
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ దర్శించుకున్నారు. కుమారుడు అనంత్ అంబానీ, కోడలు రాధికాతో కలిసి ఆయన శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు
నిర్వహించారు. కాగా అంబానీ కుటుంబం తిరుమలకు చేరుకున్న సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు ఘన స్వాగతం పలికారు. టీటీడీ ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వయంగా ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం చెప్పి, శ్రీవారి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.అనంతరం అంబానీ కుటుంబం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ మార్గం ద్వారా ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. శ్రీవారి కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆశీర్వదిస్తూ వేద మంత్రోచ్చారణల మధ్య అంబానీ కుటుంబానికి ప్రత్యేక ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని అందజేసి సత్కరించారు.అయితే దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలలో ఒకరైన ముఖేశ్ అంబానీ తరచూ ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. తిరుమల శ్రీవారిపై ఆయన కుటుంబానికి విశేష భక్తి ఉందని, ముఖ్యమైన కుటుంబ, వ్యాపార సందర్భాల ముందు శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోందని సన్నిహితులు చెబుతున్నారు. అంబానీ కుటుంబం తిరుమల పర్యటన నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లను టీటీడీ విజిలెన్స్, పోలీసు శాఖలు మరింత కట్టుదిట్టం చేశాయి. అంబానీ కుటుంబం శ్రీవారి దర్శనం అనంతరం తిరుమలలో కొద్దిసేపు గడిపి అనంతరం తిరిగి వెళ్లినట్లు సమాచారం.