ప్రస్తుతం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) యుగం నడుస్తోంది. ఎక్కడ చూసినా, ఏ రంగంలో అయినా ఏఐ పేరు బాగా వినిపిస్తోంది. అయితే ఇదే ఏఐ కొన్నిసార్లు పక్కదారి పడుతోంది. ఏఐని ఉపయోగించుకుని.. మన
జ్ఞానాన్ని మరింత పెంపొందించుకోవడం సంగతి పక్కన పెడితే.. జ్ఞానం లేకుండానే ఏఐని వినియోగించి.. పనులను సులువు చేసుకుని, షార్ట్‌కట్స్ వెతుక్కుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్డీ చదివే.. పరిశోధక విద్యార్థులు (పీహెచ్డీ స్కాలర్స్).. ఏఐ సాయంతో పరిశోధనలు పూర్తిగా చేయకుండానే.. ప్రాజెక్టు రిపోర్ట్స్ సమర్పిస్తున్నట్లు గుర్తించిన ఓయూ అధికారులు.. వారి ఆట కట్టించేందుకు సరికొత్త ఏఐ చెకింగ్ సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు.పీహెచ్డీ స్కాలర్లు.. చాట్‌జీపీటీ, జెమినై సహా ఇతర ఏఐ టూల్స్ ఉపయోగించి.. పరిశోధన పత్రాలను సమర్పిస్తున్నారని.. వారు సమర్పించిన పీహెచ్డీ థీసిస్‌లను స్పెషల్ సాఫ్ట్‌వేర్‌తో టెస్ట్ చేసి.. అవి సొంతంగా చేసిన పరిశోధనలు కావని గుర్తిస్తున్నారు. గత 2 ఏళ్లలో 600 థీసిస్‌లను పరిశీలించిన అధికారులు వాటిల్లో మార్పులు, చేర్పులు చేయాలంటూ సంబంధిత స్కాలర్లకు సూచిస్తున్నారు. పీహెచ్డీ విద్యార్థులు సమర్పిస్తున్న థీసిస్‌లలో అసలైన, వారు చేసిన పరిశోధనలను గుర్తించేందుకు.. ఉస్మానియా యూనివర్సిటీలో ఈ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను గతేడాది జులై నుంచి ఉపయోగిస్తున్నారు. ఆ థీసిస్‌లో ఎంత శాతం వారు కాపీ కొట్టారు అనేది తెలుసుకునేందుకు అత్యాధునిక టర్నిటిన్ సాఫ్ట్వేర్ సాయంతో గుర్తిస్తున్నారు. చాట్‌జీపీటీ ద్వారా పరిశోధనలు చేశారా.. జెమినై ద్వారా వాటి అంశాలను తెలుసుకున్నారా అనే సమగ్ర సమాచారాన్ని కేవలం 10 నిమిషాల్లో ఈ సాఫ్ట్వేర్ గుర్తిస్తోంది. ఉస్మానియా యూనివర్సిటీతోపాటు.. జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ), హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీల్లో ప్రతీ సంవత్సరం సగటున 1700 మంది విద్యార్థులు పలు అంశాలపై పీహెచ్డీ థీసిస్‌లను సమర్పిస్తున్నారు. ఇందులో టర్నిటిన్ సాఫ్ట్వేర్ సాయంతో పరీక్షించగా.. 40 శాతం వరకు అవన్నీ చాట్‌జీపీటీ సాయంతో తయారు చేసినవే ఉండగా.. మరో 5 శాతం వివిధ థీసిస్‌ల నుంచి సేకరించినవే ఉంటున్నట్లు వెల్లడి కావడం తీవ్ర దుమారం రేపుతోంది. ఇకపై ఇలా ఏఐ సాయంతో పీహెచ్డీ థీసిస్‌లు తయారు చేస్తే 3 ఏళ్ల పాటు ఎక్కడా.. ఎలాంటి పీహెచ్డీ సీటు రాకుండా చేస్తామంటూ యూనివర్సిటీ అధికారులు ఇటీవలే స్టూడెంట్స్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇంగ్లీష్‌లో పదాలను కూర్పు చేయడం కోసం ఏఐని వినియోగిస్తే కాపీ శాతం పెరిగే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. వర్సిటీ తాజా ఆదేశాలతో విద్యార్థుల్లో సరికొత్త భయం నెలకొంది.