
‘కాక్టెయిల్ 2’తో ఇటీవలే ప్రేక్షకుల్ని పలకరించిన బాలీవుడ్ కథానాయకుడు షాహిద్ కపూర్.. చిత్రపరిశ్రమలో తొలినాళ్లకు సంబంధించిన విషయాల్ని ఓ సందర్భంలో గుర్తుచేసుకున్నారు.
‘‘నాన్న నటుడు, అమ్మ 15 ఏళ్ల వయసు నుంచే కథక్ నర్తకి. మేము అద్దె ఇంట్లో ఉండేవాళ్లం. నేను పుట్టి పెరిగిన వాతావరణమే నాలో పట్టుదల, లోతైన అవగాహనను నింపింది. సినీ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ ప్రత్యేక హక్కులున్న వ్యక్తిని అని ఎప్పుడూ అనుకోలేదు. అయినా నా కెరీర్ సులభమైన అవకాశాలతో ప్రారంభం కాలేదు. దానికి బదులుగా చాలా ఏళ్ల పాటు నిరంతర కృషితో శ్రమించాను. 250 ఆడిషన్లు ఇచ్చిన తర్వాతే సినీ పరిశ్రమలో అడుగుపెట్టాను. ఆర్థిక పరిమితులు రోజువారీ జీవితంలోని సాధారణ విషయాలను కూడా ప్రభావితం చేస్తాయి. ప్రేక్షకులు నా ఫ్యాషన్ సెన్స్ బాగుంటుందంటారు.. కానీ కొన్నిసార్లు ఇలాంటి విషయాలు విన్నప్పుడు నవ్వొస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు మార్కెట్లో బట్టలు కొనడానికి కూడా నా దగ్గర సరిపడా డబ్బులు ఉండేవి కావు. ఆర్థిక ఆందోళనలతో పాటు మానసికంగా కూడా ఇబ్బందిపడ్డాన’’ని అన్నారు. 2003లో ‘ఇష్క్ విష్క్’ చిత్రంతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు కథానాయకుడు షాహిద్.
‘శివ మనసుల శక్తి’ కాంబో అదిరిపోయేలా తిరిగి వచ్చేసింది మచ్చా.. ఈ అద్భుతమైన వినోదాల ప్రయాణానికి సిద్ధమవ్వండ’’ని తమ రాబోయే చిత్ర టీజర్‌ను విడుదల చేసింది ‘జోలియ ఇరుంత ఒరుతన్’ సినీబృందం. 16ఏళ్ల కిందట విడుదలైన ‘ఎస్ఎంఎస్’ సినిమా తర్వాత దర్శకుడు ఎం రాజేశ్, హీరో జీవా కాంబోలో వస్తున్న చిత్రమిది. ఇవానా కథానాయిక. సుధాకర్, హాసిని పవిత్ర, రేతిక శ్రీనివాస్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ చిత్రబృందం ఆదివారం ఈ సినిమా టీజర్‌ను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. ఈ టీజర్.. అగ్రహీరో విజయ్ ఓ సినిమా క్లైమాక్స్‌లో హీరోయిన్ పెళ్లి ఆపి ఆమెని వివాహమాడిన సన్నివేశాలను గుర్తు చేస్తూ సుధాకర్.. ‘అప్పుడు పెళ్లి ఆపిన వ్యక్తే ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు.. నువ్వు అలానే రాజకీయాల్లోకి రావాలి’ అని జీవాని ప్రోత్సాహించడం. దాని ఫలితంగానే ఓ పెళ్లిలో వాళ్లిద్దరూ సృష్టించే గందరగోళం, నేపథ్య గీతంతో ఈ టీజర్ ప్రేక్షకుల్లో నవ్వులు పూయించేలా ఉంది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతమందిస్తున్నారు.
కీర్తిసురేశ్, వెంకటేశ్, అనిల్ రావిపూడి, కల్యాణ్‌రామ్, కృతిశెట్టి
వెంకటేశ్, కల్యాణ్‌రామ్ కథానాయకులుగా ఇటీవలే ప్రారంభమైన సినిమా సోమవారం నుంచి రెగ్యులర్ చిత్రీకరణని చేసుకోనుంది. ఆ విషయాన్ని ఓ ప్రత్యేక వీడియోతో ప్రకటించింది చిత్రబృందం. ‘రావిపూడి రక్తంతో విజయతిలకం దిద్దిన వెంకటేశ్‌గారు...’ అంటూ సరదా సరదాగా సాగింది ఆ వీడియో. అందులో ఈ సినిమా రాయలసీమ నేపథ్యంలో సాగే కథతో రూపొందనున్నట్టు చిత్రబృందం పేర్కొంది. కథ రాయలసీమ నేపథ్యంలో సాగినా... ఇది కుటుంబ సినిమానే అని, నవ్వుల కోలాటంలా ఉంటుందంటూ దర్శకుడు అనిల్ రావిపూడి వెల్లడించారు. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో వెంకటేశ్ సరసన కీర్తిసురేశ్, కల్యాణ్‌రామ్‌కి జోడీగా కృతిశెట్టి నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్‌తో కలిసి అర్చన సమర్పిస్తున్నారు. జీవీ ప్రకాశ్‌కుమార్ స్వరకర్త.
వయసుతో సంబంధం లేకుండా వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్న అమితాబ్ బచ్చన్‌కు.. పనికి సంబంధించిన ఆలోచనల వల్ల రాత్రిళ్లు నిద్రపట్టడం లేదని అంటున్నారు. ఆయన తన బ్లాగ్‌లో సినిమాకు సంబంధించినవే కాకుండా.. వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అమితాబ్ ఓ సినిమా షూటింగ్ అనుభవాన్ని పంచుకున్నారు. ‘‘నా వృత్తికి సంబంధించిన కొన్ని క్షణాలు ఇవి. ఒక సినిమా చిత్రీకరణ పూర్తి చేసిన తర్వాత అందులోని ఓ సీన్‌ను నేను ఇంకా బాగా చేసి ఉండవచ్చని నాకు అనిపించింది. దీంతో దర్శకుడి అనుమతితో మళ్లీ ఆ సన్నివేశాన్ని చిత్రీకరించాం. అయితే రెండోసారి కూడా అది మెరుగ్గా వచ్చిందో లేదో నాకు తెలియదు. ఈ ఆలోచనల వల్ల నాకు రాత్రిళ్లు నిద్ర పట్టలేదు. తెలియకుండానే ఉదయం అయిపోయింద’’ని తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు.
రుత్విక్ హీరోగా అనిల్ బోయిడపు తెరకెక్కించిన చిత్రం ‘రాజా ది రాజా’. కే నిహారిక దాసరి నిర్మాత. విశాఖ ధీమాన్ కథానాయిక. సాయికుమార్, నరేశ్, శ్రీనివాస్ అవసరాల తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా జులై 17న థియేటర్లలోకి రానున్నట్లు ఆదివారం ప్రకటించారు. ‘‘ఇది యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకుల్ని అలరించే రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందింది. ఇందులో రుత్విక్, విశాఖల జోడీ.. వాళ్లిద్దరి కెమిస్ట్రీ అలరిస్తుంది’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి సంగీతం: మార్క్ కే రాబిన్, ఛాయాగ్రహణం: రవికిరణ్ బోయిడపు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.