
నటీనటులు: వడ్డే నవీన్, రాశీ సింగ్, శిల్ప తులస్కర్, దేవి ప్రసాద్, వివేక్ రఘువంశీ, వడ్లమాని శ్రీనివాస్, ప్రమోదిని తదితరులు త్రిమూర్తులు (వడ్డే నవీన్) నిజాయితీకి మారుపేరు లాంటి కానిస్టేబుల్. ఆ నిజాయితీ వల్లే అతనికి తరచూ బదిలీలు అవుతుంటాయి.
అందుకే అతన్ని ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ అని పిలుస్తుంటారు. త్రిమూర్తులు పనిచేసే ఏరియాలో రాష్ట్ర ముఖ్యమంత్రి కమల (శిల్ప తులస్కర్) కొడుకు సంతోష్ బాబు (వివేక్ రఘువంశీ)ఎన్నికల్లో పోటీ చేస్తుంటాడు. జనాల సానుభూతి కోసం సీఎం తనపై తానే దాడి జరిగినట్లు ఒక నాటకం ఆడుతుంది.
దాన్ని త్రిమూర్తులు ఫెయిల్ చేస్తాడు. దాంతో కోపం వచ్చిన సీఎం, అతన్ని వేరే పాత పోలీస్ స్టేషన్ కు బదిలీ చేస్తుంది. అక్కడ పని లేకపోవడంతో పాత ఫైల్స్ చూస్తున్న త్రిమూర్తులుకు ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. తన తండ్రి (దేవి ప్రసాద్) చనిపోయిన రోజు రాసిన ఒక ఎఫ్.ఐ.ఆర్ కాపీ దొరుకుతుంది.
సీఎం కొడుకు ప్రియమ్మ అనే గిరిజన అమ్మాయిపై చేసిన లైంగిక దాడికి సంబంధించిన కేసది. కానీ దానికి సంబంధించి తప్పుదోవ పట్టించేలా వేరే కాపీలు కూడా ఉండటంతో హీరో ఎంక్వైరీ మొదలుపెడతాడు. ఈ దర్యాప్తులో ఎలాంటి నిజాలు బయటపడ్డాయి? సీఎం అసలు రంగు ఎలా బయటపడింది?
ఈ కేసును త్రిమూర్తులు ఎలా డీల్ చేశాడు? అనేదే మిగతా కథ. నిజాయితీ గల పోలీసు, ఒక రాజకీయ నాయకురాలి కొడుకు చేసిన అకృత్యాలను బయటపెట్టడం అనేది కొత్త ఫార్ములా కాదు. కానీ దాన్ని పర్ఫెక్టుగా బ్యాలెన్స్ చేస్తే మాత్రం బాగానే వర్కవుట్ అవుతుంది.
ముఖ్యంగా రాజకీయాల చుట్టూ తిరిగే కథలకు డిమాండ్ ఎప్పుడూ బాగానే ఉంటుంది. ఇప్పుడు కొత్త దర్శకుడు కమల్ తేజ కూడా ఇదే చేసాడేమో అనిపించింది. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు కథ అంతా రాజకీయాల చుట్టూనే తిప్పాడు. పొలిటికల్ లీడర్స్ తప్పులు చేయడం, హీరో వారి ఆట కట్టించడం లాంటి రొటీన్ కథను
ఎంచుకున్నప్పుడు కనీసం నమ్మే విధంగా, ఆసక్తికరంగా తీయాలి. ఇందులో అలాంటి కొన్ని సన్నివేశాలు బాగానే వర్కవుట్ అయ్యాయి. మరికొన్ని మాత్రం స్లో నెరేషన్ వల్ల అంతగా ఎక్కలేదు. ఫస్టాఫ్ వరకు ఏదో అలా అలా నడిపించేసాడు దర్శకుడు. ఇంటర్వెల్ నుంచి అసలు కథలోకి వెళ్లాడు. అక్కడ్నుంచి ఇన్వెస్టిగేటివ్ మోడ్‌లోకి వెళ్లిపోతుంది. మైండ్ గేమ్ తరహా స్క్రీన్ ప్లేను రాసుకున్నాడు దర్శకుడు తేజ నర్ల. ముఖ్యమంత్రికి సంబంధించిన సన్నివేశాల్లో కొన్ని లాజిక్స్ ఉండవు కానీ సినిమాను సినిమాలా చూడాలని సరిపెట్టుకోవాలంతే. ఇంటర్వెల్లో ఇచ్చిన హైప్ సెకండాఫ్‌లో బాగానే వాడుకున్నాడు దర్శకుడు. ఫైల్స్ వెతకడం, కేసు దర్యాప్తు చేయడం లాంటివి ఇంకాస్త స్పీడ్‌గా చేసుంటే త్రిమూర్తులు పరుగులు తీసేవాడు. క్లైమాక్స్‌లో వచ్చే కోర్టు సీన్ పర్లేదు. యాక్షన్ సీన్స్ ఓకే. పదేళ్ళ తర్వాత పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో నవీన్ ప్రేక్షకుల ముందుకొచ్చారు.
నిజాయితీ గల కానిస్టేబుల్ పాత్రకు వడ్డే నవీన్ బాగానే సెట్ అయ్యారు. లుక్స్, ఫిట్నెస్ పరంగా పాత సినిమాల కంటే ఇప్పుడే చాలా బాగున్నారు. పదేళ్ళ తర్వాత కూడా ఆయనలాగే స్క్రీన్ మీద కనిపించారు. హీరో భార్యగా రాశీ సింగ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ముఖ్యమంత్రిగా శిల్ప తులస్కర్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది, ఉన్నంతసేపు తన యాక్టింగ్ తో ఆకట్టుకుంటుంది. సీఎం కొడుకుగా నటించిన వివేక్ కూడా బాగా చేశాడు. దేవిప్రసాద్ కాసేపు కనిపించినా మెప్పించారు. రఘుబాబు తన కామెడీతో కాస్త నవ్వించే ప్రయత్నం చేశారు. మిగతా నటీనటులు తమ పరిధి మేర నటించారు.
కళ్యాణ్ నాయక్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. చాలా సన్నివేశాలను బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో ఎలివేట్ చేశారు. విజువల్స్ చాలా నీట్‌గా, కలర్ ఫుల్‌గా వచ్చాయి. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్‌గా ఉండాల్సింది, చాలా అనవసరమైన సీన్లను తీసేయాల్సింది. దర్శకుడు కమల్ తేజ నార్ల రొటీన్ కథను ఎంచుకున్నాడు. వడ్డే నవీన్ నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఓవరాల్‌గా ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’.. నిజాయితీ గల కానిస్టేబుల్ కథ..!
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.