
ఆంధ్రప్రదేశ్లో పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభిస్తోంది. వేలం కేంద్రాల్లో పొగాకు బేళ్ల తిరస్కరణ (రిజెక్షన్లు) గణనీయంగా తగ్గడం రైతులకు పెద్ద ఊరటనిస్తోందని రాష్ట్ర
వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. గతంలో 30 నుంచి 37 శాతంగా ఉన్న తిరస్కరణలు, ప్రస్తుతం సుమారు 20 శాతానికి తగ్గాయని ఆయన వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్లో నాణ్యమైన పొగాకుకు డిమాండ్ పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని ఆయన వివరించారు.పొగాకు కొనుగోళ్ల పురోగతిపై మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఇతర ప్రజాప్రతినిధులు మరియు ఉన్నతాధికారులతో గురువారం మంత్రి అచ్చెన్నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొగాకు బోర్డు ఆధ్వర్యంలోని వేలం కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 1.56 కోట్ల కిలోల పొగాకు విక్రయాలు జరిగాయని పేర్కొన్నారు.రాష్ట్రంలోని 16 వేలం కేంద్రాలకు ప్రతిరోజూ సుమారు 8,000 బేళ్లు వస్తున్నాయని, పది రోజుల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం కొనుగోలు కంపెనీలు అధిక సంఖ్యలో వేలంలో పాల్గొంటున్నాయని మంత్రి తెలిపారు. దీనివల్ల మార్కెట్లో సానుకూల వాతావరణం నెలకొందని, ఇది రైతులకు మేలు చేకూరుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రకాశం, గుంటూరు, తూర్పు గోదావరి జిల్లాల్లోని రైతుల నుంచి చివరి ఆకు వరకు, నాణ్యతకు అనుగుణంగా గిట్టుబాటు ధర చెల్లించి కొనుగోలు చేసేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ సానుకూల పరిణామాలు పొగాకు రైతులకు ఎంతో ఊరటనిస్తున్నాయి.