
ముంబయి: దేశీయ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలకు తోడు.. దేశీయంగా ఐటీ రంగ షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలు సూచీలను కుదిపేస్తున్నాయి. ఫలితంగా మార్కెట్లు (Stock Market) భారీగా నష్టపోతున్నాయి.
సెన్సెక్స్ దాదాపు 800 పాయింట్లు దిగజారగా.. నిఫ్టీ 24 వేల మార్క్‌ను కోల్పోయింది. దీంతో దాదాపు రూ.2లక్షల కోట్ల మేర మదుపర్ల సంపద ఆవిరైంది. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 783 పాయింట్ల నష్టంతో 76,627 వద్ద, నిఫ్టీ (Nifty) 218 పాయింట్లు పతనమై 23,949 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
డాలర్‌తో రూపాయి మారకం విలువ 10 పైసలు పెరిగి 94.30 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీలో అదానీ ఎంటర్ప్రైజెస్, సిప్లా, బజాజ్ ఆటో, ఐసీఐసీఐ బ్యాంక్, మ్యాక్స్ హెల్త్‌కేర్ షేర్లు రాణిస్తున్నాయి. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో షేర్లు కుదేలవుతున్నాయి.
టెక్ సంస్థ యాక్సెంచర్ తన ఆదాయ వృద్ధి అంచనాలను తగ్గించడంతో పాటు భవిష్యత్తులో డిమాండ్ బలహీనంగా ఉండొచ్చని పేర్కొంది. దీంతో ఈ రంగంపై ఆందోళనలు మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫలితంగా నిఫ్టీ ఐటీ సూచీ నేడు 6 శాతానికి పైగా పతనమైంది.
ఇన్ఫోసిస్ షేర్లు 7.3శాతం నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. టీసీఎస్, టెక్ మహీంద్రా షేర్లు 6 శాతం చొప్పున పతనమయ్యాయి. హెచ్‌సీఎల్ టెక్నాలసీజ్ షేర్లు 5.5శాతం, విప్రో షేర్లు 4శాతం దిగజారాయి. అమెరికా మార్కెట్లలో యాక్సెంచర్ షేర్లు గురువారం ఏకంగా 17శాతం మేర కుంగడం గమనార్హం.
ఆసియా పసిఫిక్ మార్కెట్లు శుక్రవారం మిశ్రమంగా కదలాడుతున్నాయి. దక్షిణ కొరియా కోస్పి 2.8శాతం, జపాన్ నిక్కీ 0.6శాతం మేర పెరగ్గా.. ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్ 0.74శాతం నష్టంతో ట్రేడ్ అవుతోంది. అమెరికా మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి.
. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి