మనం కడుపు నొప్పితో బాధపడుతున్నప్పుడు మనసుకు ఏ పని చేయాలని అనిపించదు. చాలా అసౌకర్యంగా ఉంటుంది. అయితే కడుపునొప్పికి వెంటనే టాబ్లెట్లు వేసుకోవడం కంటే మన ఇంట్లో, మన వంటగదిలో ఉండే కొన్ని సహజమైన వస్తువలతో
కడుపు నొప్పిని సులభంగా తగ్గించుకోవచ్చు. మన పెద్దవాళ్ల కాలం నుంచి వస్తున్న ఈ చిట్కాలు సురక్షితం మాత్రమే కాదు.. చాలా బాగా పనిచేస్తాయి. వాస్తవానికి మన జీర్ణవ్యవస్థ చాలా సున్నితమైనది. మారిన లైఫ్ స్టైల్, సమయానికి తినకపోవడం లేదా ఒత్తిడి వల్ల జీర్ణవ్యవస్థ త్వరగా దెబ్బతింటుంది. ఇలాంటి సమయంలో ఇంగ్లీష్ మందుల కంటే ప్రకృతి సిద్ధమైన నివారణలే శరీరానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉపశమనాన్ని ఇస్తాయి. అంతే కాకుండా ఇవి సమస్యను మూలాల నుంచి నయం చేయడానికి సహాయపడతాయి. కాబట్టి కడుపునొప్పి తీవ్రతరం కాకముందే మన ఇంట్లో ఉండే చిన్న చిన్న చిట్కాలతో చెక్ పెట్టొచ్చు. అంజనాదేవి గారు చెప్పిన చిట్కాకడుపు నొప్పి తొందరగా తగ్గాలంటే పెరుగు + మెంతులు కలుపుకుని తినడం వల్ల ఉపశమన లభిస్తుందని తెలిపారు. ఆ వీడియోను రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఎక్స్ (X)లో షేర్ చేశారు. నానమ్మ కడుపునొప్పికి మెడిసిన్స్ ఉన్నాయి అని ఉపాసన చెబుతుండగా.. పెరుగు + మెంతులు మంచివమ్మా.. పాతకాలం నుంచి వస్తున్న ఆయుర్వేదం. ఇవి తింటే తొందరగా తగ్గిపోతుంది అని అంజనా దేవి చెబుతున్నారు. పెరుగు ఎందుకు మంచిదంటే?పెరుగులో ప్రోబయోటిక్స్ మెండుగా ఉంటాయి. ముఖ్యంగా లాక్టోబాసిల్లస్ అనే మంచి బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుంది. కడుపునొప్పికి ప్రధాన కారణం జీర్ణవ్యవస్థలో చెడు బ్యాక్టీరియా పెరగడమే. పెరుగులోని మంచి బ్యాక్టీరియా చెడు బ్యాక్టీరియాపై పోరాడి పొట్టలో సమతుల్యతను కాపాడుతుంది. అంతే కాకుండా ఎసిడిటీ లేదా మసాలా, కారం ఉండే ఆహారం తినడం వల్ల కడుపులో మంట పుట్టినప్పుడు పెరుగులోని యాంటాసిడ్ గుణాలు కడుపును చల్లబరిచి తక్షణ ఉపశమనం ఇస్తుంది. అలాగే కడుపు బాలేనప్పుడు జీర్ణవ్యవస్థ చాలా బలహీనంగా ఉంటుంది. అలాంటి సమయంలో పెరుగు చాలా తేలికగా జీర్ణమవడమే కాకుండా పేగుల కదలికలను క్రమబద్ధీకరిస్తుంది. మెంతులు ఎందుకు పనిచేస్తాయంట? మెంతుల్లో మ్యుసిలేజ్ అనే జిగురు లాంటి పదార్థం ఉంటుంది. ఇది కడుపు లోపలి గోడలపై ఒక రక్షణ పొరలా ఏర్పడుతుంది. దీనివల్ల వచ్చే ఎసిడిటీ వల్ల వచ్చే అల్సర్లు, మంట, నొప్పి తగ్గుతాయి. మెంతుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉండటం వల్ల వాపును, నొప్పిని తగ్గించే గుణాలు ఉన్నాయి. అలాగే మెంతులు జీర్ణరసాల ఉత్పత్తిని ప్రేరేపించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీనివల్ల అజీర్తి తగ్గి గ్యాస్ త్వరగా విడుదలవుతుంది. కడుపు నొప్పి తగ్గించే మరికొన్ని చిట్కాలు భోజనం చేసిన తర్వాత కొన్ని సోంపు గింజలు తినడం వల్ల జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. ఇది కడుపులో గ్యాస్, ఎసిడిటీని తగ్గించి పేగుల్లో వచ్చే నొప్పులను నయం చేయడానికి దోహదపడతాయి. జీలకర్ర నీరు కూడా కడుపు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తాయి. ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ జీలకర్ర వేసి బాగా మరిగించి ఆ నీటిని గోరువెచ్చగా తాగితే కడుపు ఉబ్బరం నొప్పి నిమిషాల్లో మాయమవుతాయి. జీర్ణసమస్యలకు వాము రామబాణంలా పనిచేస్తుంది. కడుపులో గ్యాస్ చేరినప్పుడు లేదా తిన్న ఆహారం అరగనప్పుడు వాము తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది.ముఖ్య గమనిక: ఈ కథనంలోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. అలాగే పాటించడం, పాటించకపోవడం పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. సమయం తెలుగు వీటిని ధృవీకరించడం లేదు.