ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసే ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్-2027 షెడ్యూల్‌పై బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ ప్రతిష్టాత్మక మెగా టోర్నమెంట్‌ను 2027 అక్టోబర్ 1 నుంచి నవంబర్ 21 వరకు
నిర్వహించేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాత్కాలికంగా తేదీలను ఖరారు చేసినట్లు సమాచారం. ఇందులో అక్టోబర్ 1 నుంచి 7 వరకు వార్మప్ మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా ఈ టోర్నీకి ఆతిథ్యమివ్వనున్నాయి.గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ తేదీలపై ప్రాథమిక అంగీకారం కుదిరిందని సమాచారం. జూలైలో ఎడిన్బర్గ్లో జరిగే ఐసీసీ వార్షిక సాధారణ సమావేశంలో టోర్నీ షెడ్యూల్‌కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ టోర్నీలో మొత్తం 54 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో అత్యధికంగా దక్షిణాఫ్రికాలో 40 మ్యాచ్‌లు జరగనున్నట్లు తెలుస్తోంది. ఆ దేశంలోని 8 వేదికల్లో ఇవి నిర్వహిస్తారట.ఇక జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్, బులవాయోలోని క్వీన్స్, విక్టోరియా ఫాల్స్ వంటి 3 వేదికల్లో 8 నుంచి 10 మ్యాచ్‌లు జరగనున్నాయి. మిగిలిన మ్యాచ్‌లకు నమీబియా ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఉంది. జింబాబ్వేలో కొత్తగా నిర్మిస్తున్న ‘ఫేల్ మోసి-ఓ-తున్యా’ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వచ్చే ఏడాది మే నెలలో లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ స్టేడియంలోనూ ప్రపంచకప్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది.కాగా భారత్ వేదికగా జరిగిన గత వన్డే ప్రపంచకప్‌లో మొత్తంగా 10 జట్లు పోటీ పడ్డాయి. కానీ 2027లో మాత్రం ఆ సంఖ్య 14కు పెరిగింది. ఈ 14 జట్లను తలా ఏడు చొప్పున రెండు గ్రూపులుగా విభజిస్తారు. ప్రతి గ్రూప్ నుంచి మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు ‘సూపర్ సిక్స్’ దశకు అర్హత సాధిస్తాయి. సూపర్ సిక్స్ దశ తర్వాత నాకౌట్ మ్యాచ్‌లు జరుగుతాయి. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆస్ట్రేలియా జట్టు ఈ టోర్నీ బరిలోకి దిగనుంది.