
తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి ఫిన్లాండ్లో అదృశ్యమైన ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. హైదరాబాద్ వనస్థలిపురం వైదేహి నగర్‌కు చెందిన మణిదీప్ రెడ్డి ఉన్నత విద్య కోసం ఫిన్లాండ్లోని లాహ్టి నగరంలో ఉన్న ఎల్‌యూటీ విశ్వవిద్యాలయంలో బీటెక్ తొలి సంవత్సరం చదువుతున్నాడు.
అయితే గత నెల ప్రారంభంలో కుటుంబ సభ్యులతో చివరిసారిగా మాట్లాడిన అనంతరం అతనితో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. అప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో పాటు ఎలాంటి సమాచారం అందకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మణిదీప్‌తో సంప్రదింపులు నిలిచిపోవడంతో అతని స్నేహితులు, పరిచయస్తులు అతను నివసించే గది, విశ్వవిద్యాలయంలో వెతికినా ఎలాంటి సమాచారం లభించలేదు.
దీంతో ఫిన్లాండ్ పోలీసులకు ఫిర్యాదు చేసి అదృశ్య కేసు నమోదు చేయించారు. అయినప్పటికీ 45 రోజులు గడిచినా అతని ఆచూకీ బయటపడకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడిని సురక్షితంగా గుర్తించి స్వదేశానికి తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సంబంధిత అధికారులను వేడుకుంటున్నారు.
ఈ ఘటనపై తెలంగాణ హైకోర్టును కూడా ఆశ్రయించారు మణిదీప్ తల్లిదండ్రులు, తమ ఫిర్యాదుపై అధికారులు తగిన చర్యలు తీసుకోలేదని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు కేంద్ర ప్రభుత్వం, ఫిన్లాండ్లోని భారత రాయబార కార్యాలయం, తెలంగాణ పోలీసులకు నోటీసులు జారీ చేస్తూ ఇప్పటివరకు చేపట్టిన చర్యలపై పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించింది.
కేసు దర్యాప్తు కొనసాగుతోందని కేంద్రం తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేయగా, తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
.