మేజర్ లీగ్ క్రికెట్ 2026 సీజన్లో భాగంగా వాషింగ్టన్ ఫ్రీడర్, ఎంఐ న్యూయార్క్ మధ్య జరిగిన మ్యాచులో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
ఈ మ్యాచులో ఎంఐ న్యూయార్క్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. పాకిస్థాన్ సంతతికి చెందిన యూఎస్ఏ బౌలర్.. ఆసిఫ్ మహమూద్‌ను గ్రౌండ్‌లోనే కొట్టినంత పనిచేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ ఫ్రీడమ్.. 245/5 భారీ స్కోరు చేసింది. అనంతరం ఎంఐ న్యూయార్క్ ఛేజింగ్‌కు దిగింది. అయితే ఇన్నింగ్స్ 9వ ఓవర్ చివరి బంతిని పాకిస్థాన్ సంతతి యూఎస్ఏ పేసర్ ఆసిఫ్ మహమూద్ వేశాడు. క్రీజులో ఉన్న ఎంఐ న్యూయార్క్ కెప్టెన్ పొలార్డ్ షాట్ కొట్టినా సరిగ్గా కనెక్ట్ కాలేదు. దీంతో బౌలర్ చేతిలోకి బంతి వెళ్లింది. ఈ సమయంలో బౌలర్.. స్ట్రైకింగ్ ఎండ్‌లోని వికెట్లపై బంతిని విసిరేందుకు ప్రయత్నించాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ జరిగింది.షాట్ కొట్టి ఫాలో త్రూలో కాస్త ముందుకు వచ్చిన పొలార్డ్.. తొలుత క్రీజులోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ బౌలర్ బంతి కొట్టబోయే సరికి.. కోపోద్రిక్తుడు అయిపోయాడు. క్రీజులో బ్యాట్ పెట్టకుండా.. బౌలర్ వైపు బ్యాట్ ఎత్తాడు. త్రో కొడితే.. బ్యాట్‌తో కొడతా అన్నట్లు లుక్ ఇచ్చాడు. దీంతో ఆ బౌలర్ వెనక్కి తగ్గాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ మ్యాచ్‌లో పొలార్డ్ 56 బంతుల్లో సెంచరీ చేసి అజేయంగా నిలిచాడు. కానీ అతడి జట్టు ఎంఐ న్యూయార్క్.. 30 రన్స్ తేడాతో ఓడిపోయింది.పొలార్డ్ vs మహమూద్ వీడియో చూసిన నెటిజన్లు.. పాత ఘటనను గుర్తు చేస్తున్నారు. గతంలో ఐపీఎల్లో మ్యాచ్ సందర్బంగా ముంబై ఇండియన్స్ ప్లేయర్ పొలార్డ్, ఆర్సీబీ పేసర్ మిచెల్ స్టార్క్ మధ్య ఇలాంటి ఘటనే జరిగింది. దాన్ని ఇప్పుడు అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. పొలార్డ్.. అప్పుడైనా.. ఇప్పుడైనా అలానే ఉన్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు.