
దిల్లీ: అధీకృత తీర్థయాత్రల ప్రయాణ సేవల సంస్థల పేరుతో హెలికాప్టర్ బుకింగ్‌కు నకిలీ వెబ్సైట్లు నడిపి దేశవ్యాప్తంగా పర్యాటకులను మోసం చేశారనే ఆరోపణలపై దిల్లీలో ముగ్గురు అరెస్టయ్యారు. వీరిలో ఓ
ఇంజినీరింగ్ విద్యార్థి కూడా ఉన్నట్లు పోలీసులు గురువారం తెలిపారు. ప్రభుత్వ ట్రావెల్ బుకింగ్ ఫ్లాట్‌ఫాంను పోలి ఉన్న నకిలీ వెబ్సైట్ ద్వారా హెలికాప్టర్ సేవలను బుక్ చేసుకునేందుకు యత్నించి రూ. 20 వేలు మోసపోయిన ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. మతపరమైన యాత్రలు, పర్యాటక ప్రదేశాల కోసం హెలికాప్టర్ సేవలను కోరుకునే వినియోగదారులను ఆకర్షించేందుకు నిందితులు ప్రభుత్వం నిర్వహించే ట్రావెల్ వెబ్సైట్లకు నకిలీలను సృష్టించి, నిర్వహించారు. వినియోగదారులను ఆకర్షించేందుకు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలలో ఆన్లైన్ ప్రకటనల ద్వారా వాటిని ప్రచారం చేశారు. ఈ నెల 21న వచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ఓంప్రకాశ్ కుమార్, రోహిత్ కుమార్ అనే ఇద్దరు నిందితులను బిహార్‌లోని నలందా జిల్లాలో అదుపులోకి తీసుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని జౌన్‌పుర్‌కు చెందిన శ్రేయాస్ తివారీ అలియాస్ శివం అనే ఇంజినీరింగ్ విద్యార్థి ఈ నకిలీ వెబ్సైట్లను నిర్వహిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. శివంను నొయిడాలో అరెస్టుచేశారు. ఎనిమిది మొబైల్ఫోన్లు, రెండు ల్యాప్‌టాప్‌లు, ఒక ఐప్యాడ్, పలు డెబిట్‌కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇదే విషయంపై దేశవ్యాప్తంగా మొత్తం 30 ఫిర్యాదులు వచ్చాయని, రూ.10 లక్షల వరకు మోసం జరిగిందని పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.