దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా, రచయితగా తెలుగు సినిమా సామ్రాజ్యాన్ని దశాబ్దాల పాటు ఏలిన మహోన్నత వ్యక్తి దాసరి నారాయణరావు . 2017, మే 30న ఆయన భౌతికంగా దూరమైనా ఆయన సృష్టించిన కళాఖండాలు ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. అయితే తాజాగా దాసరి నారాయణరావు సమాధికి సంబంధించి సోషల్‌మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో పరిశ్రమను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. దాసరి నారాయణరావు, ఆయన ధర్మపత్ని పద్మ సమాధులు సంరక్షణ లేక, చుట్టూ పిచ్చిమొక్కలు, చెత్తాచెదారంతో నిండిపోయి ఉన్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి.* వాచ్మెన్ నుంచి స్టార్ నటుడిగా.. 6.5లక్షల చెట్లతో అడవినే సృష్టించిన టాలీవుడ్ విలన్!దీంతో నెటిజన్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెండితెరపై ఎందరికో జీవితాన్ని ప్రసాదించి, వేల కోట్ల విలువైన ఆస్తులను వదిలివెళ్లిన ఒక లెజెండరీ డైరెక్టర్ సమాధిని కనీసం పట్టించుకునే నాథుడే కరువవ్వడంపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కన్నవారి స్మారక చిహ్నాలను ఇలా వదిలేయడం ఎంతవరకు న్యాయమంటూ దాసరి వారసులపై మండిపడుతున్నారు. ఈ వీడియో కాస్తా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారడంతో పలువురు సినీ ప్రముఖులు తక్షణమే స్పందించారు. రంగంలోకి దిగిన మంచు మనోజ్ , విష్ణు, గీతా ఆర్ట్స్ ఈ హృదయవిదారక విజువల్స్ చూసి హీరో మంచు మనోజ్ తీవ్రంగా చలించిపోయారు. దాసరి వర్ధంతి రోజైన నేడు ఆయన నేరుగా సమాధి వద్దకు చేరుకున్నారు. తెలుగు సినిమాకు ఎన్నో జనరేషన్ల పాటు ఆదర్శంగా నిలిచిన ఒక మహానుభావుడి స్మారకం ఇలా ఉండటం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తన వ్యక్తిగత సిబ్బందితో కలిసి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసే పనులను ఆయనే స్వయంగా పర్యవేక్షించారు. అనంతరం దాసరి, పద్మ గార్ల
విగ్రహాలకు నమస్కరించి నివాళులు అర్పించారు.* ‘నాన్నకు భయపడి ఆ అబద్ధం చెప్పా... అజ్ఞానమే నాకు వరమైంది’: చిరంజీవి క్రమశిక్షణపై చరణ్ ఓపెన్ టాక్ మరోవైపు ఈ విషయం తెలుసుకున్న ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు, ప్రముఖ నిర్మాణ సంస్థ ‘గీతా ఆర్ట్స్’ యాజమాన్యం కూడా తక్షణమే స్పందించాయి. తమ సిబ్బందిని, కార్మికులను అక్కడికి పంపించి, సమాధి చుట్టూ ఉన్న పిచ్చిచెట్లను తొలగించి, ఆ ప్రాంతాన్ని పూర్తిగా పరిశుభ్రంగా మార్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. పరిశ్రమకు పెద్ద దిక్కుగా నిలిచిన వ్యక్తికి, ఆయన వర్ధంతి నాడే ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర భావోద్వేగాన్ని, చర్చను రేకెత్తిస్తోంది. ఈ వ్యవహారంపై నెటిజన్లు సినీ సెలబ్రెటీలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాసరి పెట్టిన భిక్షతో నేడు సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న కొందరు కనీసం ఆయన సమాధిని కూడా పట్టించుకోకపోవడం దారుణమని, ఇండస్ట్రీలో డబ్బుకు తప్ప వ్యక్తులకు గౌరవం ఉండదని ఈ ఘటన మరోసారి నిరూపించిందని కామెంట్లు చేస్తున్నారు.