అనంతపురం జిల్లా తాడిపత్రిలో శుక్రవారం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యేలు జేసీ ప్రభాకర్ రెడ్డి , కేతిరెడ్డి పెద్దారెడ్డి తీరుతో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనా
వైఫల్యాలను ప్రశ్నిస్తూ వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి నేతృత్వంలో వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమానికి సిద్ధమయ్యాయి. అయితే ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి బైక్ ర్యాలీకి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకోవటంతో వైసీపీ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. శుక్రవారం ఉదయమే పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు.. హౌస్ అరెస్ట్ చేశారు. అనంతరం అనంతపురానికి తరలించారు. మరోవైపు హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ తనను ఎలా అడ్డుకుంటారంటూ పెద్దారెడ్డి పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దారెడ్డిని తరలించే సందర్భంగా వైసీపీ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం నెలకొంది. అటు అనంతపురం ఎస్పీ కార్యాలయం వద్ద కేతిరెడ్డి పెద్దారెడ్డి ధర్నా నిర్వహించారు. తాడిపత్రి పోలీసులు ప్రభాకర్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ పెద్దారెడ్డి ఆరోపించారు. మరోవైపు కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన కొడుకులతో పాటుగా వైసీపీకి చెందిన 24 మంది కార్యకర్తలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో ఆందోళన నిర్వహించారు. తాడిపత్రిలో ఇటీవల జరిగిన ఘటనలకు వారే బాధ్యులన్న జేసీ ప్రభాకర్ రెడ్డి.. పెద్దారెడ్డి. ఆయన ఇద్దరు కుమారులను, అలాగే వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. న్యాయం చేసే వరకూ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసనకు మద్దతుగా టీడీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకోవటంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అనంతరం అనుచరులతో కలిసి జేసీ ప్రభాకర్ రెడ్డి.. పెద్దారెడ్డి నివాసం వైపు వెళ్లేందుకు యత్నించటంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడే మంచంపై పడుకుని నిరసన తెలియజేశారు. పోలీసులు ఒత్తిళ్లకు లోనుకాకుండా వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.