
పల్నాడు జిల్లా కోనూరు సమీపంలో కృష్ణా నదిలో పడవ బోల్తా పడి నలుగురు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్న ఆయన, ఈ దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో ఫోన్లో సమీక్ష నిర్వహించారు.
మృతుల కుటుంబాలకు తక్షణ సహాయంగా రూ. 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు.ఈ ప్రమాదంపై రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ అధికారులతో కూడిన బృందంతో పూర్తి స్థాయి విచారణ జరిపించాలని సీఎం ఆదేశించారు. సహాయక చర్యలు, తదుపరి కార్యక్రమాలను పర్యవేక్షించే బాధ్యతను విపత్తు నిర్వహణ సంస్థ డైరెక్టర్ ప్రఖర్ జైన్, సమాచార శాఖ డైరెక్టర్ విశ్వనాథ్, జిల్లా కలెక్టర్కు అప్పగించారు.పడవలో ప్రయాణిస్తున్న మిగతా ఆరుగురు సురక్షితంగా ఉన్నారని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.
ప్రమాదానికి గల కారణాలను గుర్తించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు
.