
వర్షాకాలంలో వేడివేడిగా ఏదైనా రుచికరమైన స్నాక్ తింటే ఆ అనుభూతి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాకాలంలో కొన్ని ప్రత్యేకమైన స్నాక్స్ తయారు చేస్తారు. అందులో మొదటిది మిర్చి బజ్జీ. పెద్ద
పచ్చి మిరపకాయలను శనగపిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేయించి తయారు చేసే ఈ బజ్జీలు వేడిగా ఉన్నప్పుడు తింటే అద్భుతంగా ఉంటాయి. వేడివేడి మిర్చి బజ్జీతో అల్లం చట్నీ లేదా టమాటా సాస్ తీసుకుంటే రుచి మరింత పెరుగుతుంది.
వర్షాకాలంలో తినే మరో బెస్ట్ స్నాక్ పకోడి. ఉల్లిపాయ, పాలకూర, క్యాబేజీ లేదా ఇతర కూరగాయలతో తయారు చేసే పకోడీలు కరకరలాడే రుచితో అద్భుతంగా ఉంటాయి. వేడి టీతో కలిసి ఉల్లిపాయ పకోడీలు తినడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. వీటిని ఇంట్లోనే తక్కువ సమయంలో సులభంగా తయారు చేసుకోవచ్చు.
పునుగులు కూడా తెలుగు ప్రజలకు ఎంతో ఇష్టమైన సంప్రదాయ స్నాక్. దోశ పిండితో తయారు చేసే ఈ పునుగులు బయట కరకరలాడుతూ లోపల మెత్తగా ఉంటాయి. కొబ్బరి చట్నీ లేదా పల్లీ చట్నీతో కలిపి తింటే వీటి రుచి మరింత పెరుగుతుంది.
గారెలు కూడా వర్షం పడుతున్నప్పుడు తినే బెస్ట్ స్నాక్స్. మినప్పప్పుతో తయారు చేసే గారెలు ప్రోటీన్లతో పాటు మంచి రుచిని కూడా అందిస్తాయి. బయట వర్షం కురుస్తుండగా వేడివేడిగా గారెలు, అల్లం పచ్చడి లేదా కొబ్బరి చట్నీతో కలిసి తింటే ఆ టేస్ట్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
మొక్కజొన్న కంకిని కూడా చాలామంది ఇష్టంగా తింటుంటారు. రోడ్ల పక్కన కాల్చిన, లేదా ఉడకబెట్టిన మొక్కజొన్న కంకిపై నిమ్మరసం, ఉప్పు, కారం చల్లి తినడం చాలామందికి ఇష్టం ఉంటుంది. మొక్కజొన్న సహజమైన రుచితో పాటు పోషక విలువలు కూడా కలిగి ఉంటుంది కాబట్టి అన్ని వయసుల వారికి మంచి ఎంపిక.
వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా టీ లేదా కాఫీతో పాటు బిస్కెట్లు, మురుకులు, చెకోడీలు వంటి స్నాక్స్ కూడా చాలామంది ఇష్టంగా తింటారు. ఈ స్నాక్స్ ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. అలాగే ఎక్కువకాలం నిల్వ ఉంటాయి.