
సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు తాజా చిత్రం 'సింగ్ గీతం' శుక్రవారం జనం ముందుకొచ్చింది. 94 సంవత్సరాల వయసులో సింగీతం నిర్దేశకత్వంలో ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) దీన్ని ప్రొడ్యూస్
చేశారు. నిత్య ప్రయోగశీలి సింగీతం తెరకెక్కించిన ఈ ఫాంటసీ కామెడీ మ్యూజిక్ ఫిల్మ్ ఎలా ఉందో చూద్దాం.
సోషియో ఫాంటసీ మూవీస్ తెలుగులో కొత్తేమీ కాదు. ఇదీ అలాంటిదే! ఆకాశాన్ని తాకే ఎత్తైన కొండల నడుమ పచ్చని చెట్లతో అలరారే కుబేర పురం అనే గ్రామంలో జరిగే కథ ఇది. అక్కడి ప్రతి చెట్టునూ బిడ్డలా చూసుకుంటుంది శైలజ (నివేదా పేతురాజ్ Nivetha Pethuraj). ఆ ప్రాంతంలో గోల్డ్ మైన్ ఉందనే విషయం తెలిసిన ఆమె భర్త ఉదయ్ (రాహుల్ రవీంద్రన్ Rahul Ravindran) భార్యను పురిటికి పట్నం పంపేసి, ఆ గ్రామస్థులను ఒప్పించి, మైనింగ్ తవ్వకాలకు పాల్పడతాడు. పండంటి బిడ్డతో తిరిగి గ్రామానికి వచ్చిన శైలజ జరిగిన దారుణం చూసి కల్లోల పడుతుంది. మైనింగ్ టన్నెల్లో ప్రమాదశాత్తు కన్నుమూస్తుంది. భార్య మరణంతో జీవితంపై విరక్తి కలిగిన ఉదయ్... చంటి పిల్లాడిని తీసుకుని గ్రామాన్ని విడిచి వెళ్ళిపోతాడు. చివరి దశలో కన్నుమూసే ముందు ఆ గ్రామంలోని భూమిని కొడుకు ప్రతాప్ (అయాన్) పేరున రాస్తాడు.
తండ్రి నుండి సంక్రమించిన ఆ భూమిని అమ్మడానికి కుబేర పురం వచ్చిన ప్రతాప్ కు వింతవింత అనుభవాలు ఎదువుతాయి. చెట్టే తన తల్లి అని భావించే గౌరి (అహల్య బమ్రూ)ను చూసి కంగుతింటాడు. అప్పటికే తన భూమిని మైనింగ్ కంపెనీకి కాంట్రాక్ట్ కు ఇచ్చారని తెలిసి, తన వాటా కోసం పట్టు బడతాడు. ఊరిలో మిగిలిన చివరి చెట్టును తొలగించి, మైనింగ్ చేయడం మాత్రమే మిగిలి ఉందని రేణు (శాలిని కొండేపూడి Shalini Kondepudi) చెప్పడంతో ఆ చెట్టును నరికేయిస్తాడు ప్రతాప్. అక్కడ నుంచి వారు ఊహించని సంఘటనలు గ్రామంలో జరుగుతాయి. గ్రామస్థులంతా మాటల్ని కూడా పాటల్లా పాడటం మొదలెడతారు. అంతేకాదు... అన్ని నిజాలే చెప్పేస్తుంటారు. అలాంటి ఊహకందని పరిస్థితుల నుంచి గ్రామస్థులు ఎలా బయటపడ్డారు? తన గతం తెలిసిన ప్రతాప్ ఆ ఊరి కోసం ఏం చేశాడు? బంగారం కోసం ప్రకృతిని నాశనం చేయాలనుకున్న ఊరి జనాల మనసులు ఎలా మారాయి? అనేది మిగతా కథ.
జైలు నుండి విడుదలైన ప్రతాప్ కుబేర పురం వెళ్ళడంతో కథను మొదలు పెట్టి, ద్వితీయార్థంలో అతని ఫ్లాష్ బ్యాక్‌ను చూపించడం కాస్తంత ఆసక్తిని కలిగించే అంశం. ధనార్జనే పరమావధిగా బతికే జనాలలో మార్పు తీసుకు రావడం కోసం ఫాంటసీని మిక్స్ చేసి క్లయిమాక్స్ ను కొత్తగా తెరకెక్కించారు. సినిమా ప్రారంభం ఆసక్తికరంగా ఉన్నా... ఊరి జనాలంతా కుబేరుడి శాపంతో పాటలు పాడటం మొదలైన తర్వాత కథ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టైపోయింది. ఈ ప్రయోగం గురించి కొంత అవగాహన ఉన్న వాళ్ళ పరిస్థితి ఓకే గానీ, ఆ విషయం తెలియక థియేటర్‌కు వచ్చిన వారు అసహనానికి గురి కావడం ఖాయం. ఏదైనా కొత్త ప్రయోగం చేసినప్పుడు అది అందరినీ ఆకట్టుకునేలా యూనిక్ గా ఉండాలి. కానీ ఇలా పాటలు పాడుతూ కథను నడుపుతామంటే కష్టమే. ఐదు, పది నిమిషాలు కాగానే మొనాటనీ అనిపిస్తుంది. అదే ఇక్కడా జరిగింది.
సింగీతం శ్రీనివాసరావు (Singeetham Srinivasarao) మొదటి నుండి కొత్తదనాన్ని ప్రేక్షకులకు రుచి చూపించాలని తాపత్రయపడే వ్యక్తి. ఆయన తీసిన ప్రయోగాత్మక చిత్రాలు కొన్ని సక్సెస్ అయ్యాయి. మరికొన్ని ఫెయిల్ అయ్యాయి. అయితే ఈ సినిమాను కేవలం ప్రయోగాత్మకంగానే కాకుండా ప్రయోజనాత్మకంగానూ రూపొందించే ప్రయత్నం చేశారు. ఇది అభినందించాల్సిన విషయం. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని ప్రకృతిని కాపాడాలని, దాన్ని కొల్లగొట్టి బంగారం సంపాదించినా ఉపయోగం ఉండదని తెలిపారు. తాను దేన్ని ముట్టుకుంటే అది బంగారం అయిపోవాలనే వరం ఇవ్వమని ఓ అత్యాశపరుడు దేవుడిని కోరుకోవడం, దాని పర్యావసానంకు సంబంధించిన కథ చాలా మంది చిన్నప్పుడు చదివి ఉంటారు. అదే ఇందులోనూ చూపించారు. పోగొట్టుకుంది రాబట్టు కోవాలంటే... పడగొట్టింది నిలబెట్టాలనే సందేశంతో సినిమా సాగింది.
నటీనటుల విషయానికి వస్తే... కొత్తవాళ్ళైనా అయాన్, అహల్యా బమ్రూ బాగా చేశారు. శాలిని కొండేపూడి, బెనర్జీ, తులసి, రాహుల్ రవీంద్రన్, వంశీధర్ గౌడ్, మహేశ్, జూనియర్ రేలంగి, శివన్నారాయణ, అగు స్టాన్లీ చిడోజీ ఇతర కీలక పాత్రలు పోషించారు. అనుదీప్ కె.వి. అతిథిపాత్రలో చటుక్కున మెరిస్తే, స్టార్ హీరో విజయ్ దేవరకొండ క్లయిమాక్స్ లో షాక్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. పాటలు సో... సో...గా ఉన్నా, దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) నేపథ్య సంగీతం బాగుంది. మాటలను పాటల్లా రిధమిక్‌గా పలకడం చాలా కష్టమైన పని. అయినా ఆర్టిస్టులంతా దాన్ని ఇష్టంతో చేశారు. సింగీతం విజన్ ను తెర మీదకు తీసుకురావడంలో నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంతగా కష్టపడ్డారనేది సినిమా చూస్తుంటే అర్థమౌతోంది. కాకపోతే సామాన్య ప్రేక్షకుడు కోరుకునే వినోదాన్ని 'సింగ్ గీతం' ఇవ్వలేకపోయింది. దీంతో ఎలాంటి అంచనాలు లేకుండా సినిమాకు వచ్చిన ఆడియన్స్ నిరాశకు గురికావటం ఖాయం. అయితే... పర్యావరణ హితాన్ని కాంక్షించే వారి మనసుల్ని ఈ సినిమా మెప్పిస్తుందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ట్యాగ్ లైన్: సందేశాత్మకం... సింగ్ గీతం...