
మనిషి మూత్రం అంటే అసహ్యించుకుంటాం. కానీ అదే మూత్రంతో ఎరువును తయారుచేస్తారంటే నమ్ముతామా? స్విట్జర్లాండ్ స్టార్టప్ ఒకటి ఈ పనే చేస్తోంది. ఆ సంస్థ పేరు వునానెక్సస్. దాదాపు దశాబ్దకాలం కిందట దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన వూనా అనే ఓ పరిశోధన ప్రాజెక్టు ఆధారంగా ఈ వూనానెక్సస్ పుట్టుకొచ్చింది.
మూత్రాన్ని దాని మూలం వద్దే వేరుచేసి శుద్ధిచేయడం ప్రాజెక్టులో ప్రధానాంశం. ఇందుకోసం ప్రత్యేక టాయ్లెట్లను వినియోగిస్తారు. వేరుచేసిన ద్రవాన్ని నీటితో కలపకుండా, ఓ పైపింగ్ వ్యవస్థ ద్వారా భవనం బేస్మెంట్లో ఉన్న చిన్న శుద్ధి కర్మాగారంలోకి పంపుతారు.
ఆ మూత్రంలో యాంటీ బయాటిక్స్ వంటి సూక్ష్మ కాలుష్య కారకాలను తొలగించి, మొక్కల పెరుగుదలకు అవసరమైన నత్రజని, ఫాస్ఫరస్ వంటి విలువైన పోషకాలను గాఢతరం చేసే ట్యాంకుల శ్రేణిలోకి ప్రవేశపెడతారు. ఆ తర్వాత ఆ ద్రవాన్ని 90 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద పాశ్చరైజ్ చేస్తారు.
దీనివల్ల ఏవైనా సంభావ్య వైరస్లు, ఇతర వ్యాధికారకాలు నశిస్తాయి. శుద్ధిచేసిన ద్రవాన్ని వేరుచేసి, తిరిగి ఫ్లషింగ్ వ్యవస్థలోకి పంపిస్తారు. ఆ తర్వాత అవతలి వైపు నుంచి ‘ఆరిన్’ అనే ద్రవ ఎరువు బయటకు వస్తుంది. ఆరిన్ అనేది పూర్తిగా మనిషి మూత్రంతో తయారైన ఏకైక ఖనిజ ఎరువు అని వూనానెక్సస్ చెబుతోంది.
ఈ ఎరువును స్విస్, ఫ్రెంచ్ అధికారులు అన్ని రకాల మొక్కలకు ఉపయోగించడం కోసం అమ్ముతున్నారు. ప్రస్తుతం జెనీవాలోని పలు ప్రైవేటు బ్యాంకులు, వాణిజ్య, నివాస భవన సముదాయాల్లో వూనానెక్సస్ మూత్రశుద్ధి వ్యవస్థలను ఏర్పాటుచేశారు. ఈ వ్యవస్థ ఏటా సుమారు 30 లక్షల లీటర్ల మూత్రాన్ని పునర్వినియోగం చేస్తోంది.
పారిస్లో కొత్తగా అభివృద్ధి చేసిన పర్యావరణ అనుకూల పరిసర ప్రాంతమంతటా ఈ సాంకేతికతను విస్తరిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టును లాభదాయకంగా మార్చడం ఓ పెద్ద సవాలుగా మారిందని, మూత్రం నుంచి ఒక కిలోగ్రాము నత్రజనిని ఉత్పత్తి చేయడానికి అయ్యే ఖర్చు, కృత్రిమ ఎరువుల కంటే 40 నుంచి 50
రెట్లు ఎక్కువ అని వూనానెక్సస్ సీఈఓ చాంబ్రియర్ వివరించారు.
మనిషి మూత్రాన్ని ఎరువుగా మార్చే ప్రాజెక్టును బ్రిటన్కు చెందిన ‘ఎన్పీకే రికవరీ’ అనే స్టార్టప్ కూడా చేపట్టింది. ఇక్కడ పండుగలు, ఫంక్షన్లలాంటి చోట పోర్టబుల్ టాయ్లెట్లను ఏర్పాటుచేసి, మూత్రాన్ని సేకరించి దాన్ని ఎరువుగా మారుస్తున్నారు. పొలాల్లో గడ్డి పెరగడానికి ఇది ఉపయోగపడుతోంది. యూనివర్శిటీ ఆఫ్ ది వెస్ట్ ఆఫ్ ఇంగ్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న పరిశోధక బృందం ఇటీవల లండన్ మారథాన్, బూమ్టౌన్ ఫెస్టివల్ వంటి కార్యక్రమాల్లో మూత్రాన్ని సేకరించింది. స్విస్ స్టార్టప్ తరహాలోనే ఇది కూడా శుద్ధిచేసి, ఎరువును తయారుచేస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.