
Amalapuram: బాల్య వివాహాల నిరోధంతోనే బాలికలకు ఉజ్వల భవిష్యత్తు సాధ్యం: కలెక్టర్ మహేష్ కుమార్ అమలాపురం : బాల్య వివాహాలనే సామాజిక జాడ్యాన్ని సమాజం నుంచి పూర్తిగా నిర్మూలించినప్పుడే బాలికల ఉజ్వల
భవిష్యత్తు, మహిళా సాధికారత సాధ్యమవుతుందని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ అన్నారు.
గురువారం కలెక్టరేట్లో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బాల్య వివాహాల నిరోధంపై జిల్లా స్థాయి అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. మైనర్ బాలికలకు వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమే కాకుండా వారి శారీరక, మానసిక ఎదుగుదలకు తీవ్ర ఆటంకాలు కలిగిస్తుందని తెలిపారు.
గ్రామాల్లో ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు సమాచారం అందితే వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించారు. బాల్య వివాహాల వల్ల టీనేజ్ గర్భధారణలు పెరిగి తల్లి, శిశువుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. రక్తహీనత, శిశు మరణాల రేటు పెరగడానికి కూడా బాల్య వివాహాలు ప్రధాన కారణమన్నారు.
ఆడపిల్లల విద్యకు తల్లిదండ్రులు ప్రాధాన్యత ఇవ్వాలని, డ్రాప్అవుట్ విద్యార్థులను గుర్తించి తిరిగి చదువులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టాలని సూచించారు. బాల్య వివాహాల నిర్మూలనకు అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ కె. నాగమణి, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ ఎం. దుర్గారావు, డీసీహెచ్ఎస్ కార్తిక్, సీడీపీవోలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.