
ఇరాన్ - అమెరికా దేశాల మధ్య కుదిరిన 14-అంశాల అవగాహనా ఒప్పందాన్ని పూర్తిగా అమలు చేయడానికి రాబోయే 60 రోజుల్లో సాంకేతిక వివరాలను ఖరారు చేయాల్సి ఉంది.
అందులో భాగంగా ఇవాళ స్విట్జర్లాండ్‌లో మొదటి విడత చర్చలు ప్రారంభమయ్యాయి.
జ్యూరిచ్ (స్విట్జర్లాండ్), జూన్ 21: పశ్చిమాసియా (Middle East)లో ఉద్రిక్తతలను తగ్గించి, శాంతిని నెలకొల్పేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు ఊపందుకున్నాయి. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య కుదిరిన చరిత్రాత్మక 14-అంశాల అవగాహనా ఒప్పందం (MoU) తదుపరి చర్యల్లో భాగంగా స్విట్జర్లాండ్ లోని లూసర్న్ నగర సమీపంలో అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్.. ఇరాన్ ప్రతినిధి బృందంతో సాంకేతిక స్థాయి చర్చలు జరుపుతున్నారు.
శనివారం రాత్రి అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్‌తో పాటు ఆయన సతీమణి, అమెరికా సెకండ్ లేడీ ఉషా వాన్స్ అమెరికా నుంచి స్విట్జర్లాండ్‌కు పయనమై ఈ ఉదయం చేరుకున్నారు.
స్విట్జర్లాండ్‌కు బయలుదేరే ముందు వాన్స్ మీడియాతో మాట్లాడుతూ, ఈ చర్చలు రెండు ముఖ్యమైన అంశాలపై కేంద్రీకృతమై ఉంటాయని స్పష్టం చేశారు. 1. ఇరాన్ అణు కార్యక్రమంపై సందిగ్ధతను తొలగించి, ఒక నిశ్చయమైన ఒప్పందానికి రావడం. 2. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో అక్కడ కాల్పుల విరమణను అమలు చేయడమని ఆయన స్పష్టం చేశారు.
'అక్కడ (లెబనాన్) పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయి. ఇజ్రాయెల్, లెబనాన్ రెండు దేశాలూ సురక్షితంగా ఉండాలనేదే మా ప్రాథమిక లక్ష్యం. పరస్పర దాడుల 'కోడి ముందా-గుడ్డు ముందా' అనే సమస్యను వీడి, కాల్పుల విరమణ నిలకడగా ఉండేలా చేయడమే మా ప్రయత్నం' అని వాన్స్ పేర్కొన్నారు.
మరోవైపు, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, ఆ దేశ ప్రధాన చర్చల ప్రతినిధి ఎమ్.బి. గాలిబాఫ్ (MB Ghalibaf) నేతృత్వంలోని బృందం ఇప్పటికే జ్యూరిచ్ చేరుకుంది. ఇరాన్ లో జరిగిన 'మినాబ్ పాఠశాల ఘటన' బాధితుల జ్ఞాపకార్థం ఈ బృందానికి 'మినాబ్ 168' (Minab 168) అని ఇరాన్ పేరు పెట్టింది.
ఇటీవల లెబనాన్‌లో ఇజ్రాయెల్ కాల్పుల విరమణను ఉల్లంఘించిందనే కారణంతో ఇరాన్ సాయుధ దళాలు 'హోర్ముజ్ జలసంధి' (Strait of Hormuz)ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ ఉద్రిక్తతల నడుమే ఇరాన్ ప్రతినిధులు చర్చల కోసం స్విట్జర్లాండ్ రావడం గమనార్హం.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ బుధవారం వర్చువల్ విధానంలో 14-అంశాల ఒప్పందంపై సంతకాలు చేశారు. శత్రుత్వానికి ముగింపు పలకడం, హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం, అణు ఒప్పందంపై చర్చలు ప్రారంభించడం ఈ MoU ప్రధాన లక్ష్యాలు.
ఈ ఒప్పందాన్ని కార్యరూపంలోకి తెచ్చేందుకు అమెరికా రాయబారులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ ఇప్పటికే స్విట్జర్లాండ్‌లో ఉండి చర్చల పురోగతిని పర్యవేక్షిస్తున్నారు. అలాగే, ఇరు దేశాల మధ్య ప్రధాన మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న ఖతార్ ప్రధాని, విదేశాంగ మంత్రి షేక్ మహ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్ థానీ కూడా శుక్రవారమే స్విట్జర్లాండ్ చేరుకున్నారు.
రాబోయే రెండు మూడు రోజుల పాటు జరగనున్న ఈ సాంకేతిక చర్చలు పశ్చిమాసియా భవిష్యత్తును, శాంతి భద్రతలను నిర్ణయించడంలో అత్యంత కీలకమైనవిగా అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మెకానిక్ కోతి.. సైకిల్‌కు ఎలా పంక్చర్ వేస్తోందో చూడండి..
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..