
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామాలయంలో కానుకలు, నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన విచారణను ముమ్మరం చేసింది.
ఇందులో భాగంగా అయోధ్యను వీడి వెళ్లొద్దని ఆలయ సిబ్బందిని, ట్రస్ట్ నిర్వాహకులను ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ట్రస్ట్ సభ్యులు తదితరులను విచారించిన వివరాలు, ఇతర అంశాలతో కూడిన నివేదికలను దర్యాప్తు అధికారులు డిజిటల్ రూపంలో భద్రపర్చుతున్నారని, అదే సమయంలో రోజువారీగా సీఎం కార్యాలయానికి పంపుతున్నట్లు చెప్పాయి.
రామమందిర (Ayodhya Ram Mandir) ట్రస్ట్ చేపట్టిన భూ కొనుగోళ్లు, ఆలయ నిర్మాణ సామగ్రి సేకరణ అంశాలపైనా సిట్ దృష్టి సారించినట్లు సమాచారం. మార్కెట్ ధర కంటే ఎక్కువ రేటుకు భూములను ట్రస్ట్ కొనుగోలు చేసిందనే ఆరోపణల నేపథ్యంలో ఈమేరకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆలయంలోని నిఘా వ్యవస్థలు, భద్రత నిర్వహణను సిట్ బృందం ఇప్పటికే పరిశీలించింది. అయితే, 45 రోజుల ఫుటేజీ మాత్రమే అందుబాటులో ఉండటం సవాల్‌గా మారింది. సీసీటీవీ ఫుటేజీలను తారుమారు చేశారనే ఆధారాలను కూడా అధికారులు గుర్తించారని.. డిలీట్ చేసిన, మార్చిన డేటాను తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఒకే రోజు మూడు యుద్ధనౌకలు.. భారత సముద్రశక్తికి చిహ్నం..!
అయోధ్య రామాలయానికి వచ్చిన విరాళాల దుర్వినియోగం, ఆర్థిక అవకతవకల ఆరోపణలపై యూపీ ప్రభుత్వం ఈ నెల 13న సిట్ ఏర్పాటు చేసింది. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ఆలయ సిబ్బంది తదితరులను దర్యాప్తు అధికారులు ఇటీవల ప్రశ్నించారు. విరాళాల మొత్తాలను గురించి, ఆలయంలో వాటి నిర్వహణ కోసం చేసిన ఏర్పాట్ల గురించి ఆరా తీశారు. విరాళాలకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఆలయ సిబ్బంది వాంగ్మూలాల్లో అనేక వైరుధ్యాలు ఉన్నట్లు గుర్తించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.