Dhaka Summons Indian Envoy : భారత్, బంగ్లాదేశ్ దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి తారిఖ్ రెహమాన్ అగ్రశ్రేణి సలహాదారు జహీద్ ఉర్ రెహమాన్‌ను ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారత ఇమ్మిగ్రేషన్ అధికారులు కొన్ని గంటల పాటు నిలిపి వేసి, విచారించడం ఇరుదేశాల మధ్య తీవ్ర వివాదానికి దారి తీసింది.
ఈ ఘటనపై బంగ్లాదేశ్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ దేశ అగ్రనేతకు జరిగిన అవమానానికి గానూ తీవ్ర నిరసన తెలియజేస్తూ.. ఢాకాలోని భారత డిప్యూటీ హైకమిషనర్ పవన్ బాధేకు బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ అత్యవసర సమన్లు జారీ చేసి వివరణ కోరింది.విమానాశ్రయంలో అసలేం జరిగిందంటే..?భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ఆధ్వర్యంలో జరగనున్న ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ (ఐఓఆర్ఏ) సీనియర్ అధికారుల 28వ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు జహీద్ ఉర్ రెహమాన్ భారత్ ప్రభుత్వ అధికారిక ఆహ్వానంపై ఆదివారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు.
అయితే ఇమ్మిగ్రేషన్ తనిఖీల సమయంలో రొటీన్ సెక్యూరిటీ అలర్ట్ కింద ఆయన పేరు రావడంతో.. అధికారులు ఆయనను పక్కకు పిలిచారు. బంగ్లాదేశ్ అధికారిక వార్తా సంస్థ బీఎస్ఎస్ కథనం ప్రకారం.. దాదాపు రెండున్నర గంటల పాటు ఆయనను ఇమ్మిగ్రేషన్ విభాగంలోనే ఉంచి అధికారులు రకరకాల ప్రశ్నలు వేశారు.జహీద్ ఉర్ రెహమాన్ సాధారణ బంగ్లాదేశ్ పాస్‌పోర్ట్‌పై సార్క్ వీసాతో ప్రయాణిస్తున్నారని, ఆయన వద్ద దౌత్యపరమైన పాస్‌పోర్ట్ లేదని బంగ్లాదేశ్ మీడియా వెల్లడించింది.
కాగా జహీద్ పొలిటికల్ కామెంటేటర్‌గా, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వానికి తీవ్ర విమర్శకుడిగా గుర్తింపు పొందారు. సుదీర్ఘ నిరీక్షణ, విచారణ అనంతరం భారత అధికారులు ఆయనకు దేశంలోకి ప్రవేశించడానికి అనుమతి ఇచ్చినప్పటికీ..
జరిగిన అవమానంతో నొచ్చుకున్న జహీద్ తన పర్యటనను రద్దు చేసుకుని తక్షణమే స్వదేశానికి తిరుగు పయనమయ్యారు.తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన బంగ్లాదేశ్..ఈ ఘటనపై బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి డాక్టర్
ఖలీలూర్ రెహమాన్ స్పందిస్తూ.. ఇది ఎంతమాత్రం ఊహించని, అత్యంత దురదృష్టకరమైన సంఘటన అని అభివర్ణించారు. ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తోందని, దౌత్యపరంగా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే భారత దౌత్యాధికారిని పిలిపించి ఢాకా తన తీవ్ర నిరాశ, అసంతృప్తిని అధికారికంగా వ్యక్తం చేసింది. అయితే ఈ మొత్తం వ్యవహారంపై న్యూఢిల్లీ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. మళ్లీ దెబ్బతింటున్న భారత్-బంగ్లా బంధం..2024లో బంగ్లాదేశ్‌లో చెలరేగిన ప్రజా తిరుగుబాటు కారణంగా షేక్ హసీనా ప్రభుత్వం పతనమైనప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. హసీనా పతనం తర్వాత ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం స్థానంలో.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తారిఖ్ రెహమాన్ నేతృత్వంలోని కూటమి ఘనవిజయం సాధించడంతో సంబంధాలు తిరిగి మెరుగు పడతాయని అంతా భావించారు. కానీ గత కొద్ది రోజులుగా అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి అక్రమ వలసదారులని పేర్కొంటూ భారత్ కొందరిని తిరిగి బంగ్లాదేశ్‌కు పంపించి వేయడంపై ఇరుదేశాల మధ్య ఇప్పటికే అంతర్గత ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇప్పుడు పీఎం సలహాదారుడి ఎయిర్పోర్ట్ ఘటన ఈ ఉద్రిక్తతలకు మరింత పెంచినట్లు అయింది.