
Telangana: జలమండలికి పెరుగుతున్న విద్యుత్ వినియోగం, అదే స్థాయిలో అందుతున్న భారీ కరెంట్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవడానికి సౌర విద్యుత్ ఉత్పత్తి వైపు అడుగులు వేస్తోంది. ఈ ప్రాజెక్టును మూడు దశల్లో చేపట్టాలని నిర్ణయించుకోగా, తాజాగా దీనికి కార్యాచరణ సిద్ధమైంది.
రూ. 383 కోట్ల వ్యయంతో.. మొదటి దశలో భాగంగా మల్లారం, పెద్దాపూర్, కొండపాక ప్రాంతాల్లో రూ. 383 కోట్ల వ్యయంతో భారీ సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్లాంట్ల ద్వారా 67.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నారు.
త్వరలోనే ఈ పనుల కోసం టెండర్లు పిలవడానికి వాటర్ బోర్డు సిద్ధమైంది. జలమండలికి భారీగా విద్యుత్.. నగరానికి సరఫరా చేస్తున్న నీటిలో కృష్ణా, గోదావరి నదుల నుంచి ఎత్తిపోతల ద్వారా వస్తున్న నీరే కీలకం. మంజీర జలాలు కూడా పాక్షికంగా ఎత్తిపోతల పథకాలపై ఆధారపడి ఉండటంతో, జలమండలికి భారీగా విద్యుత్ అవసరమవుతోంది.
ప్రస్తుతం జలమండలి నెలకు రూ. 120 కోట్ల మేర విద్యుత్ ఛార్జీలను చెల్లిస్తోంది. రాష్ట్రంలోని 72 ప్రాంతాల్లో.. జలమండలికి అనేక ప్రాంతాల్లో సొంత ఖాళీ స్థలాలు ఉండటమే కాకుండా, పలుచోట్ల భారీ రిజర్వాయర్లు ఉండటం వల్ల సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు పరిస్థితులు ఎంతో అనుకూలంగా ఉన్నాయి.
తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఆర్ఈడీసీఓ) సమన్వయంతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని 72 ప్రాంతాల్లో సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి అవకాశం ఉందని జలమండలి అధికారులు గుర్తించారు
.