
Jayamundhi Bhayamela Manasaa Review : భరణ్ దండమూడి, రవి మహాదాస్యం, రాజేష్ ఖన్నా.. మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన సినిమా ‘జయముంది భయమేల మనసా’. అనంత చిత్రాలయ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై లీల కృష్ణ శ్రీ, శ్యామ్ దొండపాటి నిర్మాణంలో రంజిత్ పాశం దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
జయముంది భయమేల మనసా సినిమా డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా నేడు జూన్ 18న ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజ్ అయింది. వరుణ్(భరణ్ దండమూడి) సినిమా దర్శకుడవ్వాలని ట్రై చేస్తూ ఉంటాడు. బిటెక్ అయిపోయి ఖాళీగా ఉంటూ సినిమాలు ట్రై చేస్తున్నాడని ఇంట్లో తిడుతూ ఉంటారు.
కిరణ్(రవితేజ మహాదాస్యం) తన లవ్ బ్రేకప్ అయిందని బాధపడుతూ ఉంటాడు. సురేష్(రాజేష్ ఖన్నా) సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో క్రియేటర్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఈ ముగ్గురూ కాలేజీ డేస్ నుంచి ఫ్రెండ్స్. ఎవరికి వాళ్ళు తమ లైఫ్ బాగోలేదు అని బాధపడుతూ ఒక రోజు కూర్చొని మాట్లాడుకుంటే రోడ్ ట్రిప్ కి వెళదామని అది కూడా సైకిల్స్ మీద వెళదామని ఫిక్స్ అవుతారు.
ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసుకొని సైకిల్స్ మీద ముంబైకి ట్రిప్ కి బయలుదేరుతారు. అనుకోకుండా వీళ్ళు మీడియా కంట పడటం, వీళ్ళ గురించి టీవీలో రావడం జరుగుతుంది. ఈ ట్రావెలింగ్ లో ఫ్రెండ్స్ మధ్యలో గొడవలు వస్తాయి. వరుణ్ కు చిన్ననాటి ప్రేమ మధు(శరణ్య శర్మ) కలిసే ఛాన్స్ రావడం, వీళ్ళ సైకిల్స్ పోవడం..
ఇలాంటి పలు సంఘటనలతో రోడ్ ట్రిప్ సాగుతుంది. మరి ముగ్గురు ముంబై చేరుకుంటారా? వీళ్ళు టీవీలో కనపడటం వల్ల ఏం జరిగింది? వీళ్ళ సైకిల్స్ ఎలా పోయాయి? మళ్ళీ దొరుకుతాయా?వరుణ్ – మధు ప్రేమ కథేంటి? కిరణ్ తన బ్రేకప్ బాధ నుంచి బయటకు వస్తాడా?
ఈ ట్రిప్ లో వీళ్ళు ఎదుర్కున్న సంఘటనలు ఏంటి.. ఇవన్నీ తెలియాలంటే తెరపై
చూడాల్సిందే.
ఈ నగరానికి ఏమైంది అనే సినిమా వచ్చినప్పటినుంచి అలాంటి లైన్ తో అనేక సినిమాలు వచ్చాయి. వీటి మెయిన్ థీమ్ ఫ్రెండ్స్ ట్రిప్ కి వెళ్లడం, లైఫ్ లో హ్యాపీగా ఉండటం. ఈ సినిమా మెయిన్ పాయింట్ కూడా అదే. కాకపోతే ఇందులో కొత్తగా సైకిల్స్ పై ట్రిప్ ప్లాన్ చేసారు. ముగ్గురు ఫ్రెండ్స్ కి మూడు కథలతో సాగుతుంది. కథ అంతా 2017 బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. మొదట 20 నిముషాలు కాస్త బోరింగ్ గా సాగుతుంది.
వీళ్ళ ట్రిప్ మొదలైన దగ్గర్నుంచి కథ ఆసక్తిగా నడుస్తుంది. రాజేష్ ఖన్నా తన డైలాగ్స్ తో, సీన్స్ తో అక్కడక్కడా బాగానే నవ్వించాడు. వీళ్ళ సైకిల్స్ పోయిన దగ్గర్నుంచి మరింత ఆసక్తిగా మారుతుంది కథ. ఫ్రెండ్స్ మధ్య గొడవలు కూడా వీళ్ళు కలుస్తారా అనే ఆసక్తి నెలకొల్పుతాయి. వరుణ్ – మధు ఫ్లాష్ బ్యాక్ స్కూల్ లవ్ స్టోరీ కాస్త సాగదీసినా క్యూట్ గా ఉంటుంది. వీళ్ళు మళ్ళీ కలిసినప్పుడు కూడా క్యూట్ గా చూపిస్తారు. ప్రీ క్లైమాక్స్ లో ఒక్క కాల్ తో ఫాదర్ ఎమోషన్ ని బాగా పండించారు. కిరణ్ బ్రేకప్ ఎమోషన్ కూడా బాగానే పండింది.
వరుణ్, కిరణ్ పాత్రల కథలకు ఒక ఎండ్ ఇచ్చినా సురేష్ పాత్రకు మాత్రం ఎండ్ ఇవ్వకుండా వదిలేసారు. ఆ పాత్రకు కూడా ఒక క్లోజర్ ఉంటే బాగుండేది. క్లైమాక్స్ లో ఫ్రెండ్స్ ఎమోషన్ ని బాగానే పండించారు. అక్కడక్కడ కామెడీ బాగానే వర్కౌట్ అయింది. కొంచెం ఫార్వార్డ్ చేసుకుంటూ చూసేయొచ్చు. ఒక ఫీల్ గుడ్ సినిమాలా తెరకెక్కించే ప్రయత్నం చేసారు. అయితే ఈ సినిమా ఓ రెండు మూడేళ్ళ క్రితం తీసిన సినిమా అని తెలుస్తుంది. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాని చూడొచ్చు. ఫ్రెండ్స్ కలిసి చూస్తే మరింత కనెక్ట్ అవుతుంది జయముంది భయమేల మనసా సినిమా.
ముగ్గురు ఫ్రెండ్స్ పాత్రల్లో భరణ్ దండమూడి, రవి మహాదాస్యం, రాజేష్ ఖన్నా ఒదిగిపోయారు. ఫ్రెండ్స్ మధ్యలో గొడవలు, ఎమోషన్స్ అన్ని బాగా పండించారు. వారి పాత్రల్లో చక్కగా నటించి మెప్పించారు. రాజేష్ ఖన్నా అయితే బాగానే నవ్వించాడు. శరణ్య శర్మ క్యూట్ గా కనిపించి మెప్పిస్తుంది. జీవన్ కుమార్, భోగిరెడ్డి శ్రీనివాస్, సురభి పార్వతి.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించారు.
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ఒక పాట బాగుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు అనిపిస్తుంది. కొన్ని చోట్ల డబ్బింగ్ సరిగ్గా కుదర్లేదు. రోడ్ ట్రిప్ లో భాగంగా చూపించే లొకేషన్స్ బాగున్నాయి. సింపుల్ స్క్రీన్ ప్లేతో రొటీన్ ఫ్రెండ్స్ కథని ఎంగేజింగ్ గా సింపుల్ గా తెరకెక్కించాడు దర్శకుడు. ఎడిటింగ్ విషయంలో అక్కడక్కడా కొంత షార్ప్ కట్ చేస్తే బాగుండు. నిర్మాణ పరంగా బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.
మొత్తంగా ‘జయముంది భయమేల మనసా’ సినిమా ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి సైకిల్స్ మీద ట్రిప్ కి వెళ్తే ఏం జరిగింది అని ఆసక్తికర కథనంతో సింపుల్ గా తెరకెక్కించారు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.