దేశంలోనే ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ బాంబే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరం పవాయ్‌లోని క్యాంపస్ స్టాఫ్ క్వార్టర్స్ వద్ద ఓ వీధికుక్కపై చిరుత దాడి చేసి హతమార్చింది. జూన్ 19వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియో బయటకు రావడంతో విద్యార్థులు, సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు.సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం... స్టాఫ్ హాస్టల్ భవనం మెట్ల వద్ద ఓ వీధికుక్క నిల్చొని ఉంది. అది ప్రమాదాన్ని ముందుగా పసిగట్టినట్టు పదేపదే ఓ వైపు చూస్తూ అప్రమత్తంగా కనిపించింది. ఇంతలోనే ఓ చిరుత అక్కడికి వచ్చి దానిపై మెరుపుదాడి చేసింది. ఆ శునకం ప్రతిఘటించే ప్రయత్నం చేసినప్పటికీ.. మెడను చిరుతపులి నోట కరచి చంపేసి అనంతరం కళేబరాన్ని చీకట్లోకి లాక్కెళ్లిపోయింది.ఈ షాకింగ్ ఘటనతో క్యాంపస్‌లోని విద్యార్థులు, సిబ్బంది, వారి కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో బయటకు రావాలంటే భయంగా ఉందని, భద్రతపై వారు ఆందోళన చెందుతున్నారు. పెంపుడు జంతువుల విషయంలోనూ భయ పడుతున్నారు. అటవీ ప్రాంతానికి సమీపంలో ఐఐటీ బాంబే ఉండటంతో గతంలోనూ చిరుతలు జాడ కనిపించింది. కానీ, నివాస ప్రాంతాలకు దగ్గరగా వచ్చి దాడులు చేయడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని స్థానికులు చెబుతున్నారు.రావ్ (RAWW) ఎన్జీవో వ్యవస్థాపకుడు, వన్యప్రాణి సంరక్షకుడు పవన్ శర్మ మాట్లాడుతూ.. ‘‘ఈ చిరుత కనిపించిన ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను మేము క్యాంపస్ భద్రతా సిబ్బంది నుంచి సేకరించాల్సి ఉంటుంది. సంజయ్ గాంధీ జాతీయ పార్క్ చాలా దగ్గరలో ఉండటం వల్ల, గత కొన్నేళ్లుగా పోవై క్యాంపస్‌లో చిరుతలు తరచుగా కనిపిస్తూనే ఉన్నాయి’’ అని అన్నారు. అడవి జంతువులు ఎదురుపడిన సందర్భంలో తీసుకోవాల్సిన వివిధ జాగ్రత్తల గురించి సలహా ఇవ్వడానికి తాము ఐఐటి-బి (IIT-B) అధికార యంత్రాంగంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని శర్మ తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో దిండోషిలోని రాహేజా హైట్స్ కాంప్లెక్స్‌లో, థానేలోని వాగ్లే పారిశ్రామిక వాడలో కూడా ఒక చిరుత కనిపించింది. ఆహారం కోసం వేటాడేందుకు చిరుతలు తరచుగా అర్ధరాత్రి వేళల్లో మానవ నివాసాల వైపు వస్తుంటాయని చెప్పారు.