దేశ రాజకీయాల్లో ‘ కాక్రోచ్ జనతా పార్టీ ’ ఓ సంచలనం. ఓ కేసులో నిరుద్యోగ యువతను ‘బొద్దింకలు’, ‘పరాన్న జీవులు’తో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పోల్చడంతో సీజేపీ ప్రారంభమైన సంగతి
తెలిసిందే. ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే ప్రధాన రాజకీయ పార్టీలకు మించి ఫోలోవర్లు వచ్చారు. ఐదు రోజుల వ్యవధిలోనే రెండు కోట్ల మంది ఫాలోవర్లకు చేరుకున్నారు. దేశం ఎదుర్కొంటున్న సంక్షోభానికి యువతలో అసంతృప్తి ఎలా ఎగిసిపడుతుందనడానికి ఇదే ఓ మచ్చు తునక. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై రాజధానిలో సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే నాయకత్వంలో మొదటిసారి ప్రత్యక్ష నిరసన చేపట్టారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు కోరుతూ దేశవ్యాప్త ఆందోళన చేపడతామని ఆ ధర్నాలోనే దీప్కే ప్రకటించారు.ఈ నేపథ్యంలో దక్షిణ భారతదేశంలో సీజేపీ తొలి నిరసన జూన్ 14న హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో చేపట్టనుంది. విద్యా వ్యవస్థలో జవాబుదారీతనం, పరీక్షా విధానాలలో సంస్కరణలు కోరుతూ చేపట్టిన ‘గోయింగ్ నేషనల్’ ఉద్యమంలో ఈ ఆందోళనలు ఒక భాగమని సీజేపీ చెబుతోంది. సీజేపీ విడుదల చేసిన అధికారిక షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్‌లో నిరసన జూన్ 14న ఉదయం 10 గంటలకు ధర్నా చౌక్‌లో జరగనుంది. విద్యార్థి సంఘాలు, పౌర సమాజ సభ్యులు ఇందులో పాల్గొంటారని అంచనాతో శాంతియుత ప్రదర్శనకు పిలుపునిచ్చారు.అదే రోజున సాయంత్రం బెంగళూరులోని ఫ్రీడమ్ పార్కులో భారీ నిరసన జరుగుతుందని తెలిపింది. దక్షిణాదిన విస్తరణలో భాగంగా ఈ రెండు నిరసనలు చేపట్టినట్టు సీజేపీ పేర్కొంది. జూన్ 11న మహారాష్ట్రలోని పుణేలో నిరసన చేపట్టింది. జూన్ 12న ఉత్తర్ ప్రదేశ్ లక్నో (ఇకో గార్డెన్)లో, పంజాబ్‌లో జూన్ 13న అమృత్‌సర్‌లో, జూన్ 14 హైదరాబాద్, బెంగళూరు, జూన్ 15న రాజస్థాన్ రాజధాని జైపూర్, జూన్ 20 ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు నిర్వహిస్తామని వెల్లడించింది.ప్రశ్నపత్రాల లీకేజీ, ఫలితాల జాప్యం, నియామకాలు, ప్రవేశ పరీక్షలలో పారదర్శకత లోపించడం వంటి సమస్యలను పరిష్కరించడమే ఈ నిరసనల లక్ష్యమని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అన్నారు. ఈ వ్యవస్థ దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేస్తోందని, అధికారులు జవాబుదారీతనంతో వ్యవహరించడం లేదని ఆయన ఆరోపించారు.ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరగనున్న నిరసన ఈ ఉద్యమంలో చివరి, అత్యంత ముఖ్యమైన ఘట్టంగా భావిస్తున్నారు. విద్యా రంగంలోని వ్యవస్థాగత వైఫల్యాలకు బాధ్యుడిగా భావిస్తున్న విద్యాశాఖ మంత్రి రాజీనామాతో సహా తమ డిమాండ్లు నెరవేరే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని దీప్కే పేర్కొన్నారు.ఇటీవలి నిరసనలలో విద్యార్థులు, యంగ్ ప్రొఫెషనల్స్, పౌర సమాజ కార్యకర్తలు పాల్గొన్నారు. స్కూల్, కాలేజీ విద్యార్థులు కూడా హాజరైనట్లు నివేదికలు సూచిస్తున్నాయి. వీరిలో చాలామంది మాస్క్‌లు ధరించి, ప్లకార్డులతో నిరసనలలో పాల్గొనడం సీజేపీకి పెరుగుతున్న ఆదరణను ప్రతిబింబిస్తోంది. ఇప్పుడు నిరసనలు దక్షిణాదికి కూడా విస్తరిస్తున్నందున జూన్ 20న ఢిల్లీలో జరిగే ముగింపు ర్యాలీకి ముందు దేశవ్యాప్తంగా ఊపును తీసుకొచ్చేందుకు సీజేపీ కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు.