
Air India crash| ఇంటర్నెట్‌డెస్క్: దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఎయిరిండియా ప్రమాద ఘటన జరిగిన నేటికి ఏడాది. ఆ దుర్ఘటన నుంచి బయటపడిన ఒక్కే ఒక్కడు విశ్వాస్ కుమార్ రమేశ్ (Vishwas Kumar Ramesh)
. ఏడాది గడిచిపోయినా.. ఆయన ఈ విషాదాన్ని మర్చిపోలేకపోతున్నారు. అలాగే బాధిత కుటుంబాల మనసుల్లోని ప్రశ్నలకు సమాధానాలు కావాలని అడుగుతున్నారు.
‘‘నేను బతికి బయటపడినదే ప్రజలకు కనిపిస్తుంది. కానీ నాలుగు గోడల మధ్య నేను ఎదుర్కొంటున్న సవాళ్లు ఎవరికీ అర్థం కావు. ఇప్పటికీ నేను నిద్రలేమి, ఆందోళన, చేదు జ్ఞాపకాలతో పోరాడుతున్నాను. ఒక సంవత్సరం గడిచిపోయింది. బతికి ఉన్నందుకు కృతజ్ఞుడినే. కానీ అప్పటినుంచి నేను చేస్తోన్న పోరాటాన్ని మాత్రం మాటల్లో వర్ణించలేను. నా జీవితాన్ని పునర్నిర్మించుకుంటూ కుటుంబంతో కలిసి ముందుకు సాగుతున్నాను’’ అని జాతీయమీడియాతో మాట్లాడారు. ఈ బాధ తన ఒక్కడిదే కాదని, ప్రభావిత కుటుంబాలు కూడా ఇదేరకమైన వేదనను అనుభవిస్తున్నాయని విశ్వాస్ చెప్పారు. జరిగిన దానిని ఎవరూ మార్చలేరు కానీ.. ప్రజలకు నిజాయతీ, వారు ఎదుర్కొంటున్న ప్రశ్నలకు సమాధానాలు కావాలన్నారు (Ahmedabad Air India crash).
గతేడాది అహ్మదాబాద్‌లో టేకాఫ్ అయిన వెంటనే ఎయిరిండియా (Air India) విమానం కుప్పకూలిన ఘటనలో 241 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంలో విశ్వాస్ కుమార్ ఒక్కడే బయటపడ్డారు. బ్రిటన్‌లో నివాసముంటున్న విశ్వాస్.. గుజరాత్‌లోని తన కుటుంబాన్ని కలిసేందుకు వచ్చి తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ రోజు విమానంలో 11-ఏ సీటులో విశ్వాస్ కుమార్ కూర్చున్నారు. ఆ సీటు విరిగిపడిపోవడంతో ఆయనకు మంటలు అంటుకోలేదు. ప్రమాదం అనంతరం రక్తపుమరకలతో నడుచుకుంటూ వచ్చి ఆయన అంబులెన్సు ఎక్కిన దృశ్యాలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంలో తన సోదరుడు అజయ్‌ను కోల్పోయారు. విమానం హాస్టల్ భవనంపై కూలడంతో మృతుల సంఖ్య 260కి చేరింది. కాగా.. దుర్ఘటనకు సంబంధించిన తుది రిపోర్ట్ రావడానికి ఇంకా రెండు నెలలు పట్టొచ్చని తెలుస్తోంది.
ఆ విమానం కూలిన హాస్టల్ భవనం స్థానంలో రూ.547 కోట్లతో మెడికల్ హబ్‌ను అభివృద్ధి చేయనున్నట్లు గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర మంత్రి ప్రఫుల్ పన్సేరియా వెల్లడించారు. వైద్య విద్యార్థులకు కొత్త అవకాశాలు కల్పించేందుకు దీనిని ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు.
15 బాధిత కుటుంబాలు తమ ఆత్మీయుల వ్యక్తిగత వస్తువులను స్వీకరించడానికి నిరాకరించాయని ఎయిరిండియా మాతృ సంస్థ టాటా గ్రూప్ శుక్రవారం వెల్లడించింది. 91 శాతం కుటుంబాలకు కోటి రూపాయల నష్ట పరిహార చెల్లింపును పూర్తిచేశామని తెలిపింది. పత్రాలు సరిగా లేని, పరిహార స్వీకరణకు నిరాకరించిన కేసుల్లో పరిహార చెల్లింపు ప్రక్రియ పూర్తికాలేదని చెప్పారు. 96 శాతం బాధిత కుటుంబాలకు మధ్యంతర పరిహారం (రూ.25 లక్షలు) అందించామని పేర్కొంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తిరుమల శ్రీవారిని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ (Mukesh Ambani) దర్శించుకున్నారు.