషన్‌కు నిరాకరించిన వారు.. ఆ తర్వాత అక్కడి నుంచి వాకౌట్ చేశారు. ఈ పరిణామాలతో చర్చలకు మధ్యవర్తిత్వం వహించిన పాకిస్థాన్ నేతలు నివ్వెరపోయారు. పరిస్థితి ఒకింత ఉద్రిక్తంగా మారడంతో కొంచెం దూరంలో ఉన్న జేడీ వాన్స్ వాటిని టెన్షన్‌తో గమనిస్తున్నట్లుగా వీడియోలో ఉంది. తర్వాత వాన్స్, పాక్ ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్ ఒక దగ్గరకు వచ్చి చర్చించుకోవడం అందులో కనిపించింది.
ఇదిలా ఉంటే.. మరో మధ్యవర్తిత్వ దేశం ఖతార్ నుంచి వాన్స్‌కు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. పాక్ ప్రధాని షరీఫ్‌ను పలకరించిన ఖతార్ ప్రధాని.. పక్కనే ఉన్న వాన్స్‌ను మాత్రం విస్మరించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. ‘ఇది దౌత్యపరమైన తిరస్కారం’ అని నెటిజన్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఉద్రిక్త వాతావరణంలో చర్చలు మొదలైనా.. శాంతిస్థాపన దిశగా ముందడుగు పడినట్లే కనిపిస్తోంది. టెహ్రాన్ అణు కార్యక్రమం, లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు సహా పలు అంశాలపై ఇరు దేశాల ప్రతినిధులు చర్చించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.