
ఊహ తెలిసింది మొదలు.. పిల్లలు అడిగిందల్లా కొనిచ్చే నాన్న.. కనిపించే దైవం కాదా చెప్పండి! ఇది కావాలంటూ అర్జీపెట్టడం ఆలస్యం.. తన శక్తికి మించిందైనా సరే తీసుకొచ్చే ఆయన ప్రేమకు కొలమానమే లేదు.
అలాంటి అపురూపమైన నాన్నకి ‘ఫాదర్స్ డే’ సందర్భంగా ఈ ప్రత్యేక రెసిపీలు చేసి తినిపించండి!
కావలసినవి: చిక్కటి పాలు - 2 లీటర్లు, నిమ్మరసం - 2 స్పూన్లు, పంచదార - 3 కప్పులు, కుంకుమపువ్వు, ఫుడ్ కలర్ - కొద్దిగా, యాలకుల పొడి - అర స్పూన్ స్టఫింగ్ కోసం: మావా - 75 గ్రా, బాదం, పిస్తా పలుకులు - 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి - పావు స్పూన్, కుంకుమపువ్వు - కొద్దిగా, పంచదార - టేబుల్ స్పూన్ తయారీ: మరుగుతున్న పాలలో నిమ్మరసం వేయాలి. నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. విరిగిన పాలను పలుచని వస్త్రంతో వడగట్టి, ఆ మూట మీద చిన్న రోలు ఉంచాలి. ఈలోగా.. స్టఫింగ్ కోసం మావా, పిస్తా, బాదం, యాలకుల పొడి, కుంకుమపువ్వు, పంచదార కలిపి చిన్న ఉండలుగా చేసుకోవాలి. పనీర్‌ను మళ్లీ మళ్లీ కలిపి మెత్తటి పిండిలా చేయాలి. దీంతో అరచేయంత రొట్టెల్లా చేసి.. మధ్యలో స్టఫింగ్ బాల్ ఉంచి, అంచులు మూసేయాలి. ఇప్పుడు పంచదారలో 8 కప్పుల నీళ్లు పోసి మరిగించాలి. అందులో రాజ్‌భోగ్ ఉండలు వేసి, మూతపెట్టి.. సుమారు 20 నిమిషాలు ఉడికించాలి. మధ్యలో రెండుసార్లు గిన్నెను మెల్లగా కదపాలి. స్పూన్‌తో కలపకూడదు. చివర్లో కుంకుమపువ్వు, యాలకుల పొడి, బాదం, పిస్తా పలుకులు వేసి.. సెగ తీసేయాలి. నాలుగు గంటలు పాకంలోనే ఉంచి, తర్వాత వడ్డించాలి.
కావలసినవి: నానబెట్టిన శనగలు - కప్పు, బీట్రూట్, క్యారెట్ తురుము - అర కప్పు చొప్పున, ఉల్లి, కొత్తిమీర తరుగు - పావు కప్పు, వెల్లుల్లి రెబ్బలు - 4, పచ్చిమిర్చి - 2, శనగపిండి, నూనె, పుదీనా - 2 టేబుల్ స్పూన్ల చొప్పున, ధనియాలు, జీలకర్ర పొడులు - స్పూన్ చొప్పున, గరం మసాలా, మిరియాల పొడి - అర స్పూన్ చొప్పున, నిమ్మరసం - టేబుల్ స్పూన్, ఉప్పు - తగినంత, బ్రెడ్పౌడర్ - 3 టేబుల్ స్పూన్లు తయారీ: శనగలను రాత్రంతా నానబెట్టి నీళ్లు వంపేయాలి. వాటికి వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా చేర్చి.. గ్రైండ్ చేయాలి. మరీ మెత్తగా అవసరం లేదు. అందులో కూరగాయల తరుగు, జీలకర్ర, ధనియాలు, మిరియాల పొడులు, గరం మసాలా, నిమ్మరసం, ఉప్పు, శనగపిండి, బ్రెడ్పౌడర్ వేసి కలపాలి. ఈ మిశ్రమంతో చిన్నచిన్న బాల్స్ చేసి కొద్దిగా ఒత్తి టిక్కీల్లా చేయాలి. అన్నీ అయ్యాక.. కాగుతున్న నూనెలో వేయించాలి. బయట క్రిస్పీగా, లోపల మెత్తగా ఎంతో బాగుంటాయి. ఈ బీట్రూట్ క్యారెట్ ఫలాఫెల్ను పల్లీ, కొబ్బరి, టొమాటో లేదా గ్రీన్ చట్నీతో వేడిగా వడ్డించారంటే.. క్షణాల్లో ప్లేట్లు ఖాళీ అయిపోవడం ఖాయం.
కావలసినవి: మైదా - 2 కప్పులు, వాము - అర స్పూన్, ఉప్పు - తగినంత, నెయ్యి - టేబుల్ స్పూన్ స్టఫింగ్ కోసం: మష్రూమ్స్ - పావు కిలో, ఉప్పు - రుచికి తగినంత, ఉల్లితరుగు - చారెడు, పచ్చిమిర్చి - 2, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం - స్పూన్ చొప్పున, బంగాళదుంప - 1, పచ్చిబఠాణీలు - పావు కప్పు, జీలకర్ర, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం - అర స్పూన్ చొప్పున, ధనియాల పొడి - స్పూన్, మిరియాల పొడి - పావు స్పూన్, కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు, నూనె - వేయించడానికి సరిపడా తయారీ: మష్రూమ్స్‌ను సన్నగా తరగాలి. బంగాళదుంపను ఉడికించి మెదపాలి. వెడల్పాటి పాత్రలో మైదా, తగినన్ని నీళ్లు, నెయ్యి, వాము, ఉప్పు వేసి.. కలపాలి. దానిమీద మూతపెట్టి అరగంట పక్కనుంచాలి. ఈలోగా.. ప్యాన్‌లో రెండు స్పూన్ల నూనె వేడిచేసి.. జీలకర్ర వేయాలి. అది వేగాక.. ఉల్లితరుగును బంగారురంగు వచ్చే వరకూ వేయించాలి. అందులో మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మష్రూమ్స్, పచ్చిబఠాణీలు జోడించాలి. అవి మెత్తబడ్డాక.. మెదిపిన బంగాళాదుంప, ధనియాలు, మిరియాలు, జీలకర్ర పొడులు, గరం మసాలా, కారం, ఉప్పు జోడించాలి. చివర్లో కొత్తిమీర, నిమ్మరసం జతచేస్తే.. స్టఫింగ్ సిద్ధమవుతుంది. మైదాపిండిముద్దని సమాన భాగాలుగా విడగొట్టి చిన్న రొట్టెలు చేయాలి. ఒక్కోదాన్ని సగానికి కట్‌చేసి, కోన్‌లా చుట్టాలి. అందులో తగినంత మష్రూమ్ స్టఫింగ్ వేసి.. అంచులు మూసేయాలి. అన్నీ అయ్యాక.. కాగుతున్న నూనెలో వేయించాలి. ఇవి పుదీనా చట్నీ లేదా టొమాటో కెచప్‌తో సూపర్‌గా ఉంటాయి. స్టఫింగ్‌లో కాస్త పనీర్ తురుము, జీడిపప్పు పలుకులు జోడిస్తే.. మరింత రిచ్‌గా ఉంటాయి.
కావలసినవి: మఖానా - 3 కప్పులు, డార్క్‌చాక్లెట్ - 200 గ్రా, నెయ్యి - 3 స్పూన్లు, తేనె - టేబుల్ స్పూన్, వెనీలా ఎసెన్స్ - అర స్పూన్, ఎండు కొబ్బరి తురుము, పిస్తా, బాదం, జీడిపప్పులు - 2 టేబుల్ స్పూన్ల చొప్పున, ఉప్పు - చిటికెడు తయారీ: కడాయిలో రెండు స్పూన్ల నెయ్యి వేడిచేసి.. డ్రై ఫ్రూట్స్‌ను వేయించాలి. వాటిని పళ్లెంలోకి తీసుకుని.. అదే కడాయిలో మఖానాను క్రిస్పీగా అయ్యే వరకూ వేయించాలి. డార్క్చాక్లెట్ను చిన్న ముక్కలుగా కట్ చేసి, డబుల్ బాయిలర్ పద్ధతిలో కరిగించాలి. కరిగిన చాక్లెట్లో మిగిలిన నెయ్యి, తేనె, వెనీలా ఎసెన్స్, ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు వేయించిన మఖానా జోడించి బాగా కలియబెట్టాలి. డ్రై ఫ్రూట్స్‌ను బరకగా గ్రైండ్‌చేసి.. ఇందులో చేర్చాలి. ఈ మిశ్రమాన్ని బటర్ పేపర్ మీద సమంగా సర్ది, ఒక అరగంట ఫ్రిజ్‌లో ఉంచితే.. నోరూరించే ‘చాక్లెట్ మఖానా’ సిద్ధమైపోతుంది.
కావలసినవి: పిస్తాపప్పులు - పావు కిలో, పంచదార - కప్పు, పాలు - 5 టేబుల్ స్పూన్లు, కుంకుమపువ్వు - కొద్దిగా, యాలకుల పొడి - అర స్పూన్, నెయ్యి - స్పూన్ ఫిల్లింగ్ కోసం: మావా - 150 గ్రా, పంచదార పౌడర్ - పావు కప్పు, యాలకుల పొడి - పావు స్పూన్, పిస్తా పలుకులు - 2 టేబుల్ స్పూన్లు తయారీ: పిస్తాపప్పులను దోరగా వేయించి గ్రైండ్ చేయాలి. ఈ పొడిలో నెయ్యి, పంచదార, పాలు, కుంకుమపువ్వు, యాలకుల పొడి వేసి.. సన్నసెగ మీద కలియతిప్పుతుండాలి. నాలుగు నిమిషాల తర్వాత దించేయాలి. మరో పాత్రలో మావాను వేడి చేయాలి. అందులో పిస్తా పలుకులు, పంచదార పొడి, యాలకుల పొడి వేసి కలియతిప్పాలి. ముద్దలా అయ్యాక దించేసి.. చల్లారనివ్వాలి. నెయ్యి రాసిన ప్లాస్టిక్ షీట్‌పై పిస్తా మిశ్రమాన్ని సమంగా సర్దాలి. దాని మీద మావా ఫిల్లింగ్ను సమానంగా పరిచి.. ఒక వైపు నుంచి మెల్లగా రోల్ చేయాలి. దాన్ని బటర్ పేపర్లో చుట్టి.. ఓ అరగంట ఫ్రిజ్‌లో ఉంచాలి. తర్వాత బయటకు తీసి ముక్కలుగా కట్ చేసుకుంటే.. ‘కేసర్ పిస్తా రోల్’ రెడీ.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపారరకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.