అమెరికా- ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో హర్మూజ్ జలసంధిలో నౌకలపై జరుగుతున్న వరుస దాడులపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఇటీవల ఒమన్ తీరంలో పలావు జెండా కలిగిన MT
సెట్టెబెల్లో ట్యాంకర్‌పై జరిగిన దాడిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మెరైన్ ఇంజినీర్ సహా ముగ్గురు భారతీయులు మరణించారు. గడిచిన వారం రోజుల్లోనే భారతీయ సిబ్బంది ఉన్న నౌకలపై మూడుసార్లు దాడులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన భారత్.. అమెరికా నేవీ చర్యలపై తీవ్ర నిరసన తెలిపింది. కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘గత కొద్ది రోజులుగా పశ్చిమాసియాలో భారతీయ నావికులకు సంబంధించి అనేక సంఘటనలు చోటుచేసుకున్నాయి.. మేము మా నావికుల సంక్షేమానికి, శ్రేయస్సుకు అత్యంత ప్రాధాన్యతనిస్తాం... ఈ విషయాన్ని మళ్లీ నొక్కి చెప్పనవసరం లేదు. నిన్న ఒమన్ తీరంలో ఒక నౌకపై జరిగిన దాడిని మేము ఖండించాం.. ఆ దాడిలో దురదృష్టవశాత్తు ముగ్గురు భారతీయ పౌరులను కోల్పోయాం’’ అని అన్నారు.‘‘తీవ్ర నిరసనను తెలియజేయడానికి మేము అమెరికా కాన్సులేట్ అధికారిని ఇక్కడికి పిలిపించాం... ఈ ప్రాంతంలో నౌకలపై నిరంతరం జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణకు ప్రత్యక్ష ఫలితం. ఈ దాడులు తప్పక ఆగిపోవాలి. త్వరగా శాంతి, స్థిరత్వాన్ని తిరిగి తీసుకురావడానికి చర్చలు, దౌత్యం జరపాలని కూడా మేము పిలుపునిస్తున్నాం’’ అని ఆయన పేర్కొన్నారు.ఇక, వాణిజ్య నౌకలపై దాడులు ఆగిపోవాలని, అలాగే అంతర్జాతీయ జలాల్లో ప్రయాణించే నావికుల భద్రత, రక్షణ కల్పించాల్సిన అవసరాన్ని సమావేశంలో అధికారులు నొక్కిచెప్పినట్లు సమాచారం. ఈ దాడి తర్వాత 24 మంది భారతీయ సిబ్బందిలో 21 మందిని రక్షించగా, మొదట ఆచూకీ లభించని మరో ముగ్గురిని తర్వాత మరణించినట్లు నిర్ధారించారు. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హర్మూజ్ జలసంధి, దాని పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. అమెరికా తాజా దాడులతో హర్మూజ్ జల సంధిని ఇరాన్ పూర్తిగా మూసివేసింది. అన్నిరకాల నౌకలకు ఈ జల సంధిని మూసివేసినట్లు ప్రకటించింది. రెండు ట్యాంకర్లపై కూడా ఇరాన్ దళాలు దాడులు చేశాయి. అమెరికా యుద్ధనౌకలు సాయంతో దాటేందుకు ప్రయత్నించాయి ఆరోపించాయి.