
కొన్ని సంవత్సరాల క్రితం మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని కుదిపేసిన అంతర్గత తిరుగుబాటు.. ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో, ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్‌లో ప్రతిబింబిస్తూ మమతాబెనర్జీని ఉక్కిరి
బిక్కిరి చేస్తోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా 15 ఏళ్లు ఏకఛత్రాధిపత్యంగా ఏలిన మమతా బెనర్జీకి ఓటమి తర్వాత టీఎంసీలో తలెత్తిన తిరుగుబాటు పెద్ద తలనొప్పిగా మారింది. ఆమె పరిస్థితికి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే పరిస్థితికీ రాజకీయంగా కొన్ని పోలికలు, మరెన్నో భేదాలు కనిపిస్తాయి. రెండూ కూడా బలమైన ప్రాంతీయ పార్టీలు. కుటుంబ పాలన, అంతర్గత తిరుగుబాట్లను ఎదుర్కొన్నవే కావడంతో ఈ పోలికలు తెర మీదకొచ్చాయి. ఉద్ధవ్ థాక్రే పార్టీలో ఏక్నాథ్ షిండే వర్గం తిరుగుబాటు చేసి, పార్టీని, ప్రభుత్వాన్ని చీల్చింది. అదే విధంగా, మమతా బెనర్జీ పార్టీ లోనూ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ నాయకత్వానికి వ్యతిరేకంగా బహిరంగంగా తిరుగుబాటు చేశారు
రెండు పార్టీలూ జాతీయ పార్టీల ఆధిపత్యాన్ని ముఖ్యంగా బీజేపీని ప్రాంతీయ స్థాయిలో అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నవే. ఉద్ధవ్ థాక్రే పార్టీలో చీలిక వచ్చి ఆయన ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు. కానీ.. మమతా బెనర్జీ తన పార్టీలో ఎంతటి సంక్షోభం, నాయకుల ఫిరాయింపులు ఉన్నప్పటికీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మూడు సార్లు అధికారంలో కొనసాగారు. అయితే మమతా ఘోరపరాజయం తర్వాత కూడా టీఎంసీలో మమతా బెనర్జీ, అభిషేక్‌ల ఆధిపత్యాన్ని సహించలేక టీఎంసీ శాసనసభా పక్షం, పార్లమెంటరీ పక్షాల్లో తిరుగుబాటు మొదలైంది.
2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీతో తెగతెంపులు చేసుకున్న శివసేన.. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రిగా 2022 వరకు ఈ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగింది. 2022లో ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడం వల్ల మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం పడిపోయింది. ఆ తర్వాత షిండే వర్గం.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2026లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీకి ఎదురైన ఘోర పరాజయం తర్వాత పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటు, పార్లమెంటులో 20 మంది టీఎంసీ ఎంపీలు ఎన్డీఏ వైపు మొగ్గుచూపుతున్నాయి. ఇవన్నీ కలిపి మమతా బెనర్జీ రాజకీయ భవిష్యత్తుతో పాటు ఇండియా కూటమి అస్థిత్వాన్ని ప్రశ్నార్ధంగా మార్చే పరిస్థితి తలెత్తింది.
1998లో కాంగ్రెస్ నుంచి విడిపోయి మమతా బెనర్జీ టీఎంసీని స్థాపించినప్పటి నుంచి, బెంగాల్ రాజకీయాల్లో బలమైన శక్తిగా ఎదిగారు. 2011లో దశాబ్దాలుగా ఉన్న వామపక్ష ప్రభుత్వాన్ని గద్దె దించి, టీఎంసీ మొదటి సారిగా అధికారంలోకి రావడం బెంగాల్ రాజకీయాల్లో చారిత్రక మలుపు. వరుసగా మూడు సార్లు సీఎంగా పనిచేసిన మమత, బెంగాల్ దీదీగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో ముద్ర వేసుకున్నారు. అయితే ఒకప్పుడు మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడైన సువేందు అధికారి, బీజేపీలో చేరి, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదగడం.. టీఎంసీని రాజకీయంగా, మమతాను మానసికంగా కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఎన్నికల్లో బీజేపీ బెంగాల్లో హిందుత్వ, జాతీయత నినాదాలు, అభివృద్ది మంత్రంతో టీఎంసీని దెబ్బకొట్టగలిగింది. టీఎంసీకి ముస్లిం ఓటు బ్యాంక్ పార్టీగా ముద్ర వేయగలిగింది.
ప్రతిపక్ష పాత్రకు పరిమితమైన టీఎంసీ హైకమాండ్ సోవందేబ్ చట్టోపాధ్యాయను అసెంబ్లీలో లీడర్ ఆఫ్ ఆపోసిజన్గా ఎంపిక చేయడం ముసలానికి కారణమైంది. టీఎంసీ నుంచి గెలిచిన 80 మందిలో సుమారు 58 మంది ఎమ్మెల్యేలు పార్టీ నిర్ణయాన్ని తిరస్కరించి, బహిష్కృత ఎమ్మెల్యే రితబ్రతా బెనర్జీకి మద్దతు ప్రకటించి మమతపై తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటు టీఎంసీలో మమతా, అభిషేక్ బెనర్జీల పెత్తనంపై అసంతృప్తిని బహిరంగం చేసింది. శాసనసభా పక్షం చీలికతో మల్లగుల్లాడు పడుతున్న దీదీకి తర్వాత పార్టీ ఎంపీలు కూడా షాక్ ఇచ్చారు. ఢిల్లీ లోని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ నివాసంలో, సువేందు అధికారి సమక్షంలో, 22 మంది టీఎంసీ లోక్‌సభలు సమావేశమై, సీనియర్ ఏంపీ డాక్టర్ కాకోలీ ఘోష్ దస్తిదార్‌ను చీలిక వర్గ నాయకుడిగా ఎన్నుకున్నారు. .బెంగాల్ అభివృద్ధికి ఎన్డీఏ మద్దతు అవసమని కాకోలీ ఘోజ్ ప్రకటించి, టీఎంసీకి షాక్ ఇచ్చారు. దాంతో ఢిల్లీలోని కాన్సిటిట్యూషన్ క్లబ్లో ఇండియా కూటమి నేతలతో మమతా హడావుడిగా సమావేశమయ్యారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్, తదితర నేతలు ఆ మీటింగ్‌లో పాల్గొన్నారు. సమావేశంలో మమత.. ‘నా సొంత ప్రజల ద్రోహం నన్ను ఛిన్నాభిన్నం చేసింది’ అని కన్నీళ్లు పెట్టుకున్నట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఈ మీటింగుకి డీఎంకే, ఆప్‌లు హాజరవ్వకపోవడం ఇండియా కూటమిలో విభేదాలను బయటపెట్టింది.
టీఎంసీకి లోక్‌సభలో 28 మంది ఎంపీ ఉన్న నేపథ్యంలో.. 22 మంది ఎన్డీఏకి మద్దతు ప్రకటించడంతో, పార్టీ మూడింట రెండొంతుల మెజార్టీతో చీలిపోయి, అనర్హత వేటుకు అవకాశం లేకుండా పోయింది. చీలిక వర్గం ఎంపీలు వెంటనే బీజేపీలో చేరకుండా, ఎన్డీఏకి మద్దతు ఇచ్చే సెపరేట్ పార్లమెంటరీ బ్లాక్‌గా గుర్తింపు కోరి, చట్టపరమైన సమస్యలను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. లోక్‌సభలో టీఎంసీ నుంచి వేరుపడి సెపరేట్‌గా సీట్లు కేటాయించాలని స్పీకర్‌కు లేఖ రాశారు.
ఆ క్రమంలో టీఎంసీ లోక్‌సభ చీఫ్ విప్ విషయమై కూడా రెండు వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. మరోవైపు టీఎంసీ సీనియర్ రాజ్యసభ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం, పార్టీలో అంతర్గత అసంతృప్తిని మరింత బహిర్గతం చేసింది. టీఎంసీలో ‘సుప్రీమో’గా విస్తృత అధికారాలు చెలాయించిన మమతాబెనర్టీకి ఇవన్నీ మింగుడుపడని అంశాలే.
ఉద్ధవ్ ఠాక్రే విషయానికి సంబంధించి శివసేనలో ఎకనాథ్ షిండే తిరుగుబాటు, ఎమ్మెల్యేలు, ఎంపీల్లో చీలిక , షిండే వర్గం ఎన్డీఏ వైపు మొగ్గు .. ఇవన్నీ చివరకు ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని కూల్చి, పార్టీని రెండుగా చీల్చాయి. టీఎంసీలో అదే సీన్ రిపీట్ అవుతూ.. ఎమ్మెల్యేల తిరుగుబాటు, పార్లమెంటులో 20 మంది ఎంపీలు ఎన్డీఏ వైపు మొగ్గు చూపుతుండటంతో.. అధికారంలో కోల్పోయిన టీఎంసీ కూడా శివసేన తరహాలో విభజన దిశగా నడుస్తోందంటున్నారు విశ్లేషకులు.
టీఎంసీ ఎంపీల్లో తిరుగుబాటుతో లోక్‌సభలో టీఎంసీ బలం గణనీయంగా తగ్గిపోయి, ఇండియా కూటమిలో మమతా బెనర్జీ ప్రభావం లేకుండా పోయే అవకాశముంది. మొత్తమ్మీద టీఎంసీ, డీఎంకే, ఆప్ వంటి కీలక భాగస్వాముల్లో కనిపిస్తున్న పరిస్థితులు, 2029 లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి వ్యూహాలు, మనుగడపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. 22 మంది టీఎంసీ ఎంపీలు ఎన్టీఏకి మద్దతిస్తే, లోక్‌సభలో ఇండియా కూటమి తృతీయ శక్తిగా నిలబడే అవకాశాలు మరింత తగ్గుతాయి. ఇండియా కూటమిలోని పార్టీలు టీఎంసీలో చీలికను సెక్యులర్ శక్తులపై దాడి, కేంద్ర ప్రభుత్వ అధికార దుర్వినియోగం గా చూపే ప్రయత్నం చేస్తుండటంతో.. బెంగాల్ రాజకీయ సంక్షోభం, అభివృద్ధి, సెక్యులరిజం, ద్రోహం అంశాల మధ్య జరుగుతున్న పబ్లిక్ డిబేట్‌గా మారింది.
చారిత్రక మైలురాయిని అధిగమించిన ప్రధాని మోదీ!
పశ్చిమ ఆసియా సంక్షోభం.. భారత్ ఆర్థిక మార్గం ?
.