
ఇంటర్నెట్ డెస్క్: ఒకప్పుడు సినిమా హీరోలకు రూ.10కోట్ల పారితోషికం ఇస్తున్నారంటేనే ఆశ్చర్యపోయేవాళ్లం. 90ల్లో రూ.కోటి పారితోషికం తీసుకుని అగ్రనటులు చిరంజీవి, కమల్ హాసన్, శ్రీదేవి రికార్డు సృష్టించారు.
గత దశాబ్దకాలంగా దక్షిణాది సినిమాల స్థాయి పెరిగింది. నటులు రజనీకాంత్, యశ్, అల్లు అర్జున్ రూ.200 కోట్లకు పైగా పారితోషికం తీసుకున్నట్టు టాక్. అయితే 2026లో ఈ లెక్కలన్నీ మారిపోయాయి. భారత్‌లో, ఒకే ప్రాజెక్టుతో వాటాల ద్వారా అత్యధిక లాభాలు అందుకున్న నటుడిగా రణ్వీర్ సింగ్ (Ranveer Singh) రికార్డు సృష్టించారు. అయితే దీన్నే మనం పారితోషికం అని కూడా అనుకోవచ్చు. ‘ధురంధర్’ సినిమాతో ఆయన ఈ అరుదైన రికార్డు సాధించారు. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.3,200 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఇండియాలోనే రూ.1,900 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. .
అయితే ఈ ప్రాజెక్టు కోసం రణ్వీర్ ముందుగా ఎలాంటి పారితోషికం తీసుకోలేదు. లాభాల్లో వాటా తీసుకునేలా ఒప్పందం చేసుకున్నారు. సినిమా నిర్మాణ వ్యయం పెరిగినప్పుడు తన సొంత డబ్బు కూడా పెట్టారు. ఫలితంగా లాభాల్లో రణ్వీర్ వాటా భారీగా పెరిగింది. థియేట్రికల్ బోనస్, డిజిటల్, శాటిలైట్, మ్యూజిక్ రైట్స్ నుంచి వచ్చిన ఆదాయంలో రణ్వీర్ వాటా రూ.325 కోట్లకు చేరినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. లాభాల్లో ఎక్కువ వాటాను జియో స్టూడియోస్, ఆదిత్య ధర్ బీ62 స్టూడియోస్ సొంతం చేసుకున్నాయి. ఒక్క ప్రాజెక్ట్‌కు భారతీయ నటుడు ఇంత భారీ మొత్తం అందుకోవడం ఇదే తొలిసారి
గతంలో ఈ రికార్డు సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై ఉండేది. ‘జైలర్’ (2024) సినిమాకు ఆయన రూ.250 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ (పుష్ప 2), ప్రభాస్ (కల్కి 2898 ఏడీ), చిత్రాలకు రూ.200 కోట్లకు పైగానే అందుకున్నట్లు తెలుస్తోంది. 2023లో షారుక్ ఖాన్ ‘జవాన్’, ‘పఠాన్’ ఒక్కో చిత్రానికి రూ.200 కోట్లు తీసుకున్నట్టు సమాచారం. ఇప్పుడు వీరందరినీ దాటేసి రణ్వీర్ సింగ్ దేశంలో అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడిగా అగ్రస్థానంలో నిలిచారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.