
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ ఉపాధ్యాయ నియామక ప్రక్రియపై జగన్ చేసిన ఆరోపణలను ఖండించారు. విజయనగరం, జూన్11
, (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు (Vizianagaram MP Kalisetti Appala Naidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ ఉపాధ్యాయ నియామక ప్రక్రియపై జగన్ చేసిన ఆరోపణలను ఖండించారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా, నిరుద్యోగుల కలలను సాకారం చేస్తూ చేపట్టిన మెగా డీఎస్సీపై జగన్ బురదజల్లే రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహించారు. ఈ రోజు (గురువారం) విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అబద్ధాన్ని వెయ్యి సార్లు చెబితే అది నిజమైపోదని అన్నారు. జగన్ ఎన్ని కుట్రలు చేసినా మెగా డీఎస్సీ పారదర్శకతను కించపరచలేరని స్పష్టం చేశారు.
జగన్ ఐదేళ్ల పాలనలో ఏనాడైనా నిరుద్యోగుల గురించి ఆలోచించారా..? అని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రశ్నించారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి యువతను నట్టేట ముంచిన మాట వాస్తవం కాదా అని నిలదీశారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీని పూర్తిగా అటకెక్కించారని ధ్వజమెత్తారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న జగన్‌కి, నేడు కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీని విజయవంతంగా నిర్వహిస్తుంటే ఓర్వలేక పోతున్నారని మండిపడ్డారు. దాదాపు ఆరేళ్ల తర్వాత ఎంతో ప్రతిష్ఠాత్మకంగా, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన TCS iON ప్లాట్‌ఫారమ్ సహాయంతో, కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానం (CBT) ద్వారా డీఎస్సీ పరీక్షలు నిర్వహించినట్లు తేల్చిచెప్పారు. ఎలాంటి తప్పులకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా ఈ పరీక్షలను నిర్వహించినట్లు గుర్తుచేశారు.
ఈ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని జగన్ చేస్తున్న ఆరోపణలు కేవలం రాజకీయ ఉనికి కోసమేనని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆగ్రహించారు. వైసీపీ హయాంలో పదోతరగతి పేపర్లు లీక్ అయిన చరిత్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసనని చెప్పుకొచ్చారు. లీకులు, స్కామ్‌లకు కేరాఫ్ అడ్రస్ జగన్ రెడ్డినేనని ఎద్దేవా చేశారు. ఏపీలో పారదర్శక పాలన అందిస్తున్న చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని సెటైర్లు గుప్పించారు. లక్షలాది మంది అభ్యర్థుల ఆశలు, భవిష్యత్తుతో ముడిపడి ఉన్న మెగా డీఎస్సీని కోర్టుల చుట్టూ తిప్పి అడ్డుకోవాలని చూసినా, అభ్యర్థుల నమ్మకాన్ని గెలిచి ప్రభుత్వం పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసిందని తెలిపారు.
నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాం..
స్పోర్ట్స్ కోటా లేదా ఇతర విభాగాల్లో ఎక్కడైనా అక్రమాలకు తావులేకుండా పూర్తి స్క్రీనింగ్‌తో డీఎస్సీ పరీక్షలు నిర్వహించినట్లు వివరించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి వారి జీవితాల్లో తాము వెలుగులు నింపుతున్నామని తెలిపారు. తప్పుడు ఆరోపణలతో యువతను తప్పుదోవ పట్టించాలని చూస్తే నిరుద్యోగ లోకం జగన్‌ని క్షమించదని హెచ్చరించారు. ఇప్పటికైనా రాజకీయ స్వార్థం కోసం ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని, లేనిపక్షంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు హెచ్చరించారు
జగన్ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు: హోంమంత్రి అనిత
ప్రధాని మోదీ దేశాన్ని సరికొత్త దిశగా తీసుకెళ్తున్నారు: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telangana News And National News