
NEET పరీక్షకు కొన్ని గంటల ముందు హైదరాబాద్లో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. వైద్య విద్యలో ప్రవేశం కోసం నిర్వహించే NEET పరీక్షకు సిద్ధమవుతున్న ఓ విద్యార్థిని మియాపూర్లో మృతి చెందడం కలకలం రేపింది.
NEET పరీక్షకు కొన్ని గంటల ముందు హైదరాబాద్‌లో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. వైద్య విద్యలో ప్రవేశం కోసం నిర్వహించే NEET పరీక్షకు సిద్ధమవుతున్న ఓ విద్యార్థిని మియాపూర్‌లో మృతి చెందడం కలకలం రేపింది. బాధితురాలు ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, కుటుంబ సభ్యుల అంచనాలను అందుకోలేకపోతున్నాననే ఆందోళనతో పాటు పరీక్షల ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నానని విద్యార్థిని ఓ లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ఆమె ఫ్యామిలీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థిని ఇటీవల NEET పరీక్ష కోసం తీవ్రంగా సన్నద్ధమవుతున్నట్లు, పరీక్ష ఫలితాలపై ఒత్తిడికి గురైనట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు సమాచారం. కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటన మరోసారి విద్యార్థుల్లో పెరుగుతున్న పరీక్షల ఒత్తిడి, మానసిక ఆరోగ్యంపై చర్చకు దారితీసింది. నిపుణులు మాత్రం పరీక్షలు జీవితంలో ఒక భాగమే తప్ప అంతిమ గమ్యం కాదని, విద్యార్థులపై అధిక అంచనాలు, నిరంతర ఒత్తిడి మానసికంగా ప్రభావం చూపే అవకాశం ఉందని సూచిస్తున్నారు.విద్యార్థులు పరీక్షల కారణంగా ఒత్తిడికి గురైతే కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, స్నేహితులతో తమ భావాలను పంచుకోవాలని, అవసరమైతే మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒక పరీక్ష ఫలితం జీవితాన్ని నిర్ణయించదని, విద్యార్థులకు కుటుంబ సభ్యులు నిరంతరం భావోద్వేగపరమైన అండగా నిలవాల్సిన అవసరం ఉందని వారు పేర్కొంటున్నారు. మరోవైపు నీట్ పరీక్షలో గతంలో తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పటిష్ఠ చర్యలు చేపట్టింది.విద్యార్థులకు ముఖ్య సూచనలు..పరీక్షకు హాజరయ్యే విద్యార్థులను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు మాత్రమే కేంద్రాల్లోకి అనుమతిస్తారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5:15 గంటలకు ముగుస్తుంది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డుతో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డును, రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలను తప్పనిసరిగా తీసుకురావాలి. తేలికైన దుస్తులు (హాఫ్-స్లీవ్ షర్టులు/టీ-షర్టులు, ప్యాంట్లు), స్లిప్పర్లు లేదా తక్కువ హీల్స్ ఉన్న పాదరక్షలు ధరించాలని సూచించారు. మొబైల్ ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, బ్లూటూత్ పరికరాలు, పెద్ద బెల్ట్ బకిల్స్, బరువైన ఆభరణాలు వంటివి కేంద్రాల్లోకి అనుమతించరు.ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ 2026 పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో, రద్దు చేసిన పరీక్షను జాతీయ పరీక్షల సంస్థ తిరిగి నిర్వహించనుంది. ఈ పరీక్షకు కనీవినీ ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు 22.79 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. దేశవ్యాప్తంగా 551 నగరాల్లో 5,440 కేంద్రాలతో పాటు, విదేశాల్లో 14 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పటిష్ఠ చర్యలు చేపట్టారు. దేశవ్యాప్తంగా 1.38 లక్షల ఏఐ ఆధారిత సీసీటీవీ కెమెరాలు, 51,000 సిగ్నల్ జామర్లు, రెట్టింపు బయోమెట్రిక్ తనిఖీలను ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రంలో సగటున 40-50 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు.కాగా మే 3న జరిగిన అసలు పరీక్షకు సంబంధించి, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లోని కోచింగ్ కేంద్రాలలో గెస్ పేపర్ పేరుతో ప్రశ్నపత్రం లీక్ అయినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దీనిపై మే 12న కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో ఎన్‌టీఏ పరీక్షను రద్దు చేసి, సీబీఐ విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు. పరీక్షకు సంబంధించిన పిటిషన్లను సుప్రీంకోర్టు జులైకి వాయిదా వేయడంతో, రీ ఎగ్జామ్ నిర్వహణకు మార్గం సుగమమైంది. వదంతులను నమ్మవద్దని, కేవలం అధికారిక సమాచారంపైనే ఆధారపడాలని విద్యార్థులకు స్పష్టం చేసింది.