
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నారు. సినిమా పేరు…వారణాసి (Varanasi). ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల అవుతుంది. కానీ మరో రెండు మూడు నెలల్లోనే షూటింగ్ భాగం పూర్తి అవుతుంది అని అంటున్నారు.
అందుకే, మహేష్ బాబు ఆ తర్వాత చెయ్యబోయే సినిమాల గురించి చర్చ మొదలైంది. ఇటీవల పెద్ది సినిమా తీసిన దర్శకుడు బుచ్చిబాబు ఒక కథ సిద్ధం చేశాడని, అది మహేష్ బాబుకి చెప్పబోతున్నాడు అని ప్రచారం జరిగింది. ఐతే, అదే ప్రశ్న ఆ దర్శకుడికి మీడియా వేస్తే, అది పెద్దలు నిర్ణయిస్తారు అని సమాధానం ఇచ్చాడు.
పెద్దలు అంటే నిర్మాతలు నవీన్ యెర్నేని, రవి శంకర్. మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు వీళ్ళు. ఈ బ్యానర్ త్వరలోనే మహేష్ బాబుతో ఒక సినిమా ప్లాన్ చేస్తోంది. “వారణాసి” తర్వాత మహేష్ బాబుతో తమ సంస్థే సినిమా తీయాలనేది మైత్రి భావన. ఐతే, దర్శకుల విషయంలోనే చర్చలు జరుగుతున్నాయి.
“పెద్ది” దర్శకుడు మాత్రం మహేష్ బాబు లైన్లో లేడు అని అంటున్నారు. బుచ్చిబాబు, మహేష్ బాబు కాంబినేషన్లో మూవీ జరగదు అని సన్నిహితులు తేల్చి చెప్తున్నారు. సో, నిర్మాతలు ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా, ప్రశాంత్ నీల్ వంటి పెద్ద దర్శకులతో చర్చలు జరుపుతున్నారు
.