యావత్తు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాద ఘటనకు శుక్రవారంతో ఏడాది పూర్తయ్యింది. అహ్మదాబాద్ నుంచి లండన్‌కు ప్రయాణికులు, సిబ్బంది కలిపి మొత్తం 242 మందితో బయలుదేరిన
విమానం టెకాఫ్ అయిన 32 సెకెన్లకే కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో విమానంలో 241 మంది ప్రాణాలు కోల్పోగా.. విశ్వాస్ కుమార్ రమేశ్ అనే వ్యక్తి ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ, నాటి విషాదం, ఆ చేదు జ్ఞాపకాలు ఆయనను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. తాను ప్రాణాలతో బయటపడినా, నిద్రలేని రాత్రులు గడుపుతూ రోజూ చస్తూ ఉన్నానని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు. విశ్వాస్ కుమార్ రమేష్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నేను ప్రాణాలతో బయటపడిందే జనాలకు కనిపిస్తుంది. కానీ నాలుగు గోడల మధ్య నేను అనుభవిస్తున్న నరకయాతన ఎవరికీ అర్థం కాదు.. ఇప్పటికీ నేను ఆందోళన, నిద్రలేమి చేదు జ్ఞాపకాలతో పోరాటం చేస్తున్నాను. బతికి ఉన్నందుకు కృతజ్ఞుడినే. కానీ ఏడాది నుంచి నేను చేస్తోన్న పోరాటాన్ని మాటల్లో చెప్పలేను.. నా జీవితాన్ని పునర్నిర్మించుకోడానికి, కుటుంబానికి వీలైనంత ఉత్తమంగా మద్దతుగా నిలవడానికి ప్రయత్నిస్తున్నాను.. ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ఎంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నానని’’ అని తెలిపారు.ఈ వేదన తన ఒక్కడిదే కాదని, బాధిత కుటుంబాలు కూడా ఇటువంటి వేదననే అనుభవిస్తున్నాయని విశ్వాస్ వాపోయారు. అయితే, జరిగిపోయిన దానిని ఎవరూ మార్చలేరు కానీ.. బాధితులకు నిజాయతీ, వారు ఎదుర్కొంటున్న ప్రశ్నలకు సమాధానాలు కావాలని రమేశ్ డిమాండ్ చేశారు. ఇంగ్లాండ్‌లోని లీసెస్టర్‌లో కుటుంబంతో కలిసి నివాసం ఉండే రమేష్.. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో సోదరుడ్ని కోల్పోయాడు.రమేష్ తన ప్రయోజనాలపై న్యాయపోరాటానికి యూకేకు చెందిన హడ్జెల్ సాలిసిటర్స్ అనే సంస్థను ఆశ్రయించారు. ప్రమాదానికి సంబంధించిన సివిల్ క్లెయిమ్‌లను ఆ సంస్థ పరిశీలిస్తుండగా.. శారీరక, మానసిక పునరావాస సహాయం కోసం ఎయిర్ ఇండియా ప్రతినిధులతో చర్చలు కొనసాగుతున్నాయి.రమేష్ కుటుంబ సలహదారు సంజీవ్ పటేల్ మాట్లాడుతూ... ‘‘ఇతరుల సాయం లేకుండా అతను (రమేష్) ఇంటి నుంచి బయటకు రాలేకపోతున్నాడు. తీవ్రమైన మానసిక క్షోభకు గురయ్యాడు... మరియు ఆ గాయాలు చాలా కాలం బహుశా జీవితాంతం వెంటాడుతాయి.. ఆ విపత్తు వల్ల ప్రభావితమైన కుటుంబాలన్నీ తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నాయి. ప్రతి ఒక్కరూ కఠినమైన ఆ ప్రయాణాన్ని దాటుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇక, రమేష్, అతడి కుటుంబానికి జరిగిన నష్టం ఊహించలేనంత ఘోరమైంది’’ అన్నారు.ఇదిలా ఉండగా, అహ్మదాబాద్ ప్రమాదానికి ప్రభావితమైన ప్రతి ఒక్కరికీ మద్దతు ఇవ్వడానికి ఎయిర్ ఇండియా కట్టుబడి ఉందని ఆ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఎయిండియా విమానం అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సమీపంలోని మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కూలిపోయింది. దీంతో మెడికల్ విద్యార్థులు సైతం ప్రాణాలు కోల్పోయారు.